Friday, June 21, 2019

దర్శన దర్శనం - ఆలూరి బుజంగరావు

దర్శన దర్శనం - ఆలూరి  బుజంగరావు
Created: May 16, 2016, 01:23 IST | Updated: May 16, 2016, 01:26 IST

అనువాద సాహిత్యం

1940-42 ప్రాంతాలలో కమ్యూనిస్టు రాజకీయ ఖైదీగా దేవలీ, హజారీబాగ్ జైళ్ళలో రాహుల్‌జీ వున్నప్పుడు సైన్స్, సమాజ శాస్త్రము, దర్శనాలకు సంబంధించిన విషయాలను ఒకే గ్రంథంగా పాఠకులకు ఇవ్వాలనుకున్నారు. కానీ రాసే క్రమంలో ఏ విషయానికి ఆ విషయాన్ని వేరు వేరుగా రాయటమే సరైనదనుకున్నారు. విశ్వకీ రూప్ రేఖా (సైన్‌‌స), మానవ సమాజ్ (సమాజ శాస్త్రం), దర్శన్-దిగ్దర్శన్ (దర్శనం), వైజ్ఞానిక భౌతికవాదం (గతితార్కిక భౌతికవాదం), ఇలా నాలుగు గ్రంథాలుగా వ్రాసారు.

అయితే మిగతా గ్రంథాలతో పోలిస్తే, దర్శన్-దిగ్దర్శన్‌కు కొంత ప్రత్యేకత ఉంది. ఆయన దేవలీ జైలులో వున్నప్పుడు తోటి కామ్రేడ్‌‌సకు దర్శన శాస్త్రం (ఫిలాసఫీ) పట్ల అవగాహన కల్గించటానికి ఒక నెల రోజులపాటు మధ్యాహ్నం పూట క్లాసులు తీసుకునేవారు. ఆ విషయాలనే దర్శన్-దిగ్దర్శన్‌గా రచించారు. ప్రపంచ తాత్విక జ్ఞానాన్ని ఈ గ్రంథంలో రాహుల్‌జీ పాఠకులకు అందించారు. మా నాన్నగారు ఆలూరి భుజంగరావు మూలంలో దాదాపు 1000 పేజీలున్న ఆ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలుగు పాఠకుల సౌలభ్యంకోసం భారతీయ దర్శనం, ప్రాక్పశ్చిమ దర్శనాలు అనే రెండు భాగాలుగా ప్రచురించిన విషయం తెలుగు పాఠకులకు విదితమే. ఇక వైజ్ఞానిక భౌతికవాదం (గతి తార్కిక భౌతికవాదం) గ్రంథాన్ని నాన్నగారు 60 పేజీల దాకా అనువాదం చేసి, మెదడుకు సంబంధించిన సమస్య వలన మిగతాది చేయలేకపోయారు. మిగిలిన 120 పేజీలను ఆయన సలహాలు తీసుకుంటూ నేను తెలుగులోకి తేవటం జరిగింది.

భారతీయ దర్శనం గ్రంథంలో- వేదాలలో దార్శనిక భావాల నుండి మొదలుపెట్టి, ఉపనిషత్ దార్శనికులతోపాటు స్వతంత్ర దార్శనికులైన నాగార్జునుడి శూన్యవాదం, చార్వాకుడి భౌతికవాద దర్శనం, అలాగే గౌతమ బుద్ధుని క్షణిక, అనాత్మావాదం, కణాదుడి పరమాణువాదం, జైనదర్శనం, పతంజలి యోగదర్శనం, ధర్మకీర్తి దర్శనం, ఇలా దార్శనికుల దర్శనాలే కాకుండా ఆనాటి సామాజిక స్థితిగతులను చెప్తూ భారతీయ దర్శన చరమవికాసమైన తాత్విక జ్ఞానాన్ని పాఠకులకు అందించారు రాహుల్‌జీ.

ప్రాచీన సింధూ నాగరికతా కాలానికి భారతదేశంలో దర్శనమన్నది లేదు. దాదాపుగా క్రీస్తు పూర్వం 600 నుండే దార్శనిక చింతన మొదలైందని చెప్పవచ్చు. అయితే క్రీ.పూ. 1500 నుండి 1000 వరకు రచించిన వేదాలలో దార్శనిక చింతన తాలూకు ఛాయలు కనపడతాయి. క్రీస్తు శకం 350 తరువాతనే భారతీయ దర్శన పరిపూర్ణ వికాసం జరిగింది. వేదాలలో ఆనాటి ఆర్యుల భావాలు, వారి సామాజిక వ్యవస్థ, ఆచారాలు, సుస్పష్టంగా ఉంటాయి. ఆర్యులు- ఇంద్ర, సోమ, వరుణులను స్తుతించారు. యజ్ఞాలవల్ల, దాన దక్షిణలవల్ల ఈ లోకంలో సుఖపడటం, మరణించాక స్వర్గంలో సుఖపడటం- ఇవే వైదిక రుషుల లక్ష్యంగా ఉండేది.

