ఓ అద్భుత ప్రసంగం, మాడభూషి శ్రీధర్ గారిది!
ప్రియమైన మిత్రులారా!
నిన్న ఒక పూట 'కాశ్మీరు సమస్య' పై, మరియు మరో పూట 'పార్లమెంటు ఇటీవల ఆమోదించిన ప్రజావ్యతిరేక బిల్లులు' పై సి పి ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ AP రాష్ట్ర కమిటీ విజయవాడ, MB భవన్ లో సభ నిర్వహించింది. రెండో అంశంపై ప్రముఖ న్యాయ కోవిదులు, మాజీ కేంద్ర సమాచార కమీషనర్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ మాడభూషి శ్రీధర్ గారు ప్రధాన ప్రసంగకులు! ఆయన గంటకు పైగా ప్రసంగం చేశారు. అందులో విశిష్టత ఉంది.
ఉపన్యాసం ఒక కళ! అది రెండు విభాగాలుగా ఉంటుంది. వైద్యుడి చికిత్స వలెనే! రోగికి ఇవ్వాల్సిన మందును ఎంపిక చేయడం వైద్యుడి మొదటికర్తవ్యం. మానసికంగా మందును స్వీకరించే విశ్వసాన్ని రోగిలో కలిగించడం వైద్యుడి రెండో కర్తవ్యం. సభికులకు తాను చెప్పాలనుకున్న ప్రసంగ విషయాన్ని (subject) సందర్భ సహితం గా ఎంపిక చేసుకోవడం ఉపన్యాసకుడి/వక్త తొలి కర్తవ్యం! దానిని సభికులు/ప్రేక్షకులచే స్వీకరించే పద్దతి; అంటే ఒప్పించి మెప్పించే పద్దతి (approach) ని ఎంపిక చేసుకోవడం రెండో కర్తవ్యం! దీనినే రాజకీయ పరిభాషలో 'వస్తువు', 'శిల్పం' అంటారు. 'సారం' (content) , 'రూపం' (form) అని కూడా అంటారు. ఇందులో 'వస్తువు' మరియు 'సారం' ప్రాధమిక అంశాలుగా (primary things) ఉంటాయి. 'శిల్పం' మరియు 'రూపం' ద్వితీయ అంశాలుగానే (secondary things) ఉంటాయి. సాధారణంగా ఏదేని ఒకరి ఉపన్యాసం/ప్రసంగం ఎలా ఉందో వ్యాఖ్య లేదా విశ్లేషణ చేయాల్సి వస్తే, తొలుత అందులోని 'వస్తువు' (అంటే సారం) కే తొలి ప్రాధాన్యత ఇస్తాం. రెండో దానికి రెండో ప్రాధాన్యత ఇస్తాం. నిన్నటి మాడభూషి గారు సభికులను చేర్చిన ప్రసంగ 'విషయం' (అంటే తొలి అంశం) నన్ను ముగ్దుణ్ణి చేసింది. ఐనా అది అప్రస్తుత అంశంగానే భావిస్తున్నా. కారణం ఉంది. ఆయన ప్రసంగ 'తీరు/పద్దతి' (రెండో అంశం) మంత్ర ముగ్దుణ్ణి చేసింది. ముగ్దత కంటే మంత్రముగ్దత పెద్దది కదా! పెద్దగా గీసిన తొలిగీత పక్కన అంతకంటే పెద్ద గీతను గీసినట్లు! ఇప్పుడు దానికే ప్రాధాన్యత ఇస్తున్నా. అది కూడా తొలి ప్రాధాన్యత కాదు. ఏకైక ప్రాధాన్యతే!
