Tuesday, September 17, 2019

ద్రవిడ ఆత్మగౌరవ నినాదం పెరియార్

#ద్రవిడ ఆత్మగౌరవ నినాదం పెరియార్#
చల్లపల్లి స్వరూపరాణి
'పెరియార్’ (పెద్దాయన) అని ప్రజల చేత ప్రేమగా పిలిపించుకున్న యి.వి. రామస్వామి నాయకర్( 1879-1973) దక్షిణాది రాస్ట్రాలలో గత శతాబ్దంలో జరిగిన అనేక ప్రత్యామ్నాయ వుద్యమాలకు చిరునామా. సామాజిక దుర్నీతిపైన, కులతత్వ రాజకీయాలపైన, మతం తాలూకు మూఢ విశ్వాసాల పైన, సాంస్కృతిక విలువలపైన తన జీవిత కాలమంతా రాజీలేని పోరాటం చేసిన ఆయన దళిత బహుజనులకు నిజంగానే పెద్ద దిక్కుగా మిగిలాడు. రాజకీయ స్వాభిమానం, సాంఘిక స్వాభిమానం రెండూ చెట్టపట్టాలేసుకుని సాగుతాయని నమ్మిన పెరియార్ తన పోరాటాన్ని రాజకీయ రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక రంగాలకు కూడా విస్తరింపజేశాడు.
పెరియార్ 1919లో అప్పటి జాతీయ కాంగ్రెస్ లో చేరినప్పటికీ అతి కొద్దికాలంలోనే దాని పట్ల తన భ్రమలను తొలగించుకున్నాడు. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకొనే జాతీయవాదం వొక మేడిపండు వంటిదని, దానినిండా కులతత్వ లుకలుకలు వున్నాయని జాతీయ కాంగ్రెస్ గుట్టు రట్టు చేసిన ధీశాలి పెరియార్. పుట్టుక ఆధారంగా కొందరిపైన వివక్షను కొనసాగించే వర్ణాశ్రమ ధర్మం లేని జాతీయవాదం కావాలని పెరియార్ జతీయవద భావనకు తనదైన వ్యాఖ్యానాన్నిచ్చాడు. అణగారిన కులాలలో బ్రాహ్మణేతర ద్రవిడ వుద్యమ స్పూర్తిని నింపడంలో పెరియార్ ఎన్నో మైలురాళ్ళను దాటాడు. ద్రవిడ వుద్యమం అంటే కేవలం తమిళులకు మాత్రమే పరిమితమైనది కాదని, ఆర్యేతరులంతా ద్రావిడులేనని, దురాక్రమదారులైన ఆర్యుల ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించే అణగారిన వర్గాలకు చెందిన దేశవ్యాప్త వుద్యమమని పెరియార్ ద్రావిడ సిద్ధాంతానికి అంబేద్కర్ వో విశాలమైన దృక్పధాన్ని అందించాడు. తనకు ఎంతో భావసారూప్యత గల పెరియార్ ను అంబేడ్కర్ 1944 లో కలుసుకున్నాడు. కాంగ్రెస్ మరియు గాంధీల హరిజనోధరణలోని డొల్లతనాన్ని అంబేడ్కర్ , పెరియార్ లు తమవైన పద్ధతులలో యెండగట్టారు.