చార్వాకులు- భగవంతుడు లేడు, ఆత్మ లేదు, పునర్జన్మ, పరలోకం లేదు, జీవిత భోగాల్ని వదులుకోవలసిన పనిలేదు, సర్వభోగాలను అనుభవించవచ్చును, సత్యాన్వేషణకు అనుభవాన్ని, బుద్ధిని మార్గదర్శనం చేసుకోవాలని అంటారు. అన్నీ క్షణికమైనవి, ఆత్మవాదం అసత్యమైనది, చెడు పనులు చేయకుండా ఉండటం, మంచి పనులు చేయటం, చిత్తవృత్తుల్ని అదుపులో ఉంచుకోవడం- ఇదే బుద్ధుడి ఉపదేశాల సారం. బుద్ధుడు పొందిన జ్ఞానమే బౌద్ధ దర్శనం అయ్యింది. వేదగ్రంథాన్ని ప్రామాణికంగా భావించడం, సృష్టికర్త ఒకడు ఉన్నాడనుకోవడం, స్నానం ద్వారా ధర్మాన్ని సంపాదించామనుకోవడం, జాతివాదాన్ని పాటించడం, ఉపవాసాల ద్వారా ఇతర విధాలా శరీరాన్ని బాధపెట్టుకోవడం, ఇవన్నీ బుద్ధి హీనులు, వజ్ర మూర్ఖులు చేసే పనులుగా బౌద్ధ దార్శనికుడైన ధర్మకీర్తి భావించారు. సమాజంలోని అన్ని రకాల అసమానతలను, దోపిడీలను, అత్యాచారాలను అనంతంగా ఉంచటానికి అత్యంతంగా దోహదపడేదే శంకరాచార్యుని మాయావాదం. జీవునిమీద, ముక్తిమీద, ముక్తి ఫలితంమీద నమ్మకంలేని శంకరాచార్యున్ని ప్రచ్ఛన్న బౌద్ధుడంటారు. శంకరాచార్యుని దార్శనికతతో భారతీయ దర్శన గ్రంథం ముగుస్తుంది.

ప్రాక్పశ్చిమ దర్శనాలలో- సోక్రెటీస్ యథార్థవాదం, ప్లేటో కాల్పనికవాదం, అరిస్టాటిల్ వస్తువాదం, ఎపికురియన్ల భౌతికవాదం, యవన దార్శనికులు, ఇస్లాం దార్శనికులు, క్రైస్తవ దర్శనం, యూరప్ దర్శనాలు, న్యూటన్, బర్కలే, హ్యూమ్, మార్‌‌క్స గతితార్కిక భౌతికవాదం దాకా పాఠకుల ముందు ఉంచారు రాహుల్‌జీ.

వైజ్ఞానిక భౌతికవాదాన్ని సైన్‌‌స లేదా ప్రయోగశాస్త్రం అనవచ్చు. ప్రయోగాన్ని మార్గదర్శకంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది కనుకనే సైన్‌‌స యొక్క అధినాయకత్వాన్ని గతితార్కిక భౌతికవాదం శిరసావహిస్తుంది. ఈ గ్రంథంలో కార్యకారణ నియమం నుండి మొదలుకొని ప్రతిషేద ప్రతిషేదం వరకు అనేక అంశాలను తర్కించుకుంటేనే తర్కం బోధపడుతుంది అన్నట్లుగా ఇతర దర్శనాలకు, గతితార్కిక భౌతిక వాదానికి ఉన్న తేడాను విపులీకరించారు రాహుల్‌జీ.


అనువాదం గురించి:

ఒక భాష నుండి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నాన్నగారు చెప్తుండేవారు. ఏ గ్రంథాన్నైతే అనువాదం చేయాలని అనుకుంటామో ఆ గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి; మక్కీకి మక్కీగా చేసే అనువాదం అనువాదమే కాదు; గ్రంథాన్ని అధ్యయనం చేసి మూల రచయిత భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని అనువదించాలనేవారు. అనువదిస్తున్న భాషలోకి రచయిత మూలభావం దెబ్బతినకుండా పాఠకులకు అర్థమయ్యే రీతిలో అనువాదం చేయాలనేవారు. మూలభాషమీదా, అనువాదం చేసే భాషమీదా పట్టు వుండాలనేవారు. భాషలమీద పట్టుకోసం ప్రాచీన గ్రంథాలను తప్పక అధ్యయనం చేయాలనేవారు.

వైజ్ఞానిక భౌతికవాదం గ్రంథంలో- ‘దృష్టి కె  వికార్’ అన్న పదాన్ని ‘దృష్టి పరివర్తన’ అని తెలుగులో అనువదించారు నాన్నగారు. ఇందులో రాహుల్జీ ‘భూత్’ అన్న పదాన్ని భౌతిక తత్వము లేదా పదార్థము అని తెలపటానికి వాడారు. ‘బుద్ధ్ నె అపనే దర్శన్ కీ ఇతనీ నాకాబందీ కీ హై’ అన్న వాక్యాన్ని- ‘బుద్ధుడు తన తత్వాన్ని ఎంత బలవత్తరంగా ఎంత దృఢంగా, ఎంత కఠినంగా స్థిరీకరించాడంటే’- అని అనువదించారు. జబ్ తక్ జియె సుఖ్ సె జియె, ఋణ్ కర్ కె ఘీ (శరాబ్) పియె! దేహ్ కె భస్మీభూత్ హూ జానే పర్ ఫిర్ ఆనా కహా సె’... ఈ శ్లోకానికి అర్థం తెలుగులో ఇలా ఇచ్చారు: ‘బతికినంతకాలం సుఖంగా బతకండి, అప్పుచేసైనా పప్పుకూడు తినండి. ఈ దేహం భస్మీపటలం అయ్యాక ఇక మనం ఏమి చేయగలం, ఏమి అనుభవించగలం?’

ఇలా ఈ పుస్తకాలు అనువాదం కాదేమో, తెలుగులోనే రాసినవేమో, అనుకునేట్లుగా అనువదించారు నాన్నగారు.

మనువు శూద్ర ద్వేషా ? - ఎం.వి.ఆర్.శాస్త్రి

మనువు శూద్ర ద్వేషా ?

మనుధర్మం - 12
ఎం.వి.ఆర్.శాస్త్రి
  
ఫలానా కులంలో పుట్టుక చేతనే వీరు అధికులు, వారు నీచులు .. వీరిది ఎక్కువ కులం , వారిది తక్కువ కులం... అని  జాతిదురహంకారులు ఎన్ని దరిద్రగొట్టు దురాలోచనలు వ్యాప్తి చేసినా -వాస్తవానికి  మనుషులందరిదీ ఒకటే కులం. భరతఖండంలో పుట్టినవారందరిదీ ఒకటే డి.ఎన్..! ఒకటే రక్తం! జాతికి మన పూర్వులు పెట్టిన పేరు "శూద్ర " అని.

