భారతీయ తాత్విక పథికుడు - సచ్చిదానందమూర్తి
Jan 24 2016 @ 03:39AM
భారతీయ తత్వశాస్త్రం మతంతో ముడిపడి ఉన్నప్పటికీ అది శాస్త్రీయ చింతనను, సైన్స్‌ను వ్యతిరేకించలేదని సచ్చిదానందమూర్తి స్పష్టం చేశారు. వివిధ దేశాల తత్వ శాసా్త్రలను అధ్యయనం చేసి ప్రపంచానికి ఆయన ఒక కొత్త ఆలోచనా ధోరణిని ప్రసాదించారు. పదవీవిరమణ చేసిన తర్వాత స్వగ్రామం జాగర్లమూడిలో పితృపితామహులు నివసించిన ఇంట్లోనే నివసిస్తూ తన మేధస్సును ప్రపంచానికి పంచుతూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా శేష జీవితాన్ని గడిపిన నిజమైన తత్వవేత్త సచ్చిదానంద మూర్తి.
భారతీయ తత్వశాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది అన్వేషణకాదు, జిజ్ఞాసకు ప్రాధాన్యతనిచ్చింది. మతానికి అతీతంగా భారతీయ సనాతన సంప్రదాయం తాత్విక భావజాలానికి పెద్దపీట వేసింది. ప్రపంచంలో అన్ని తాత్విక చింతనల కంటే భారతీయ తాత్విక చింతన ప్రాచీనమైనది. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, భగవద్గీతలు మన నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు తాత్విక దృక్పథంతో సమాధానాలిచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రాచీన కాలంలో జరిగినంతగా భారత దేశంలో ఆధునిక కాలంలో తాత్విక చింతన చేసేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిలో ప్రముఖుడు కొత్త సచ్చిదానందమూర్తి.
తత్వశాస్త్ర రచనలో ఉన్నత ప్రమాణాలు సాధించిన సచ్చిదానందమూర్తికి ఎందుకో బాల్యంలోనే తాత్విక చింతన అబ్బింది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని జాగర్లమూడి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన పూర్వీకులు సంస్కృత భాష పట్ల అభిమానం కలవారు కావడం, బాల్యంలోనే సంస్కృతాన్ని నేర్చుకోవడంతో సచ్చిదానంద మూర్తి దృష్టి వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, భగవద్గీత పురాణేతిహాసాలు, దయానంద సరస్వతి, వివేకానందుడి జీవిత చరిత్రలపై పడింది. కాశీ కృష్ణమాచార్యులు, పరిపూర్ణాచార్యుల వద్ద సంస్కృతాధ్యయనం చేశారు. చిన్పప్పటినుంచే వేద మంత్రాలను ఉచ్ఛరిస్తూ వేదార్థాలను చెప్పే సచ్చిదానంద మూర్తిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయే వారు. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే ఆయన హనుమద్విజయం అనే పుస్తకం రాశారు. ఇంత చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పనిని చేసినవారు భారత దేశంలో శంకరాచార్యుడు తప్ప మరొక్కరు లేరు. సచ్చిదానంద మూర్తి తన భగవద్గీత గ్రంథంలో 20, 30 గ్రంథాలను ఉటంకిస్తూ ప్లేటో, క్రీస్తు, సిసిరో వంటి వారి వ్యాఖ్యానాలను కూడా పొందుపరచడం విశేషం. అరబిందో, మహాత్మాగాంధీ ఆశ్రమాలను ఆయన చిన్ననాడే సందర్శించారు. 12 సంవత్సరాల వయసులోనే ప్రాథమిక, మాధ్యమిక, విశారద పరీక్షల్లో ఉత్తీర్ణులై హిందీ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్ననాడే గీతానిధి, ఉపన్యాస కేసరి వంటి అనేక బిరుదులను పొందారు.
యుక్త వయసులో వైట్ హెడ్, ఉడ్‌రాన్, రామతీర్థ, సర్వేపల్లి రాధాకృష్ణన్ రచనలు ఆయనను ఆకర్షించాయి. గుంటూరు కళాశాలలో విద్య పూర్తి చేసిన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఆనర్స్ డిగ్రీ, డాక్టరేట్ తీసుకున్నారు. పలు యూనివర్సిటీల్లో లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, డీన్‌గా, ప్రిన్స్‌పాల్‌గా పనిచేశారు. అమెరికాలోని ప్రిన్సిటన్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సచ్చిదానంద మూర్తి తాత్విక చింతన ఎంత ప్రసిద్ధి చెందిందంటే ఆయన ఎంఎన్‌రాయ్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ తదితరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారరావు లాంటి మేధావులు సచ్చిదానందమూర్తిని అభిమానించేవారు. ఆయనతో చర్చించేవారు. భారతీయ తత్వశాస్త్రం మతంతో ముడిపడి ఉన్నప్పటికీ అది శాసీ్త్రయ చింతనను, సైన్స్‌ను వ్యతిరేకించలేదని సచ్చిదానందమూర్తి స్పష్టం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత ఏ భారతీయ తత్వ వేత్త చేపట్టని అంశాలను అధ్యయనం చేసిన వ్యక్తి సచ్చిదానంద మూర్తి అని సుప్రసిద్ధ జాతీయ భాషా శాస్త్రవేత్త ఆచార్య సునీతికుమార్ ఛటర్జీ ప్రశంసించారు.
