Wednesday, June 5, 2019

Zygmunt Bauman - Liquid Modernity

మీరు చూసే ఉంటారు. రోడ్డుమీద జనమే జనం. మధ్యగా ఒక తాజా మోటర్‌ బైక్‌ మీద పాతికేళ్ళ కుర్రాడు శరవేగంతో పోతుంటాడు. తల పక్కకి వాలిపోయి, భుజాన్ని తాకుతుంటుంది. చెవికి, భుజానికి నడుమ ఒక సెల్‌ఫోను అతుక్కుపోయి ఉంటుంది. అతను తన బాస్‌తో ఆ పూట ఆఫీసుపని గురించి మాట్లాడుతున్నాడా, లేక స్నేహితురాలితో సాయంత్రం సినిమా గురించి ముచ్చటిస్తున్నాడా అనేది మనకక్కర్లేదు. సదరు ద్విచక్రవాహన చోదకుడి పరిస్ధితిలో చలనవేగం ఉంది. అందువల్ల అస్థిరత ఉంది. అందువల్ల అభద్రత ఉంది. అందువల్ల ప్రమాదం ఉంది. ఈ పరిస్ధితేమిటయ్యా అంటే ఉరకలేసే వర్తమానం అంటాడతను. నేను కాస్త గంభీరంగా 'ద్రవాధునికత' అంటాను. ద్రవాధునికత (Liquid Modernity) అనేది ఒక భావన. దాన్ని ఆకళించుకోవటానికి ఆ దృశ్యం చక్కని ఉదాహరణ.
ఇప్పటిదాకా తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, అసలు సంగతి దాన్ని మార్చటమేనన్నాడు చాన్నాళ్ల కిందట కార్ల్‌మార్క్స్‌ మహాశయుడు. అయితే కర్త ఎవరో కనపడకుండా విపరీతవేగంతో మారుతున్న ప్రపంచవ్యవస్థల మధ్య మనమిప్పుడు అవస్థలు పడుతున్నాం. పల్లెలనుంచి పరదేశాల దాకా వలసలు, భూసంబంధాల్లో విస్థాపన (Displacement), మూలాల విచ్ఛిన్నత, రంగులు మారే వస్తు ప్రపంచం, మార్కెట్‌ సంక్షోభాలు, ఉద్యోగ జీవితాల్లో గాలివానలు, సంక్లిష్ట వర్తమానాన్ని కొత్తగా అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించి, వ్యాఖ్యానించటానికి, అన్వయించుకోవటానికి జిగ్మంట్‌ బౌమన్‌ (Zygmunt Bauman) వెలువరించిన 'లిక్విడ్‌ మోడర్నిటీ' (Liquid Modernity) అనే పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మార్పుకి తోడ్పడుతుంది.

No comments:

Post a Comment