Thursday, July 9, 2020

మనువుకు చోటు - మనిషికి చేటు!

మనువుకు చోటు - మనిషికి చేటు! 


నవ తెలంగాణ
సంపాదకీయం  03 Jul  2020

మనువుకూ నేటి కాషాయ పాలకులకూ మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ప్రజా చైతన్యంతో మాత్రమే నాటి మనువును, నేటి ఆ మనువు వాసరసులనూ మనం ఎదుర్కోగలం. వారి కుట్రలను జయించి సమన్యాయాన్ని, స్వేచ్ఛా భారతాన్నీ సాధింగలం.

వాడు మొత్తం మానవ జాతే ద్వేషించాల్సిన మనిషి. మొత్తం మానవ జాతి తిరస్కరించాల్సిన మనిషి. పేరు మనువు. విషం సుమీ వాడి అణువణువు. అలాంటి విషపు క్రిములను కూడా 'మనీషి'గా భావించి, పూజించే వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. వాడి మార్గంలో నడిచే వాళ్ళు, నడవాలని బోధించే వాళ్ళు సైతం మన మధ్యలోనే ఉన్నారు. వాడు రచించిన పరమ దుర్మార్గమైన 'మనుస్మృతి' ఆదర్శంగా భారత శిక్షాస్మృతిని రచించాలని కలలుగనే దుర్మార్గులూ ఇంకా మన మధ్యనే ఉన్నారు. మనతోనే ఉన్నారు.. కాబట్టే పవిత్రమైన హైకోర్టు ప్రాంగణంలో, అందునా ప్రధాన భవనం ఎదురుగా నిలువెత్తు మనువు విగ్రహం చిద్విలాసం చేస్తూ సగర్వంగా నిలుచో గలిగింది. గత 31ఏండ్ల నుంచి ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అంగుళం కూడా కదల కుండా ఇంకా అక్కడే అలాగే ఉండగలుగుతూ ఉంది. రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపూర్‌ నగరంలోని హైకోర్టు ప్రాంగణంలో 31సంవత్సరాల క్రితం 1989లో కొందరు లాయర్లు కలిసి మనువు విగ్రహాన్ని ప్రతిష్టించేశారు. ఈ లాయర్లు ఏ భావజాలానికి చెందినవారో వేరే చెప్పక్కర లేదు. ఇదే రాజస్థాన్‌లో 1987లో రూప్‌కన్వర్‌ను సతీసహగమనం పేరుతో సజీవంగా భర్త చితిపై తగుల బెట్టేశారు మనువాదులు. అలాంటి నేపథ్యం కూడా మనువు విగ్రహ స్థాపనకు తోడ్పడింది. అలాగే, మండల్‌ వ్యతిరేక కమండల్‌కు ప్రధాన కార్యక్షేత్రంగా ఉత్తర భారతదేశం, రాజస్థాన్‌ ఉండడం, రాష్ట్రంలో తమ భావజాలనికి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వారి పని తేలికైపోయింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా 'మానవులందరూ నడుచుకోవాల్సిన పద్ధతిని తెలిపే ప్రాచీన ధర్మశాస్త్రం'గా తాము భావించే మనుస్మృతిని రచించిన తమ ఆరాధ్యుడిని ఆ లాయర్లు తమ కండ్ల ఎదుట ప్రతిష్టించుకోగలిగారు. హిందూ మతంలోని శూద్రులను, మహిళలను కనీసం మనుషులుగా కూడా లెక్కించలేదు మనువు. కులాల వారీగా విధులను, బాధ్యతలను విభజించి శూద్రులకు బానిస బతుకును శాశ్వతం చేసింది మనుస్మృతి. పుట్టుక ఆధారంగా అసమానత్వం, కులం, లింగం ఆధారంగా శిక్షలను ఖరారు చేసింది మనుస్మృతి. చేసి, శిక్షల నుంచి ద్విజు (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ)లు చేసిన నేరాలకు శిక్షల నుండి మినహాయింపులు ఇచ్చి, శూద్రులకు మాత్రం వారు నేరాలు చేయకున్నా ఘోరమైన శిక్షలకు బలి చేసింది. వారికి భవిష్యత్‌ అనేదే లేకుండా చేసి ఆజన్మ బానిసలుగా మార్చేసింది. అందుకే, అసమానత, వివక్ష, అణచివేతలకు మార్గదర్శకాలను అందిస్తూ ఉన్న మనుస్మృతి దహనాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు అంబేద్కర్‌. డిసెంబర్‌ 25, 1927న చారిత్రాత్మక మహద్‌ చెరువు పోరాటంలో మనుస్మృతి దహనాన్ని అంతర్భాగం చేసి, అప్పటి నుంచీ తాను తనువు చాలించేంత వరకూ మనువును చీల్చిచెండాడడాన్ని కొనసాగించారు.