తాను నిలిచిన చోటు నుండి కదలరు. ఉద్వేగం ఆవరిస్తే ఎందుకు కదలరని ఎదురు చూసినా, నిరీక్షణే తప్ప ఫలితం రాదు. గంటకు పైగా తాను నిశ్చల స్థానంలోనే నిలిచి, సభికులను అతి చలనంలోకి తీసుకెళ్లిన సంచలన ప్రసంగమది. తాను నిలవాలనుకున్న స్థానంలోనే ఆసాంతం నిలబడటం ఉపన్యాసాకుల కళ! దానికి ఎంతో స్థితప్రజ్ఞత ఉండాలి. చలింపజేసే వాళ్ళు చలించ కుండా ఎలా ఉంటారు? కదిలించే వాళ్ళు కదలకుండా ఎలా ఉంటారు? ఇదో ప్రశ్న! అందుకే ఒక్కక్షణమైనా, ఒక్కఅడుగైనా, తృటిలో అదుపు తప్పే ఒక్క పొరపాటైనా జరగక పోతుందా అనే నిరీక్షణ అది! ఊహూ! నిరీక్షణకు ఎదురైంది నిరాశే! తడబడని స్థితప్రజ్ఞత ఆయన స్వంతమని ఒప్పుకోక తప్పదు. ఆయన స్థితప్రజ్ఞతకు జేజేలు!
తాను ఉన్న చోటు నుండి కదలలేదంటే అర్ధం, ప్రేక్షకులు/సభికులు/శ్రోతల్ని కదలని స్థానంలో ఉంచారని అర్ధం కాదు సుమా! తాను ఏమాత్రం కదలకుండా, కదిలించారు. అదో కళ! తాను చాలా గట్టిగా గిరి గీసుకున్న సరిహద్దు లోపలే స్థిరంగా ఉండిపోయి, శ్రోతలను గీత దాటించడం తన ప్రసంగ విశిష్టత! అది కొందరికే సాధ్యమయ్యే ప్రసంగ నిపుణత! నవకవనానికి ఏది కావాలో చెబుతూ 'కదిలేదీ, కదిలించేదీ ...... ' అనే కవితోక్తి శ్రీశ్రీ కలం నుండి జాలు వారింది. 'కదిలేది లేదు, కదిలించేది ఉంది', నేకదలను, మిమ్ము కదిలిస్తా' అనేది మాడభూషి గారి ప్రసంగ విశిష్టత! ఆయన అచ్చమైన, స్వచ్ఛమైన, అసలు, సిసలు రాజ్యాంగ ప్రతినిధిగా, ప్రతీకగా ప్రసంగిస్తారు. తాను పడమర దిక్కున నిలబడి, పడమర యెక్క "మంచితనం" గూర్చి హాస్యరసభరితంగా ప్రభోధిస్తారు. వినే శ్రోతలు మాత్రం పడమర దిక్కులోనే ఉండిపోరు. అక్కడ నిలిచే చోటును మిగిల్చే స్తితి కూడా నేడు లేదు. ఉన్న ఏకైకదారి తూర్పుదిక్కు వైపే! అందుకే శ్రోతలు తూర్పుకు తరలిపోవాల్సిందే! ఆచరణలో ఆయన పడమర స్థానంలో నిలిచి, తన ఎదుట నిలిచిన ప్రేక్షకుల్ని తూర్పుకు తరలిస్తారు. పోనీలే, శ్రోతలను తరలించారని ఆయనపై అభాండమేల? ఆయన్ని స్థానభ్రంశం చేయడమెందుకు? అదో వ్రత భంగమౌతుందేమో? ఆయనకు ఇబ్బంది ఏల? ఆయన నిలిచిన స్థానంలో నిలబడకుండా ప్రేక్షకులు తమకు తామే అవిధేయతతో వేరే చోటుకు తరలిపోయారని అంటానులే! ఇంతకూ ఆయన స్థిరంగా, నిశ్చలంగా నిలిచిన స్థానం ఏది?