    జన్మనా జాయతే శూద్రః 
    సంస్కారాత్ ద్విజ ఉచ్యతే 
    వేద పఠనాత్ భవేత్ విప్రః
    బ్రహ్మ జానాతి  బ్రాహ్మణః
   - అంటుంది ఋగ్వేదం 5 మండలం లోని ఆత్రేయ స్మృతి .

     అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు. వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు.

    విద్యాసంస్కారానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉన్నది. నాకు విద్యనేర్పండి అని అడిగిన ప్రతి ఒక్కరికీ వారి కులగోత్రాలతో, తలిదండ్రుల  పుట్టుపూర్వోత్తరాలతో నిమిత్తం లేకుండా గురుకులాలలోని గురువులు ఉపనయన సంస్కారం చేసి విద్య నేర్పాలి. విధంగా శూద్ర అనే "ఏకజాతి" గా పుట్టిన మానవులలో కొందరికి విద్యాసంస్కారం చేత విద్యాజన్మ అనే రెండో జన్మ వచ్చి ద్విజులు అవుతారు. ద్విజులలో పరిపాలన, రాజ్య రక్షణ, ప్రజా సంరక్షణ వంటి వృత్తిని ఇష్టపడి  చేపట్టేవారు క్షత్రియులు అనబడతారు. వ్యవసాయం, పశుపాలన, వ్యాపారం వంటి వృత్తులను ఎంచుకునే వారు వైశ్యులు అనబడతారు. వేదాధ్యయనం, అద్యాపనం, యజ్ఞం చేయటం, చేయించటం వృత్తిగా ఎంచుకున్నవారు విప్రులుగా పిలవబడతారు. అహంకార మమకారాలను వదిలిపెట్టి, ఇంద్రియాలను జయించి , బ్రహ్మతత్వం  ఎరిగి , బ్రహ్మజ్ఞానం కలిగి, లోక క్షేమం కాంక్షించి , సమాజ హితం కోసం పాటుపడేవారు బ్రాహ్మణులు అనే సర్వోత్తమ, సర్వశ్రేష్ట తరగతికి చెందుతారు. వారిని అందరూ పూజిస్తారు. అత్యంత గౌరవ స్థానం ఇస్తారు.

    ఇదీ ఆర్ష ధర్మంలో వర్ణవ్యవస్థ. ఇందులో తప్పు ఉన్నదని మెడ మీద తలకాయ ఉన్న వాడు  ఎవడైనా అనగలడా? విద్వాంసుడికి, మానవోత్తములకు పూజ్య స్థానం ఇవ్వమని చెప్పటం నేరమా? పోనీ పూజ్య స్థానం కేవలం ఒక కమ్యూనిటీలో, ఫలానా కులంలో, లేక గోత్రాలలో పుట్టినవారు  మాత్రమే పొందగలరు; ఇతర నిమ్న వర్ణాలకు చెందిన వారికి దాన్ని చేరే యోగ్యత లేదు - అంటే అది ముమ్మాటికీ నేరమే. అలాంటి నిషేధం ఆర్షధర్మం లో ఎక్కడా లేదు. మనిషి పుట్టుక పుట్టిన ప్రతివాడికీ అత్యున్నత గౌరవ స్థానం పొందే యోగ్యత ఉన్నదనే ధర్మ శాస్త్రం చెబుతుంది.

    శూద్రేణ హి సమస్తావత్ యావద్వేదే జాయతే  (మనుస్మృతి 2-172)

    ఉపనయన, విద్యాసంస్కారం అయ్యేవరకు ప్రతివాడూ శూద్రుడే అని మనుస్మృతి చెపుతుంది. ఇది ఉపనయన సంస్కారాన్ని, విద్యాజన్మ అనే ద్విజత్వాన్ని శూద్రులకు నిషేధించటం అవుతుందా? పుట్టుక చేత శూద్రత్వం నుంచి, విద్య, ఉత్తమ సంస్కారాల చేత ద్విజత్వం పొందే హక్కు, అధికారం ప్రతి మానవుడికీ ఉన్నదని చాటిన మనుస్మృతి శూద్రులను ద్వేషిస్తుందని, నీచంగా పరిగణిస్తుందని ముద్రవేయటం వివేకం ఉన్నవారు చేయవలసిన పనేనా ?

     ఫలానా చెడుపనులు చేసినందుకుగాను శూద్రవర్ణానికి చెందిన వారికి మనువు నిర్దేశించిన శిక్షను .. మనకాలంలో మూడువేల  శూద్రకులాల, ఉపకులాలలో మనం చేర్చిన వారందరిపట్ల మనువు కక్షగా, దారుణ వివక్షగా భావించటం తప్పు. నేరానికి శిక్షల విషయంలో మనువు ఆధునిక  శిక్షాస్మృతులకంటే  ఎన్నో యోజనాల ముందు ఉన్నాడు. పులినీ పిల్లినీ ఒకే గాటన కట్టి, బలవంతుడికీ బలహీనుడికీ ఒకే  రకమైన న్యాయం అమలుపరచే నేటి న్యాయ ప్రహసనానికి మనువు పూర్తిగా  విరుద్ధం.