తత్వ శాస్త్రంపైనే కాకుండా విదేశాంగ విధానం, ప్రపంచ శాంతి, రాజకీయాలు, చరిత్ర, సాహిత్యం లాంటివాటిని సచ్చిదానందమూర్తి స్పృశించారు. ప్రణాళికా రూపకల్పనలో తత్వవేత్తలు పాలుపంచుకునే అవకాశం ఉండాలి అని వాదించి సామాజిక చింతన పట్ల నేతలకు అవగాహన క ల్పించిన వ్యక్తి సచ్చిదానంద మూర్తి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నేతలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏది ఉన్నదో అదే తత్వం-ఉన్నది ఉన్నట్లుగా చూడడం తత్త్వ శాస్త్రం, ఉన్నదాని స్వరూపాన్ని గ్రహించడం తత్త్వ శాస్త్ర లక్ష్యం, వేదాంతం, తత్వ శాస్త్రంలో భాగం అని ఆయన నిర్వచించారు. బౌద్ధతత్వం నుంచి వైదిక ధర్మ పరంపర వరకు ఆయన అధ్యయనం చేసి భారతీయ తత్వశాస్త్ర విలువను ప్రపంచ దేశాలకు చాటి చెప్పి ప్రపంచ ప్రఖ్యాత తత్వశాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.
ఇండియన్ ఫిలాసఫికల్ కాంగ్రె్‌సకు అధ్యక్షుడుగా ఆయన భారతీయ తత్వశాసా్త్రనికి ఎనలేని సేవలను అందించారు. ఆఫ్రో ఏసియన్ ఫిలాసఫీలపై ఇంగ్లీషులో 30కి పైగా, తెలుగులో 12 పైగా అత్యంత ప్రాముఖ్యతగల గ్రంథాలను రచించారు. రామానుజ దర్శనం, మనిషి-ముక్తి ప్రమాణ పద్ధతి, ఈశోపనిషత్తు మొదలైన గ్రంథాలను తెలుగులో రచించి సర్ సిఆర్‌రెడ్డి ప్రశంసలు పొందారు. ఆయన రచించిన రెవలేషన్ అండ్ రీజన్ ఇన్ అద్వైత వేదాంత గ్రంథం మతాలలో ఉన్న తాత్విక చింతనపై మహోన్నత గ్రంథంగా ప్రఖ్యాతి చెందింది. అదే విధంగా శంకరాచార్య మీమాంస, అద్వైతం గురించి ఆయన రాసిన పుస్తకం దార్శనిక గ్రంథాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆయన రాసిన మరో పుస్తకం స్టడీస్ ఇన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పీస్ అనే గ్రంథం రాజకీయాలు, యుద్ధం, శాంతికి సంబంధించి సునిశిత పరిశీలన జరిపింది. ప్రపంచ శాంతి కోసం మేధావులు ఏకమై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. వివేచన-విశ్వాసం పరస్పర విరుద్ధాలు కావని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ తత్వవేత్తల్లో ఫార్ ఈస్టరన్ ఫిలాసఫీపై రచించిన మొదటి తత్వవేత్త సచ్చిదానందమూర్తే. విజ్ఞానసర్వస్వంలో దర్శనములు-మతములు పేర వెలువరించిన 7వ సంపుటానికి ఆయన సంపాదకత్వం వహించారు. తత ్వశాస్త్రంలో అత్యున్నత కృషి చేసిన వారికి ప్రదానం చేసే డాక్టర్ బీసీ రాయ్ నే షనల్ ఆవార్డు తొలిసారిగా కేంద్రం 1982లో డాక్టర్ సచ్చిదానందమూర్తికి ప్రదానం చేశారు. తత్వశాస్త్రంలోనూ, ఉన్నత విద్యా విధానంలోనూ ఆయన చేసిన కృషికి 1984లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌లను ఇచ్చి సత్కరించాయి. దేశవిదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థలు ఆయననను వివిధ ఆవార్డులతో సత్కరించాయి. మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ , బల్గేరియాలోని సోఫియా యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా, జర ్మనీలోని పోల్-విట్టన్‌బర్గ్ యూనివర్సిటీలు, దేశంలో 9 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. స్వామి ప్రణవానంద తత్వశాస్త్ర జాతీయ బహుమతి, కలకత్తాలో దర్శన్ విజ్ఞాన్ ఫౌండేషన్, రాజ్యలక్ష్మీ ఆవార్డు, రాషీ్ట్రయ సంస్కృత విద్యాపీఠ్, తిరుపతి మహోమహోపాధ్యాయ, వారణాసి సంస్కృత విద్యా పీఠ్ అవార్డులు ప్రదానం చేశాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రీసర్చ్ లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు.
ప్రపంచమంతా చుట్టి వచ్చినా పదవీవిరమణ చేసిన తర్వాత స్వగ్రామం జాగర్లమూడిలో పితృపితామహులు నివసించిన ఇంట్లోనే నివసిస్తూ తన మేధస్సును ప్రపంచానికి పంచుతూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా శేష జీవితాన్నిగడిపిన నిజమైనతత్వవేత్త సచ్చిదానంద మూర్తి. తాను విశ్వసించిన సత్యాలకోసం, విశ్వాసాల కోసం ఎవరికీ తలవంచని వ్యక్తిత్వం ఆయనది. 2011 జనవరి 24న తన 87వ ఏట మరణించిన సచ్చిదానంద మూర్తి ప్రపంచ తత్వశాస్త్ర ప్రపంచంలో భారతీయ తత్వశాస్త్ర బావుటాను ఎగురవేశారు.
వై.ఎల్.పి
(నేడు సచ్చిదానంద మూర్తి వర్ధంతి)
No comments:
Post a Comment