మరోవైపు, మనువు ఆరాధకులు కూడా తెరచాటున బలం పుంజుకుంటూనే ఉన్నారు. సాటి మనుషులపై ఆధిపత్యం చెలాయించాలని భావించే శక్తులు వివిధ రూపాలలో తమ అసలురంగు దాచుకుని మను భావజాలాన్ని రక్షించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టే, మనుషులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సమాన న్యాయాన్ని అందించే హైకోర్టు ప్రాంగణంలో మనువు ఇంకా ప్రతిమగా నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించేందుకు అటు న్యాయవ్యవస్థ వైపు నుంచి, ఇటు ప్రజల వైపు నుంచీ అనేక ప్రయత్నాలు జరిగాయి. సాక్షాత్తూ కాన్షీరామే జైపూర్‌లో ఈ విషయమై ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. జైపూర్‌ హైకోర్టుకు చెందిన న్యామూర్తులంతా ఏకగ్రీవంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి వేరే చోటుకు మార్చాలని ఆర్డర్‌ పాస్‌ చేశారు. అయినా ఆ విగ్రహం ఇసుమంతైనా అక్కడి నుంచి కదలలేదు. ఇందుకు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నాయకుడు ఆచార్య ధర్మేంద్ర న్యామూర్తుల నిర్ణయంపై పిల్‌ దాఖలు చేయడంతో విగ్రహ స్థలమార్పిడి కార్యక్రమం ఆగిపోయింది. పిల్‌ దాఖలు చేసిన ధర్మేంద్రపై విమర్శలు వెల్లువెత్తగా ఆయన ''మనువు ఫిలాసఫీలో ఎలాంటి ద్వేషం, వివక్ష లేదు'' అని శెలవిచ్చారు. 2015లో ఈ కేసుకు సంబంధించి జైపూర్‌ హైకోర్టులో న్యాయవాది ఏ.కే. జైన్‌ వాదనలు వినిపిస్తుండగా వీహెచ్‌పీ భావజాలం కలిగిన దాదాపు నాలుగువందల మంది జైన్‌ను తీవ్రంగా అడ్డుకున్నారు. జైపూర్‌ హైకోర్టులో లాయర్ల రూపంలో తిష్టవేసిన ఈ మను అనుయాయుల గుంపే తమకున్న రాజకీయ సంబంధాలతో విగ్రహ తొలగింపు కార్యక్రమాన్ని ఇప్పటికీ విజయవంతంగా అడ్డుకోగలుగుతున్నది.

ఈ నేపథ్యంలో విగ్రహ తొలగింపు ఉద్యమం ఇప్పుడు తిరిగి ఊపందుకుంది. దళిత్‌ శోషన్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) ఆధ్వర్యంలో అనేక దళిత, ప్రజా సంఘాలు కలిసి 'ఆగస్టు 15లోపు అక్కడి నుంచి మనువు విగ్రహాన్ని తొలగించాలి' అన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్నాయి. ఈ ఉద్యమానికి సమాజమంతా సహకరించాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలో భాగంగా మానవ వ్యతిరేక 'మనునుస్మృతి'ని ఎక్కడిక్కడ ఎండగట్టాలి. అలాగే, మనువుకూ నేటి కాషాయ పాలకులకూ మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ప్రజా చైతన్యంతో మాత్రమే నాటి మనువును, నేటి ఆ మనువు వాసరసులనూ మనం ఎదుర్కోగలం. వారి కుట్రలను జయించి సమన్యాయాన్ని, స్వేచ్ఛా భారతాన్నీ సాధింగలం.

No comments:

Post a Comment