బ్రాహ్మణుడు ఎంత ఘోరనేరం చేసినా తక్కువ దండనతో సరిపెట్టాలనీ, అదే శూద్రుడికేమో చిన్న అపరాధానికి కూడా ఘోరమైన శిక్షలతో చిత్ర వధ చేయాలనీ కొందరు అగ్రవర్ణ దురహంకారులు తరవాత కాలంలో చొప్పించిన తప్పుడు శ్లోకాలకూ, మనుస్మృతి మౌలిక తత్వానికీ ఎక్కడా పోలిక లేదు. అవి దుర్మార్గపు ప్రక్షేపాలని మనుస్మృతి మొత్తాన్ని చదివిన వారెవరికైనా అర్థమవుతుంది.

  విద్యాస్థాయి, ఉత్తమ గుణాలు, ఉన్నత సంస్కారాలను బట్టి పై మూడు వర్ణాలకూ ఒకదానిని మించిన గౌరవ స్థానం పై దానికి ఇవ్వడంతో మనువు ఆగలేదు. తప్పు చేస్తే వర్ణాలకు శిక్ష మోతాదును కూడా అదే దామాషాలో నిర్ణయించాడు. ఒకే నేరాన్ని శూద్రుడు చేస్తే విధించాల్సిన శిక్షకంటే రెట్టింపు శిక్షను అదే నేరాన్ని వైశ్యుడు చేస్తే విధించాలి. అదే విధంగా వైశ్యుడికి వేసే శిక్షకంటే రెండింతల శిక్షను క్షత్రియుడికి, దానికి రెట్టింపు, అంటే.. శూద్రుడికి వేయవలసిన దానికంటే ఎనిమిది రెట్ల శిక్షను బ్రాహ్మణుడికి వేయాలని మనువు న్యాయం.

   అష్టాపాద్యం తు శూద్రస్య స్తేయే భవతి కిల్బిషం 
   షోడశైవ తు వైశ్యస్య ద్వాత్రింశత్ క్షత్రియస్య   ( 8-337 )

   బ్రాహ్మణస్య చతుష్షష్టి: పూర్ణం వాపి శాతం భవేత్ 
   ద్విగుణా వా చతుష్షష్టిస్తద్దోష గుణవిద్ధి సః   (8-338 )

   (తాను చేసిన నేరాన్ని తానే అంగీకరించిన శూద్రుడికి 8 యూనిట్ల శిక్షవేస్తే ... అతడి స్థానంలో వైశ్యుడు ఉంటే 16 యూనిట్లు , క్షత్రియుడికైతే 32 యూనిట్లు , అదే నేరం బ్రాహ్మణుడు చేస్తే 64 లేక 100 లేక 128 యూనిట్ల శిక్షను విధించాలి. సామాన్యుడి కంటే విజ్ఞానవంతుడికి ఎక్కువ దండన )


    ఏమీ తెలియని పామరుడి కంటే అన్నీ తెలిసిన పండితుడు ఎక్కువ దండనార్హుడు అని మనువు భావంమంచిదే కదా ?

    ఈనాడు  శూద్రకులాలు అని భావించబడుతున్నవి మనువు కాలంలో లేనే లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల కింద చేర్చటానికి వీలులేని కులాలనన్నిటినీ శూద్ర కులాలుగా కాలం లో మనం పరిగణిస్తున్నాం. వాటిలో ప్రతి కులానికీ, ప్రతి ఉపకులానికీ కచ్చితమైన ఒక పేరు ఉంది. వాస్తవానికి "శూద్రకులం" అంటూ ప్రత్యేకంగా ఒక కులం గా ఏనాడూ లేదు.

     గుణాలను, స్వభావాలను, యోగ్యతలను, సామర్ధ్యాన్ని బట్టి మనుషులను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలుగా మనువు విభజించాడు. ఫలానా ఫలానా వృత్తులు, పనులు ఫలానా వర్ణాలవారు చేయాలన్న వర్గీకరణ మనుస్మృతిలో లేదు. ఫలానా వృత్తులు, కార్యాలుశూద్ర వర్ణం వారు చేయాలనిగాని, ఆయా వృత్తులు, లేక వ్యాపారాలు, లేక వ్యాపకాలు లేక సేవలు చేసేవారు, వారి కుటుంబంలోని వారు, వారికి పుట్టిన వారు యావన్మందీ శూద్రులుగానే బతికి తీరాలన్న కట్టడి మనువు పెట్టలేదుఉపనయన సంస్కారం పొంది, విద్యాభ్యాసం చేసి, ఉత్తమ గుణాలను సంతరించుకొని ద్విజత్వం పొందే అవకాశం శూద్రులకు  ఇచ్చిన మనువును శూద్రద్వేషిగా చిత్రించటం అన్యాయం.

     పోనీ అలా సామాజిక నిచ్చెన లో పైకి పోవటానికి ప్రయత్నించక ద్విజత్వాన్ని ఆశించక ఏకజాతి శూద్రులుగానే మిగిలిపోయిన వారిని చులకన భావంతో నీచంగా చూడాలని మనువు చెప్పాడా ?

   వైశ్యశూద్రావాపి ప్రాప్తౌ కుటుంబేతిథి ధర్మిణౌ
   భోజయేత్ సహ భ్రుత్యైస్తావా నృశంస్యం ప్రయోజయన్   
( మనుస్మృతి 3-112 )

   భుక్త వత్ స్వథ విప్రేషు స్వేషు భ్రుత్యేషు  చైవ హి 
   భుంజీయాతాం తతః పశ్చాదవశిష్టం తు దంపతీ       
( మనుస్మృతి 3 -116 )

   శూద్రులు తమ ఇంటికి అతిథులుగా వస్తే వారికి, తమ సేవకులైన శూద్రులకు భోజనం పెట్టాకే  గృహస్థ దంపతులు భోజనం చేయాలని మనువు చెప్పాడు. ఇది శూద్రులను అవమానించటం అందామా? మనుధర్మాన్ని పాతిపెట్టి, కులరహిత సమాజాన్ని స్థాపించే దిశలో వడివడిగా ముందుకు పోతున్నామని చెప్పుకునే   కాలంలో తమ పనివారికి భోజనం పెట్టాకే యజమానులు భోజనం చేసే సంప్రదాయాన్ని ఎవరైనా పాటిస్తున్నారా? పనివాళ్ళు తిన్నాకే మనం తినాలని  చెప్పిన మనువేమో అమానుష శూద్రద్వేషి , మనం తిన్నాక మిగిలిన పదార్థాలను పనివాళ్ళ మొగాన పడేసే  మనమేమో మహా మానవతా మూర్తులమా ?