భారత రాజ్యాంగం ఆయన నిలిచిన స్థానం! అది ఆయన స్థిరనివాసం! తాను స్థలభ్రంశతకు ఏమాత్రం ఇష్టపడరని తెలిసిపోయింది. గంట సుదీర్ఘ ప్రసంగం కూడా మరో చోటుకు ఇంచు కూడా కదలలేదు. ఈమధ్య పార్లమెంటు ఆమోదించిన వివిధ చట్టాల్లో ప్రజా వ్యతిరేక అంశాలు తేలిక భాషలో చెప్పడం ఒక ఎత్తు! పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థానంలో/స్థలంలో కదలకుండా నిలిచి ప్రసంగించడం మరో ఎత్తు! సమాచార చట్టంపై ఆయన ఓ నిష్ణాతులు! దాని పై విషయం ఎలా మాట్లాడింది అప్రస్తుతం. కానీ తాను గీసుకున్న గీతకు స్థిరంగా కట్టుబడి, సభా నిర్వాహకుల్ని ఉద్దేశించి "నేను మీ పార్టీలకు చెందిన వాణ్ణి కాదు, మీ పార్టీల లో చేరమన్నా చేరను, నన్ను మీ మనిషిగా భావించవద్దు. నేను మోడీ వ్యతిరేకిని కూడా కాదు. బీజేపీ పార్టీ వ్యతిరేకిని కూడా కాదు. నేను రాజ్యాంగం మనిషి ని మాత్రమే" అని చివర లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నిజానికి అప్పుడు ఆయన మీద నాకు చిర్రెత్తాలి. కారణం ఉంది. నేను నలభై ఐదేళ్లుగా ఈ రాజ్యాంగం పై నిప్పులు కక్కిన వాడిని. నేటికీ దానిమీద కారాలు, మిరియాలు నూరుతూనే ఉన్నాను. రాజ్యాంగాన్ని నేను ఎంత గట్టిగా వ్యతిరేకిస్తున్నానో, దానికి మాడభూషి గారు అంతకంటే గట్టి వకాల్తాదారుగా తనను ప్రకటించుకున్నారు. 'ఎదో గొప్ప విప్లవ సందేశం ఇస్తారని వక్తగా ఆహ్వానిస్తే, తుస్సుమనిపించారే!' అని నేను నీరుగారి పోవాలి కదా! నిన్నటి సభా నిర్వాహకవర్గానికి చెందిన నాలో ఆయనపై 'ప్చ్, లాభం లేదు' అనే భావన కలగాలి కదా! అలా కలగలేదు. ఎందుకు?
ఆయన ముందే మొత్తం వామపక్షాలు, విప్లవ పక్షాలను ఉద్దేశించి, అన్యాపదేశంగా ఒక వ్యంగ్య చురక వేశారు. 'మీరు మీ పడికట్టు భాష నుండి బయట పడాలి. ఇంకా అక్కడే ఉంటే మీరు ఎంచుకున్న ప్రజల్ని చేరుకోలేరు' అన్నారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే శక్తులతో (ఆర్.ఎస్.ఎస్. వంటి శక్తులను ఉద్దేశించి కాబోలు! ఇది ఆయన అన్నది కాదు, ఆయన మనస్సు లో ఉందేమో అని నా ఊహ! నా ఆశ కూడా! ఒకవేళ అది ఆయన మనస్సులో లేకపోతే ఆయనపై అభాండం వేసి వ్రతభంగం కలిగించబోను) పోల్చి చురక వేసినట్లు అర్ధం చేసుకున్నా. 'వాళ్ళు ప్రజల వద్దకు చేరే భాషతో దూసుకెళ్తుంటే, మీరు ఇంకా పడికట్టు భాష దగ్గరే ఉన్నరేమిటి?' అని మమ్మల్ని ప్రశ్నించినట్లు అర్ధమైనది. ఇలా మాకు ముందే ముందరి కాళ్లకు బంధం వేయడం వల్ల ఆయన ప్రసంగాన్ని సృజనాత్మక దృష్టితో స్వీకరించాల్సిన బాధ్యత మీద పడింది. అందుకే కాబోలు, అసహనానికి బదులు సమాలోచనలో పడ్డాను.