పెరియార్ కాంగెస్ పార్టీని విడిచి పెట్టాక తమిళనాడులోని బ్రాహ్మణేతర దళిత బహుజనులను సంఘటితం చేస్తూ పెద్ద యెత్తున వుద్యమాన్ని నిర్మించాడు. తన వుద్యమంలో యువకులను, స్త్రీలను క్రియాశీలక పాత్రధారులను చేశాడు. ఆయన నిర్వహించిన వుద్యమాలలో వైకోం పోరాటం ముఖ్యమైంది. ఆయన పూర్వీకుడు, తమిళ సామాజిక వుద్యమాలకు ఆద్యుడైన అయోతీదాస్ మీద గౌరవంతో అయోతీదాస్ క్రియాశీలకంగా పనిచేసిన కోలార్ బంగారు గనుల ప్రాంతం నుంచి పెరియార్ తన కార్యక్రమాలను ప్రారంభించడం విశేషం. అయోతీదాస్ అనుచరులలో అప్పాదురై,లక్ష్మీ నరుసులు పెరియార్ తో పాటు పనిచేశారు. పెరియార్ కి హైందవేతర మతాలైన బౌద్ధం, యిస్లాం పట్ల గౌరవం వున్నప్పటికీ ఆయన నాస్తికుడిగానే గుర్తింపు పొందాడు. పెరియార్ కి సోషలిజం పట్ల కూడా ఎంతో అభిమానం వుంది. అయితే ఆయన దాన్ని భారతీయ సామాజిక వాస్తవికతతో మాత్రమే ముడిపెట్టి చూడడం గమనార్హం. ఆయన నిర్మించిన బ్రాహ్మణేతర వుద్యమం రాజకీయంగా జస్టిస్ పార్టీ గా రూపొందింది. జస్టిస్ పార్టీ సోషలిస్ట్ సిద్ధాంత ప్రాతిపదికగా కింది కులాలు పోగొట్టుకున్న యెన్నో అవకాశాలను తిరిగి యిచ్చింది. క్రమంగా యీ పార్టీ ‘ద్రవిడ కజగం’ గానూ, అన్నాదురై అనంతరం ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ గానూ పరిణామం చెందింది. పెరియార్ తన భావాల వ్యాప్తి కొరకు 'కుడి అరసు’ అనే పత్రికను ఏర్పాటు చేసి దానిలో ఎన్నో సంచలనాత్మక సంపాదకీయాలను, వ్యాసాలను ప్రచురించాడు. ఆయన అనేక గ్రంధాలు కూడా రచించి ద్రావిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసికెళ్ళాడు. భాషా పరంగా హిందీ భాషను ద్రవిడులపైన రుద్దడాన్ని పెరియార్ వ్యతిరేకించాడు.
పెరియార్ వో వైపు రాజకీయ పోరాటం చేస్తూ శూద్రులకు ఎన్నో అవకాశాలను, హక్కులను కల్పిస్తూనే మరోవైపు స్త్రీల పరంగా సంస్కణోద్యమాన్ని కొనసాగించాడు. ఆయన బ్రాహ్మణవాదం యే రూపంలో వున్నా దాన్ని యెదుర్కొని సమాజం సమూలంగా మార్పు చెందాలని భావించాడు. స్త్రీని వొకపక్క దేవతగా పూజించే హిందూమతం మరోపక్క ఆమెను దేవదాసిగా, వూరుమ్మడి వస్తువుగా దిగజార్చిందని హిందూ మతం యొక్క రెండు నాల్కల ధోరణిని ఎండగట్టాడు. స్త్రీకి ఆస్తి హక్కు, గర్భ నిరోధక హక్కు, జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్చ వుండాలని పెరియార్ వాదించాడు. వివాహ వ్యవస్థలో వున్న లొసుగులను చీల్చి చెండాడడమే కాకుండా ప్రజల వ్యక్తిత్వాలను గౌరవించే పెళ్ళిళ్ళు జరగాలని ప్రతిపాదించాడు. తాళిబొట్టు, కట్నకానుకలు, కులమతాలకు సంబంధం లేని వివాహాలను పెరియార్ తానే స్వయంగా నిర్వహించాడు. భూమి వొక ఆస్థిగా భావించని, దానిపై ప్రజలకు వ్యతిగత హక్కులులేని కాలంలో స్త్రీలపైన అణచివేత, బానిసత్వం, బలవంతపు వివాహాలు లేవని ఆయన అభిప్రాయం. స్త్రీలు, కుటుంబం, వ్యక్తిగత ఆస్థి వంటి అంశాలలో పెరియార్ ఆలోచనలు యెంగెల్స్, అంబేడ్కర్ ఆలోచనలకు దగ్గరగానూ, ఆయన బ్రాహ్మణేతర దృక్పధం ఫూలే దృక్పధానికీ దగ్గరగా అనిపిస్తాయి. ఆనాటి స్త్రీవిద్య స్త్రీలను మంచి వంటగత్తెలుగానూ, కుట్టు పనులు నేర్చుకునేవారిగానూ వెరసి 'మంచిభర్త’ కోసం ఏర్పాటు చేయబడినట్టుగానూ వుందని పెరియార్ వ్యంగ్యంగా పేర్కొనడం విశేషం. ఆయన అభిప్రాయాలు యీ నాటి సమాజానికీ వర్తిస్తాయి.