   మానార్హః  శూద్రోపి  దశమీం గతః       (మనుస్మృతి 2- 137)

   వయో వృద్దుడైన  శూద్రుడు - అందరూ గౌరవించవలసినవాడే  అన్న మనువు  శూద్ర వ్యతిరేకా ?

   అలాగే - నిర్దిష్ట యోగ్యతలు కలిగిన బ్రాహ్మణులు విరాట్ పురుషుడికి ముఖం అవుతారని, దేశాన్ని రక్షించే క్షత్రియులు బాహువులు, వర్తక వ్యాపారాలు చేసే వైశ్యులు ఊరువులు (తొడలు), కాయకష్టం  చేసే శూద్రులు విశ్వాత్మకు పాదాలు అవుతారని పురుషసూక్తం లో చెప్పటం శూద్రులను అవమానించటం ఎలా అవుతుంది?
తన తలకాయ చాలా గొప్పది, తన పాదాలు చాలా నీచమైనవి అని మానవుడైనా అనగలడా? సర్వ సమానత్వం సాదించటం కోసం శరీరంలో  చేతులు, తొడలు, పాదాలను ఒకే దగ్గర చేర్చటం ఎంతటి రష్యన్ సర్కస్ కళాకారుడికైనా  సాధ్యమయ్యే పనేనా? కష్టజీవుల శ్రమ మీదే ప్రపంచం ఆధారపడి ఉన్నదని చెప్పటం శ్రమజీవులను కించపరచటం అని చెప్పేవాడికి మతి ఉన్నట్టా ? లేనట్టా ?


జగతికి జ్యోతి
ప్రపంచం లో మనువు - 1
డా. కేవల్ మోత్వాని 
అనుసరణ : ఎం.వి.ఆర్.శాస్త్రి
..........

   మనకు తెలిసినా తెలియక పోయినా ప్రాచీన ఆధునిక ప్రపంచాలలో ప్రబలంగా వినిపించే పేరు మనువు. ఋగ్వేదంలో విశిష్ట స్థానం గల మనువు పేరును ఆర్యులు తాము పోయిన చోటి కల్లా తీసుకు వెళ్ళారు .

   ఉత్తర చైనాలో మనుధర్మ శాస్త్రం ఉనికి కనిపిస్తుంది. పూర్వకాలంలో  ఇండియా, ఇరాన్, సుమేరియా, ఈజిప్ట్, బాబిలోనియా, అస్సీరియా, అనటోలియా, పాలస్తీనా, గ్రీస్, రోమ్ లలో మనువు పేరు సుపరిచితం.

   తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలలో మనువుకు అత్యంత గౌరవ స్థానం ఉంది. బర్మా, సయాంమలయా, ఇండోచైనా, ఇండోనీసియా, బాలి, ఫిలిప్పీన్స్ దీవులు, సిలోన్ మనువు జ్ఞాపకాన్ని పదిలపరచుకుని ఆయన ధర్మశాస్త్రాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయి. దేశాల్లోని న్యాయ విధానాలు, సామాజిక వ్యవస్థలు మనువు బోధల పైనే ఆధారపడ్డాయి. సాంఘిక సంబంధాల సైన్సు అయిన మనుధర్మ శాస్త్రాన్ని  చరిత్ర తొలినాళ్ళ నుంచే భారతదేశం  అధ్యయనం చేసి, అమలుపరచింది. ఉటోపియా సృష్టికర్తలు, న్యాయ సంహితలకర్తలు అయిన పాశ్చాత్య సాంఘిక తత్వవేత్తలందరూ మనువు సంతానమే.

   మనుధర్మశాస్త్రాన్ని అనేక కోణాలనుంచి, పలువిధాలుగా  అధ్యయనం చేయవచ్చు, మతం, ఫిలాసఫీ, సైకాలజీ, బయాలజీ, ఎథిక్స్, హిస్టరీ, లా, పొలిటికల్ సైన్స్, జూరిస్ ప్రూడేన్స్ తదితర సబ్జెక్టుల విద్యార్థులకు ఆయా అంశాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు మనువు దగ్గర దొరుకుతాయి. కొన్ని విషయాలలో పాశ్చాత్యుల సాంఘిక చింతన కంటే మనువు సాంఘిక చింతన ఎంతో ముందుంది.

    చరిత్రకారుడు చరిత్ర ఆరంభాన్ని ఎంత వెనకకి అయినా  నెట్టనీ! అతడికి మనువు ఎదురవుతాడు... మొరటు మానవ పదార్థాన్ని నైతికంగా, తాత్వికంగా ప్రగతిశీల వ్యక్తులుగా మార్చుతూ! మనువు  మరచిపోయిన, మరణించిన గతానికి చెందిన వాడు కాదు. నాగరికత నేర్చిన ప్రతి మానవుడి జీవితంలోనూ అతడు జీవశక్తిగా నేటి భూమండలం ముఖాన ఊపిరులూదుతున్నాడు .

   Manu is the only teacher among the elect of the human race, whose teachings have done the greatest good, to the greatest number of people, over the largest area of the world and for the longest period of time.

