Monday, September 30, 2019

Gandhiji's life - Wahed


గాంధీ సమగ్రంగా… సంపూర్ణంగా
October 1, 2019

(మహాత్ముడిగా పేరుపడిన గాంధీజీ జీవితం గురించి అనేక మంది రాశారు. ఈ గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ గురించి కొందరు ప్రముఖుల అభిప్రాయాలు)
సెప్టెంబర్ 1947లో గాంధీజీ కొందరు ఆరెస్సెస్ కార్యకర్తలతో కలిశారు. న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతూ గాంధీజీ చెప్పిన మాటలు “ప్రయోజనకరంగా ఉండాలంటే, ఆత్మత్యాగం మాత్రమే సరిపోదు. లక్ష్యశుద్ధి ఉండాలి. నిజమైన జ్ఞానం ఉండాలి” అన్నారు. ముస్లింల పట్ల సంఘ్ వ్యతిరేకత కలిగి ఉందని ఆయన విన్నారు. హిందూ ధర్మం ఇతరులను పరాయివారిగా భావించేది కాదని ఆయన అభిప్రాయం. హిందువులకు ఇస్లాంతో విరోధమేమీ లేదని ఆయన భావించేవారు. ఆరెస్సెస్ బలం భారత ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది లేదా భారతదేశానికి వ్యతిరేకంగా అయినా ఉపయోగపడవచ్చని ఆయన భావించేవారు.

ఆరెస్సెస్ విషయంలో గాంధీజీ వైఖరి స్పష్టంగా లేదు. ఆయన ఆరెస్సెస్ విషయంలో ఊగిసలాట ప్రదర్శించేవారు. కాని సంఘ్ మాత్రం గాంధీజీ విషయంలో స్పష్టంగా ఉండేది. సంఘ్ గాంధీజీని నమ్మలేదు. 1947 సెప్టెంబరులో గాంధీజీ కలకత్తాలో నిరాహారదీక్ష చేశారు. హిందూ ముస్లిం కలహాలను నిరసిస్తూ ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఆరెస్సెస్ ఆయన ప్రయత్నాలను పరిహసించింది. ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసంలో గాంధీజీని అపహాస్యం చేస్తూ “రోమ్ తగులబడుతుంటే నీరో ఫిడేలు వాయిస్తున్నాడు” అని రాశారు. అంతేకాదు, “మన కళ్ళ ముందు చరిత్ర పునరావృతమవుతోంది.

ఒకవైపు పంజాబ్‌లోను ఇతర ప్రాంతాల్లోను అత్యంత హీనమైన, అమానుషమైన నేరాలు అల్లాహు అక్బర్ నినాదంతో ఇస్లాం పేరుతో జరుగుతుంటే, కలకత్తా నుంచి మహాత్మా గాంధీ ఈ ఇస్లాంను ప్రశంసిస్తూ, అల్లాహు అక్బర్ నినాదాలిస్తున్నారు. హిందువులంతా అదే పని చేయాలని చెబుతున్నారు.” అని ఆర్గనైజర్ రాసింది. కాని వాస్తవంగా జరిగింది వేరు. కలకత్తాలో గాంధీజీ నిరాహార దీక్ష హిందువులు, ముస్లిములు పునరాలోచించుకునేలా, సిగ్గుపడేలా చేసింది. గాంధీ జీ అప్పుడు 77 సంవత్సరాల తన నైతిక బలంతో, తనపై ప్రజలకున్న విశ్వాసంతో, అహింసాయుతంగా రెండు సముదాయాల మధ్య శాంతియుత పరిస్థితులు ఏర్పడేలా చేయగలిగారు.

అంతేకాదు, ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి, అక్కడ ముస్లింలు భయాందోళనలతో పాకిస్థాన్ వెళ్ళవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆయన సెప్టెంబర్ 9వ తేదీన ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఆయన సర్ సంఘ్ చాలక్, ఆరెస్సెస్ అధినేతతో కలిశారు. అప్పుడు ఆరెస్సెస్ అధినేత ఎం.ఎస్. గోల్వాల్కర్ నాజీలకు వీరాభిమాని. జాతి స్వచ్ఛత పట్ల నాజీల నిబద్ధతతను ఆయన ప్రశంసించేవాడు. “హిందూస్థాన్‌లో మనకు ఇది గొప్ప పాఠం, దీన్ని నేర్చుకుని లాభం పొందాలి” అనేవారు.