ఔను, అసలు ఆయన్ని మనస్థానంలోనే విధిగా ఉండాలనీ, రావాలనీ ఎందుకు ఆశించాలి? తన స్తానంలోనే కదలకుండా ఉండనిద్దాం. చరిత్ర చెప్పిందేమిటంటే, 1950 రాజ్యాంగం వద్ద నిలిచి దృఢంగా, స్థిరంగా మాట్లాడే గొంతుకలు ఇప్పుడు కావాలి. అలాంటి మేధోస్వరాలు నేడు చాలా అవసరం! అవి ఆచరణలో రాజ్యాంగంలోని అందులో దాగిన నాలుగు సానుకూల ధోరణులకు (positive trends) ప్రతినిధులుగా మాడభూషి గారి వంటి మేధోస్వరాలను గుర్తించాలి. సుదీర్ఘ భారత స్వాతంత్ర్యోద్యమంలో నాలుగు ఉద్యమ స్రవంతుల భావజాలాల ప్రభావాలు రాజ్యాంగ రచనపై ఉన్నాయి. అవి వరసగా
1 - వలసవాద వ్యతిరేక భావజాలం
2 - ఫ్యూడల్ వ్యతిరేక ప్రజాస్వామిక భావజాలం
3 - సమాఖ్యవాద (ఫెడరలిజం) భావజాలం
4 - కుల,మత, తెగ, లింగ వివక్షత, పీడన వ్యతిరేక లౌకిక భావజాలం!
వాటి పునాదులపై నిర్మించిన రాజ్యాంగం కాదు. నిజమే! అందుకే మేం వ్యతిరేకించడం న్యాయమైనదే! ఐతే రాజ్యాంగ ఉపరితల నిర్మాణం మాత్రం పై నాలుగు భావజాలాల మిశ్రమ పదార్ధంతో నిర్మించిందే! పై నాలుగింటితో నిర్మించిన రాజ్యాంగంమీద ఫాసిస్టు శక్తులకు (ఫాసిస్తులు అనే కామెంట్ ని మాడభూషి గారికి అంటగట్టడం లేదు. నా భాష్యం మాత్రమే) నేడు రాజకీయ కడుపు మంట! తమ 'పెట్టుబడి' సేవకు అదో పెద్ద ప్రతిబంధకమై పోయింది. దాన్ని కూల్చి, నేరుగా ఫాసిస్టు రాజ్యాంగ రచన చేసే లక్ష్యం చేపట్టారు. నేడు అట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించే మేధావులు చాలా ముందు పుట్టుకొస్తారు. పుట్టుకొని రావాలి కూడా! ఫాసిస్టు వ్యతిరేక ధర్మయుద్ధంలో వారు పెద్ద మేధో సైనికులవుతారు. కాదు, సేనానులుగా కూడా మారతారు. మారాలని ఆకాంక్షించాలి కూడా! వాళ్ళు కదలకుండా నిలిచిన స్థానాల్ని ఎలా కదిలించాలని ఆలోచించడం కాదు నేడు చేయాల్సింది. ఆయన్ని, ఆయన వంటి రాజ్యాంగ మేధోస్వరాలను ఆసరా చేసుకుని నేటి తక్షణ ప్రమాదకరమైన ఫాసిస్టు శక్తులపై ఎలా పోరాడారో ఆలోచన చేయాల్సి ఉంది. బహుశా ఆయన 'పడికట్టు పద్దతి' గూర్చి చెప్పడంలో ఉద్దేశ్యం కూడా ఇదేనేమో! ముగింపు సందేశం ఎంత చక్కగా ఉందొ!
'ఈ బిల్లులన్నీ విల్లులై మనల్ని చుట్టుముట్టే వేళ వాటి లోతు పాతులు అర్ధం చేసుకొని తగు కర్తవ్యం రూపొందించు కోవాలని' పిలుపుతో ముగించిన తీరు బాగుంది. మా స్థానాల్లో ఉన్నవాళ్లకు ఇప్పుడు అదో కర్తవ్యమే కదా!