  మొత్తం మానవ జాతి చరిత్రలో తన ఉపదేశాల ద్వారా ప్రపంచంలో అత్యంత విశాల ప్రాంతంలో, అత్యధిక కాలం, అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మేలును చేకూర్చిన ఏకైక బోధకుడు మనువు. కాని మానవజాతి చరిత్రలోని దశ చరిత్రకారుల దృష్టిని ఆకర్షించలేదు. ప్రపంచమంతటా స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లో ఎంత వెదికినా దీని జాడ మచ్చుకైనా కానరాదు. మనువు ఒక జాతికో కాదు - మొత్తం ప్రపంచానికి చెందిన వాడు. మనువు బొధలకు ప్రసారకేంద్రం, కష్టోడియన్ అయిన ఇండియా మీద అతడి స్ఫూర్తిని, దార్శనికతను  పునరుజ్జీవింప జేయాల్సిన ప్రత్యెక బాధ్యత ఉంది .

మనుధర్మశాస్త్రాన్ని The Code of Manu, the Law Giver అని సాధారణంగా అనువాదం చేస్తున్నారు. ఇది సరి కాదు. ఇండియా యొక్క సామాజిక, న్యాయపరమైన సంబంధాలను అనాదిగా మనువు నియంత్రించినా ఆయన ఇండియాకు న్యాయప్రదాత కాదు. ఆయన ఉపదేశాలకు చట్టానికి ఉండే లీగల్ అథారిటీ లేదు. వ్యక్తికీ, సమాజానికీ సౌహార్ద సంబంధాలు నెలకొనేందుకు దోహదించే ధర్మ సూత్రాలను మాత్రమే మనువు ప్రకటించాడు.

                          దూరప్రాచ్యంలో మనువు ప్రభావం 

1932 సంవత్సరం లో మంగోలియాలోని చైనా గోడలో ఒక భాగం జపనీయుల బాంబు దాడికి ధ్వంసమైందిఅక్కడ   గోడ కింద నేలలో చాలా లోతుకు తవ్వితే ఒక లోహపు పెట్టె కనిపించిందిచైనా ప్రాచీన చరిత్రకు సంబంధించి ఒక విలువైన డాక్యుమెంటు అందులో దొరికింది. లిఖిత పత్రాన్ని సంపాందించిన సర్ ఆగస్టస్ ఫ్రిజ్ జార్జ్ దానిని లండన్ కొనిపోయి ప్రొఫెసర్ ఆంథోనీ గ్రేమ్ అనే చైనీస్ భాష నిపుణుడికి  అందచేశాడు. నిపుణుల బృందం సాయంతో ఆయన తెగ కష్టపడ్డాడు. అనువాదమైతే చేయగలిగాడు  కానీ రాతప్రతి విలువను మదింపు చేయలేకపోయాడుఆంగ్ల అనువాదాన్ని బ్రిటిష్ మ్యుజియం లోని Sir Wallis Budge కి చూపిస్తే దొరగారు దాని తబిసీలును తేల్చాడు.

   జరిగిందేమిటంటే -

   ప్రాచీన కాలంలో  చిన్ ఇజా వాంగ్ అనే చైనా చక్రవర్తి ఉండేవాడు. చరిత్ర అనేది తనతోనే మొదలైందనీ, చైనా నాగరికత సాధించిన ఘనతంతా తనవల్లే ఒనగూడిందనీ భావితరాలవారు అనుకునేట్టు చేయాలని అతడు ఉబలాటపడ్డాడు. ఇంకేం? తనకు పూర్వపు చరిత్ర గ్రంథాలను అన్నింటినీ అతడు తగలబెట్టించాడు. చైనా పూర్వ వైభవాన్ని సూచించే రికార్డులనన్నింటినీ చక్రవర్తి నాశనం చేయించాడు. అదిగో దశలో ఒకానొక చరిత్రకారుడు తాను ఎరిగిన చైనా పూర్వచరిత్ర నంతటినీ రాసి లోహపు పెట్టెలో భద్రపరిచి భూమిలో పాతేశాడు. పరిస్థితులలో తాను పని చేయవలసి వచ్చిందో కూడా ముందుమాటగా అందులో రాసిపెట్టాడు.

    'In the manuscript, I find direct refereences to the Laws of Manu which were first written in India in the  Vedic language  ten thousand years ago ' (పదివేల సంవత్సరాల కింద వైదిక భాషలో రాయబడ్డ మనువు ధర్మసూత్రాలను ప్రాచీన రాతప్రతిలో నేరుగా ప్రస్తావించారు) అని సర్ వాలిస్ వెల్లడించాడు. కాలంలో ఇండియా, చైనా, అమెరికాల మధ్య సరాసరి సంబంధాలు ఉన్నట్టు రాత ప్రతి రుజువు చేసింది అన్నాడాయన .
ఇంకా ఉంది 


మనువు విశ్వరూపం
ప్రపంచంలో మనువు - 3
డా. కేవల్ మొత్వానీ, ప్రొ. ఆర్. సురేంద్రకుమార్ 
అనుసరణ : ఎం.వి.ఆర్. శాస్త్రి 

   ఆసియా, ఆఫ్రికాలలో క్రీ.పూ. 5000- 3000 మధ్య విలసిల్లిన ప్రాచీన నాగరికతలన్నిటికీ మనువు బాగా తెలుసు. కాకపొతే వేరు వేరు పేర్లతో! ప్రాచీన ఇరాన్ (పర్షియా)లో అతడి పేరు  "వైవహంత్"!  ఈజిప్టు వాసులకు "మినా" గా, క్రేట్ లో "మినోస్" గా మనువు పరిచితుడు. ప్రాచీన సుమేరియన్లు మనువును ఎరుగుదురు అనడానికి ఆధారాలున్నాయి. మనువు కుమార్తె ఇళ, అతడి కుమారుడి ప్రస్తావన క్రీ.పూ. 1600 లో అస్సీరియాలో కానవస్తుంది. క్రీ.పూ. 1200 నాటికి అయోనియాలో మనువు పేరు మానెస్, మెన్స్ అయింది. పాలస్తీనాలో మోజెస్ నిజానికి మనువేనని కొందరు విద్వాంసుల నమ్మిక !