పెరియార్ నిర్మించిన స్వయంగౌరవ వుద్యమమం దక్షిణాదిన భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో ఆది ఆంధ్ర వుద్యమానికి, ఆది కర్నాటక వుద్యమానికి ప్రేరణగా నిలిచింది. మైసూర్ లోని వొక్కలిగలు, లింగాయతులు, ముస్లింలు, కురుబలు తమకోసం సంఘాలు ఏర్పాటు చేసుకుని అస్థిత్వ పోరాటాలు ప్రారంభించడానికి పెరియార్ వుద్యమం దోహద పడిందనవచ్చు. పెరియార్ అనుచరులు బ్రాహ్మణేతర భావజాల చిహ్నాలను చెప్పులతో కొట్టి, దేవాలయాలను బహిష్కరించి, మనుస్మృతి వంటి గ్రంధాలను తగలబెట్టేవారు. అయితే యీ వుద్యమం వలన చైతన్యవంతమైన శూద్ర బహుజన కులాలవారు ఆర్ధిక పరిపుష్టి పొందాక క్రమంగా బూర్జువా రాజకీయాలకు లోనవడమే కాకుండా దళితులపైన దాడులకు పాల్పడి పెరియార్ స్పూర్తికి దూరమయ్యారు. యీ క్రమం మహారాష్ట్రలోని కున్ బీల విషయంలో కూడా జరిగింది. 2006 లో జరిగిన ఖైర్లాంజి సంఘటన దీనికి వుదాహరణ.
తమిళనాడులో ఆర్యదేవతల దేవాలయాలు గాక అనార్య దేవతలు, మాతృదేవతల ఆలయాలే అధికంగా వుండడం వెనుక పెరియార్ వంటి ద్రావిడ వుద్యమకారుల ప్రభావం వుందనే చెప్పాలి. సమాజంలోని సమస్తమైన రుగ్మతలు, ఆధిపత్య భావజాలానికి ప్రతీకలైన సంప్రదాయాలు సమూలంగా మారాలని భావించిన పెరియార్ తాను నమ్మిన సిద్ధాంతాన్ని అమలు పరచడానికి తన ఆస్థిని, సౌఖ్యాన్ని వదులుకొని సామాన్య జీవితాన్ని గడిపాడు. తన ప్రజలకు సామాజిక న్యాయం నిరాకరించే సమాజం ఆర్ధిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడే శక్తిగల నాయకులను సృష్టించలేదని ఆయన భావన. ఆధిపత్య భావజాలం యెక్కడున్నా దానిని ప్రశ్నించి తీరాలన్న పెరియార్ ఆత్మగౌరవ వుద్యమాలకు 'పెద్దాయన’. ఆయన స్మృతి అణగారిన కులాల అస్థిత్వ పోరాటాలకు నిరంతరం స్పూర్తిదాయకంగా నిలుస్తుంది.
(సెప్టెంబర్ 17 పెరియార్ జన్మదినం)

No comments:

Post a Comment