చరిత్రలో జర్మనీ, ఇటలీల నాటి చేదు అనుభవాలు ఇదే సందేశాన్ని ఇస్తున్నాయి. ఇటలీ పౌరసమాజంలో ఫాసిజం వటవృక్షంగా ఎడగడంలో తమ వైఫల్యాల గూర్చి ప్రత్యేక పరిశోధన చేసిన ఇటలీ కమ్మునిస్టు పార్టీ ప్రధాన నేత గ్రామ్సీ రచనల నుండి పొందాల్సిన స్ఫూర్తి ఇది కూడా ఇదేనేమో!
మాడభూషి గారూ, మీరు మీ స్తానంలోనే ఉందండీ. మీరు మీ స్థానంలో స్థిరంగా నిలబడినట్లే, మేము మా స్తానంలోనే స్థిరంగా నిలబడి మీ నుండి ఎంతో స్ఫూర్తి పొందుతాము. మీరు మాకు నేడు మేధోపరమైన స్ఫూర్తిదాతలే! ఇంతవరకూ మా స్తానాల్లో నిలబడ్డ మా మిత్రులు కొందరు మంచి వక్తల గూర్చి మమ్మల్ని వాకబు చేసి, సూచనలు అడిగే సందర్భాల్లో మీ పేరు గుర్తు వచ్చేది కాదు. 'ప్చ్' పొరపాటే! ఇక నుండి మా మిత్రులకు సూచిస్తాం. మీ స్థానానికి మచ్చ రానివ్వం. మీరు ఏదైనా మా భాష లేదా కార్యశైలి లో మార్పుల గూర్చి సూచనలు చేయడం తప్ప మా స్థానాల్ని మార్చుకోవాలని చెప్పే వారు కాదు. ఇక మనకి పేచీ లేదు కదా! మీ మేధోసేవలు నేటిపరిస్తితుల్లో చాలా అవసరం. ఆహ్వానించే సందర్భాల్లో శ్రమ తీసుకొని హాజరౌతారు కదూ!
✍ ఇఫ్టూ ప్రసాద్ (పిపి) 22-09-2019
గమనిక :--మా పార్టీ ప్రచురించిన 'నెత్తుటి ధారల్లో కాశ్మీరు లోయ-నిప్పులాంటి నిజాలు' పుస్తకాన్ని షెడ్యూల్డ్ ప్రకారం నిన్నటి సభలో అవిష్కరించాల్సి ఉంది. ముద్రణలో సాంకేతిక ఆటంకాల వల్ల నిన్న బయటకు రాలేదు. ఈరోజు 10-30AM కి విజయవాడ ప్రెస్ క్లబ్ లో పొలారి గారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ ఉంది. నన్ను కూడా ఆహ్వానిస్తే అనారోగ్యత వల్ల రాలేనని చెప్పా. కానీ ఈరోజు మరో సభలో అదే MB భవన్ లో కాశ్మీరు సమస్యపై అదే మాడభూషి గారి ప్రసంగం ఉంది. పైగా నిన్నటి సభలో ఆయనది కాశ్మీరు అంశం కాకపోయినా, కాశ్మీరు చీకటి కోణాలు తెలిపే ఒక అద్భుత గ్రంధం శ్రోతలకు చూపించి, ఊరించారు. పూర్తి బెడ్ రెస్టు తీసుకోవాల్సిన బ్యాక్ పెయిన్ స్థితిలో నిన్న రోజంతా సభలో కూర్చొని ఆరోగ్య సూత్రాల్ని ఉల్లంఘించా. ఈరోజు rest must అనుకున్నా. ఓవైపు పుస్తక ఆవిష్కరణ ప్రెస్ మీట్, మరోవైపు ఆరోగ్య నియమం! ఐనా మాడభూషి గారు ఆయస్కాంతంగా మారి నేటి ఆయన సభకు కూడా నన్ను శ్రోతగా మార్చారు. దానికి హాజరయ్యే ముందు మిత్రులకు ఈ పోస్టింగ్ ని పెడుతున్నా! ఇది కాశ్మీరు చీకటి కోణాలు ఏమిటో వినే ముందు మాట!
No comments:
Post a Comment