   మనం మాట్లాడుతున్న కాలానికి మొత్తం మధ్య ప్రాచ్యమంతా ఆర్య మయమే. ఆర్య శాఖ అయిన Hittites తెగ ఆసియా మైనర్, అనటోలియాలను ఆక్రమించి  విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించింది. Mittani అనేది ఇంకో ఆర్య రాజ్యం. దానికి తూర్పున  పర్షియా ఉంటుంది.

    సోమ  వంశపు తొలి రాజు అయిన విశ్వామిత్రుడితో జరిగిన 5 రోజుల యుద్ధంలో  ప్రాచీన రాజ వంశీకుడైన వీన రాజు ఓడిపోయి తన అనుయాయులతో కలిసి మాశ్రా తీరం దాటి ఈజిప్ట్ కు వలసపోయినట్టు మనుస్మృతి వ్యాఖాత కుల్లుకభట్టు అభిప్రాయం. క్రీ. పూ. 3400 లో అతడు అడుగు పెట్టే వరకూ ఈజిప్టు అనాగరిక దేశం. మనువు అనే బిరుదు ధరించిన వేనుడు వచ్చాకే దేశం లో నాగరికత మొదలైంది అని ఈజిప్ట్ చరిత్ర ప్రవీణులు చెబుతారు. మినా లేక మెన్స్ అనబడే మనువు పేరుమీదే ప్రాచీన ఈజిప్ట్ లో Menouphis అనే రాష్టం ఏర్పడింది.

   క్రీ.పూ. 522- 486 మధ్య ప్రాచీన ఇరాన్ ను ఏలిన Darius The Great తన సామ్రాజ్యానికి లా కోడ్ ను తయారు చేయించ దలచినప్పుడు మనుధర్మ శాస్త్రాన్నే నమూనాగా తీసుకున్నారు. వర్ణాల పేర్లతో సహా  మనువు చెప్పిన సాంఘిక వ్యవస్థను అక్కడి వారు ఆమోదించారు. జొరాస్ట్రియనల ద్వారా మనుధర్మశాస్త్రం పశ్చిమ ఆసియా, యూరప్ లోని ఇతర నాగరికతలకు  పరిచయమైంది.

    మొత్తానికి ప్రాంతమంతటా నెలకొన్నది  వైదిక భారతం నుంచి చీలి వచ్చిన ఆర్య సంస్కృతేబాబిలన్ నె తీసుకోండి. దానిని ఏలిన నాభానేదిష్టుడు తనను తాను మనువు పుత్రుడిగా అభివర్ణించుకున్నాడు. ప్రపంచ సృష్టికి, మానవ జాతికి, యుగాలకు  సంబంధించి బాబిలోనియన్ల లెక్కలు మనువు  చెప్పినదానికి సరిగ్గా సరిపోతాయి. బాబిలోనియన్ల సాంఘిక, రాజకీయ వ్యవస్థలు మనువు మూసలో రూపు దిద్దుకున్నవే. అలాగే అస్సీరియన్లూ ఆర్య సంప్రదాయాలు, మనుధర్మం ఆధారంగానే తమ సాంఘిక జీవనాన్ని రూపొందించుకున్నారు. 90 అధికరణాలుగల వారి లా కోడ్ కు మనుధర్మశాస్త్రం తో దగ్గరి పోలిక ఉంది.

   దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా లోని అనేక దేశాలలో మనువు, అతడి ధర్మశాస్త్రం నేటికీ సజీవంగా ఉన్నాయి. దేశాలకు బౌద్దాని  కంటే  పూర్వమే మనుధర్మం వెళ్ళింది. అక్కడ వివాహాలు, దత్తత, వారసత్వం , ఆస్తిహక్కులు, భూమి యాజమాన్యం, ఆచారాలు, పరిపాలన, సాంఘిక వ్యవస్థలవంటి అంశాలలో  మనుధర్మ ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది ఎంతగా అంటే .. భారత దేశపు విస్తృత సాంస్కృతిక సామ్రాజ్యంలో దేశాలు  వెలుపలి భాగాలు అని  చరిత్రకారులు భావించేటంతగా ! సాంస్కృతిక సామ్రాజ్యానికి పునాదిని మనువు వేస్తే, గౌతమ బుద్ధుడు దాని పైన సౌధాన్ని లేపాడని చెప్పవచ్చు. మానవజాతి చరిత్రలో సాంఘిక చింతనకు సంబంధించి మొట్టమొదటి ప్రణాళికా బద్ధ సంఘటిత నిర్మాణం అనదగ్గది మనుధర్మశాస్త్రం. తరవాతి శతాబ్దాలలో వచ్చిన సాంఘిక తత్వవేత్తలకు , శాసనకర్తలకు అది నమూనా అయింది.

Emigrants from India, who laid foundations of a new world in tropical East, took with them their law book, The Code of Manu. Everywhere throughout this region, Manu has left his mark, in Burma, in Siam, in Cambodia , Java and Bali.  
[Manu in Burma, J.S.Furnival (in Burmese Research Society Journal,1940]

   ఉష్ణ మండలానికి చెందిన తూర్పు ప్రాంతాలలో నూతన ప్రపంచానికి పునాది వేసిన భారతీయ వలసదారులు తమతోబాటు మనుధర్మశాస్త్రాన్ని  తీసుకుపోయారు. బర్మా, సయాం, కంబోడియా, జావా, బాలి సహా ప్రాంతమంతటా వారు వెళ్ళిన చోటల్లా మనువు తన ముద్ర వేశాడు ... అంటాడు విఖ్యాత పాశ్చాత్య విద్వాంసుడు ఫర్నివాల్. బర్మాలో పూర్వ న్యాయగ్రంథాలు  మనుధర్మశాస్త్రానికి తమ రుణాన్ని బాహాటంగా అంగీకరించాయి. బర్మాలో పాళీ భాషలో రాసిన "నీతిసార" లోని అనేక అంశాలకు మనుస్మృతితో పోలిక ఉంది. బర్మా, కంబోడియాలలో లాగే సయాం లోని ప్రాచీన న్యాయ శాసనాలు మనుస్మృతికి దగ్గరగా ఉంటాయని Siam, Vol.1 గ్రంథంలో W.A. Graham పేర్కొన్నాడు.

