Wednesday, June 5, 2019

కాలంపై హక్కుల సంతకం

కాలంపై హక్కుల సంతకం
22-01-2017 02:17:30

కాలంపై నిరంతరం నిలిచివుండే హక్కుల సంతకం భువనగిరి చంద్రశేఖర్‌ది. గుంటూరు కేంద్రంగా 1987–-88 మధ్యకాలంలో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన చంద్రశేఖర్‌ చాలాచిత్రంగా మొత్తం తెలుగు సమాజానికి నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన అనేక కేసుల్లో వాదించటం ద్వారా కాలంపై చెరగని సంతకాన్ని చేసిపోయారు.

చలపతి విజయవర్ధనరావుల ఉరిశిక్షను తప్పించే పోరాటంలో సత్యమూర్తిగారు చేసిన పోరాటానికి న్యాయస్ధానంలో అండదండలిస్తూ నడిపించిన న్యాయవాదిగా ఆయన పాత్రను విస్మయంతో అవలోకించిన వాళ్లల్లో నేనొకడ్ని. చంద్రశేఖర్‌ గురించి ఆలోచిస్తుంటే చిత్రంగా కాలం దాటెల్లిపోయి సమాజంలో పెద్ద నిశ్శబ్దాన్ని మోస్తున్న విపత్కర సందర్భాన్ని మిగిల్చిన బాలగోపాల్‌, కన్నభిరాన్‌లు గుర్తుకొస్తున్నారు. ఇవాళ హైకోర్టులో కొట్టేయబడిన చుండూరు దళిత నరమేధం కేసు, దేక్కుంటూనో, పాక్కుంటూనో ఉన్న లక్ష్మింపేట దళితుల మారణకాండ కేసులు చూస్తున్నప్పుడు నావరకు నాకు ఖచ్చితంగా చంద్రశేఖర్‌ గుర్తొస్తాడు. రాడికల్‌ విద్యార్ధి సంఘ రాజకీయాల నుంచి పౌర హక్కుల ఉద్యమం దాకా ఆయన ప్రస్ధానం చాలా చురుకుగా, వేగంగా సాగిందనే చెప్పాలి. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తెలుగు సమాజంలో ప్రతి బలహీన స్వరం పక్షాన నిలబడ్డారాయన. 1990 తర్వాతి సోషలిస్టు దేశాల పరిణామాల నేపథ్యం ఆయన్ను తాత్విక పునరాలోచనల్లోకి నెట్టింది. ఇటాలియన్‌ తాత్వికుడు గ్రాంసీతో మొదలైన ఈ పునరాలోచన క్రమంగా అరాచకవాదం, ఆధునికాంతర వాదం, ఫ్రెంచ్‌ తత్వవేత్త ఫూకో దాకా విస్తరించిందనే చెప్పాలి. మనిషిని, మనిషిలోని సామూహిక తత్వాన్ని, మనిషికి, ప్రకృతికీ ఉన్న అద్వైత సంబంధాన్ని ఆధునికతే ధ్వంసం చేస్తుందన్న విశ్వాసం దాకా ఆయన ప్రయాణం సాగింది.


ఆధునికత, పెట్టుబడిదారీ విధానం, వలసవాదం, సామ్రాజ్యవాదం లాంటివన్నీ ఒకే తానులోని ముక్కలని, వీటన్నింటినీ ధ్వంసించటం ద్వారానే మనిషిలోని ఏకాంత దృష్టి నుంచి సామూహిక దృష్టి లోకి మరలగలమనే జిగ్మంట్‌ బౌమన్‌ దృక్పథం ఆయన్ను ఆధునిక పూర్వ సమాజం వైపు నెట్టిందనొచ్చు. అందుకే మరణానికి కొన్నేళ్ల ముందు ఆయన ఆధునికత సృష్టిస్తున్న విధ్వంసానికి సనాతన ధర్మంలోనే తాత్విక పరిష్కారం ఉందనుకున్నారు. ఈ పరిష్కారం కోసం అన్వేషించారు.

దాదాపుగా 35 ఏళ్లు చంద్రశేఖర్‌ హక్కుల ఉద్యమంలో క్రియాశీల పాత్ర నిర్వర్తించారు. ఆధునికతను నమ్మినా, మానవహక్కుల కోసం పోరాడినా, ప్రత్యేకించి మరణశిక్ష రద్దు కోసం ఉద్యమించినా, అదే ఆవేశాన్ని కొనసాగించారు. జంకుగొంకూ లేకుండా ప్రయాణించారు. చుండూరు కేసు విచారణ సందర్బంగా చేసిన పరిశోధనలో శాక్కో వాంజెట్టీ నవల తెలుగు పరిచయం నుంచి కేశవరెడ్డి ‘మునెమ్మ’ నవల మీద చేసిన విశ్లేషణ దాకా ఈ మధ్యలో పాలో కొయిలా ‘ది ఆల్కెమిస్ట్‌’ నవల పరిచయం దాకా సాహిత్యంపై ఆయనకున్న పట్టును విశదం చేస్తుంది. 2010 ప్రాంతంలోనే డర్బన్‌లో జరిగిన జాతి వివక్షత సదస్సు సందర్భంగా ‘దళిత ఉద్యమం ఎన్జీవో స్పాన్స్‌ర్డ్‌గా మాత్రమే పరిమితమైపోయిన కారణాలను చంద్రశేఖర్‌ వెలికితీశాడు.2010లోనే ‘ద్రవాధునికత’ను పరిచయం చేస్తూ భావి పరిశోధకులకు మార్గదర్శకంగా కూడా నిలిచాడు చంద్రశేఖర్‌. ఇవాళ ముచ్చటించుకుంటూ బాధపడుతున్న అనేక పెను ప్రమాదాల గురించి పదేళ్ల క్రితమే హెచ్చరించిన గొప్ప న్యాయవాది, రచయిత, ఉపన్యాసకుడు, మానవ హక్కుల ఉద్యమ కార్యకర్త.
 నూకతోటి రవికుమార్‌
(నేడు ఒంగోలులో చంద్రశేఖర్‌ వర్ధంతి సభ)

No comments:

Post a Comment