   బాలి ద్వీపం, బర్మా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, చంపా ( వియత్నాం ), కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంక, నేపాల్ లలో లభించిన చారిత్రక ఆధారాలను బట్టి ఆయాదేశాలలో మనువు చెప్పిన ... వృత్తినిబట్టి వర్ణవ్యవస్థ అమలులో ఉండేది. మనువు సూత్రాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి , తీర్పులను వాటి ఆధారంగానే అక్కడ వెలువరించే వారు. రాజులు , చక్రవర్తుల తాము మనువు అనుయాయులమని చెప్పుకోవటానికి గర్వపడేవారు. మనువు సంబంధమైన పేరును తమ బిరుదాలలో చేర్చుకోవటానికి ఉత్సాహపడేవారు.

    చంప (వియత్నాం) లో లభించిన ఒక శాసనాన్ని బట్టి రాజా జయేంద్ర వర్మదేవుడు మనువు అనుయాయి. మనుస్మృతి ఆధారంగా రూపొందిన" మను నీతి సార" ప్రస్తావన ప్రస్తావన ఉదయన వర్మ మహారాజు శిలాశాసనంలో కనిపిస్తుంది. అలాగే యశోవర్మ శిలాశాసనంలో మనుస్మృతి లోని ఒక శ్లోకం యథాతథం గా చెక్కబడి ఉంది. రాజా జయవర్మ శిలాశాసనంలో మనుస్మృతికి సంబంధించి  ప్రవీణుడైన ఒక అమాత్యుడి  ప్రస్తావన ఉంది. బాలి ద్వీపంలో మనువు సాంఘిక విధానం నేటికీ అమలులో ఉంది. దక్షిణ ఆసియా లోని ఇతరదేశాల కన్నా ఇండోనేసియా పై మనుధర్మశాస్త్ర ప్రభావం ప్రబలంగా ఉంది. ఇండోనేసియా లా కోడ్ కు అదే మాతృక. దేశం లోని గ్రంథాలన్నిటిలోకీ ప్రాచీనమైనదిగా భావించే Kutara Manawa 20 శతాబ్దం ఆరంభం వరకూ అక్కడ అమలులో ఉండేది. అది మనుధర్మ మీద ఆధారపడ్డదే. దేశపు మిగతా న్యాయ గ్రంథాలలో Dewagama కి   మనుస్మృతి 7 అధ్యాయం   , Swara Jambu కి  మనువు 8 అధ్యాయం ప్రాతిపదిక . ఇక  ఫిలిప్పీన్స్ ప్రజలు మనువుని ఎంతగా నెత్తిన పెట్టుకుంటారంటే వారి జాతీయ పార్లమెంటు  లో సెనేట్ చాంబర్ ఆర్ట్ గాలరీ లో  మనువు విగ్రహాన్ని ప్రతిష్టించారు. (దీని వివరాలు వ్యాసావళి లోని మొదటి వ్యాసంలో ఇచ్చాము).


   బ్రిటిష్, అమెరికన్, జర్మన్ ఎన్ సైక్లోపీడియా లు మానవులలో అగ్రేసరుడిగా, మొదటి శాసనకర్తగా న్యాయవేత్తలలో అగ్రగామిగా, సామాజిక తత్వవేత్తగా వర్ణించాయి. A.A. MacDonnel, A.B.Keith, P.Thomas, Louis Renov తదితర పాశ్చాత్య గ్రంథకర్తలు మనుస్మృతిని కేవలం  మతగ్రంథంగా కాక, మానవాళికి మేలు చేసే ఒక న్యాయగ్రంథంగా పరిగణించారు. The Cambridge History Of India, The Encyclopaedia of Social Sciences ( USA), Keith రాసిన  History Of Sanskrit Literature, భారతరత్న  P.V. Kane రచించిన  A History of Dharma Sastra లలో ప్రపంచంపై  మనుస్మృతి   ప్రభావం గురించి చెప్పిన విషయాలు చదివితే ప్రతి భారతీయుడు తన ఉజ్వల వారసత్వానికి గర్వపడతాడు.

   మానవుడు తన చరిత్రను రికార్డు చేయటానికి పూర్వమే అతడి సామాజిక, ఆధ్యాత్మిక చింతనలను మనువు ప్రభావితం చేశాడు. మనువు, అతడి బోధల ప్రభావాన్ని బట్టి మానవ చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఉంది. ప్రాచ్య, పాశ్చాత్య సాంఘిక తత్వవేత్తలలో మనువుకు సముచిత అగ్రాసనం ఇవ్వాలి. మానవాళిని సేవించిన తాత్వికులు, ఆదర్శ వాదులు అందరిలోకీ supreme thinker, patron saint గా మనువు స్థానం సుస్థిరం, శాశ్వతం.

( కేవల్ మోత్వాని "Manu Dharma Sastra"  గ్రంథంతో బాటు ప్రొ. సురెంద్రకుమార్ రాసిన "Opposition to Manu - why ?” పుస్తకంలోని కొన్ని విషయాలు వ్యాసానికి ఉపయోగపడ్డాయి. )

అయిపొయింది