ఒక డాక్టరు … ఒక సాధువు
(గాంధీజీ గురించి అరుంధతీ రాయ్ చెప్పిన మాటలు మరి కొన్ని కొత్త విషయాలు మన ముందుంచుతున్నాయి. అంబేద్కర్ పుస్తకం కుల నిర్మూలనకు ముందు మాటగా రాసిన సుదీర్ఘమైన వ్యాస “ది డాక్టర్ ఆండ్ ది సెయింట్‌” నుంచి హిందూ పత్రిక ప్రచురించిన భాగాలు)

అంబేద్కర్, గాంధీ ఇద్దరు భారతదేశంలో చాలా ప్రభావం కలిగిన నేతలు. అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన పుస్తకం చాలా ముఖ్యమైన పుస్తకాల్లో ఒకటి. ఇది హిందూ ఛాందసవాదులకు వ్యతిరేకంగా రాసిన వాదన కాదు. ఉదారవాదులైన వారు ఆలోచించడానికి రాసిన పుస్తకం ఇది. వారిని అంబేద్కర్ ఉత్తమ హిందువులుగా పేర్కొన్నారు. కొందరు విద్యావేత్తలు వారిని వామపక్ష హిందువులు అని కూ డా పిలిచారు. కాని అంబేద్కర్ వాదనేమిటంటే, హిందూ శాస్త్రాలను విశ్వసిస్తూ ఒక వ్యక్తి తనను తాను ఉదారవాదిగా చెప్పుకోవడం పొంతన లేని విషయం. కుల నిర్మూలన పుస్తకం ప్రచురించబడినప్పుడు గొప్ప హిందువుగా పేరుపడిన మహాత్మాగాంధీ స్వయంగా అంబేద్కర్‌కు జవాబిచ్చారు.

వారిద్దరి మధ్య జరిగిన సంవాదం కొత్తదేమీ కాదు. వారిద్దరు తమ తరంలో సామాజిక, రాజకీయ, తాత్విక ఘర్షణలకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ నాయకులు. ఈ ఘర్షణ శతాబ్దాల పాతది. ఇంకా కొనసాగుతూనే ఉన్న ఘర్షణ. అంబేద్కర్ అంటరాని వర్గాల వారసుడు. కుల వ్యతిరేక మేధో సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే నాయకుడు. ఈ సంప్రదాయం కూడా కొత్తదేమీ కాదు. క్రీ.పూ. 200 నుంచి ఉన్నదే. గాంధీ ఒక వైశ్యుడు. గుజరాత్ బనియా కుటుంబంలో జన్మించాడు. అగ్రవర్ణ సంస్కర్తలు, వారి సంస్థల సుదీర్ఘ చరిత్రలో సరికొత్తగా ప్రవేశించిన నాయకుడు.

గాంధీజీ, అంబేద్కర్‌ల మధ్య సంవాదాన్ని దాని వెనుక నేపథ్యం గురించి తెలిస్తే తప్ప అర్ధం చేసుకోలేం. చరిత్ర, రాజకీయాలు వాటి నేపథ్యాలు కొంత తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇది కేవలం ఇద్దరు మనుషుల మధ్య జరిగిన సంవాదం కాదు. ఈ ఇద్దరు వేర్వేరు శిబిరాల ప్రయోజనాలకు ప్రతినిధులు. ఈ ఇద్దరి మధ్య సంవాదం భారత జాతీయ ఉద్యమ కాలంలో జరిగింది. కాబట్టి వాళ్ళు చెప్పింది, వారు చేసింది సమకాలీన రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం వేస్తుందన్నది గుర్తుంచుకోవాలి. వారిద్దరి మధ్య విభేదాలు పూడ్చరాని అఖాతాల వంటివి. ఇద్దరు నాయకులు దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులున్నవారు. ఈ ఇద్దరికీ అసంఖ్యాక అభిమానులున్నారు. వారిని దేవుళ్ళుగా ఆరాధించేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి వైపు మొగ్గు చూపినా మరొకరి అభిమానులకు కోపం వస్తుంది.

గాంధీని సవాలు చేసిన నేతల్లో అంబేద్కర్ ఒకరు. రాజకీయంగా, మేధోపరంగా మాత్రమే కాదు నైతికంగా కూడా గాంధీజీని సవాలు చేసిన నాయకుడు. కాని గాంధీ కథలో అంబేద్కర్ పాత్రను తొలగించిన కథే మనందరికీ తెలుసు. ఇది సంపూర్ణమైన కథ కాదు. అలాగే అంబేద్కర్ గురించి రాస్తున్నప్పుడు గాంధీజీని పక్కన పెట్టడం వల్ల కూడా అంబేద్కర్ కథ పూర్తి కాదు. ఎందుకంటే అంబేద్కర్ కథలోను గాంధీజీ పాత్ర చాలా ఉంది.

గాంధీ రచనలు 48,000 పేజీలు.. 92 సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. కలెక్టర్ వర్క్ ఆఫ్ గాంధీజీ. ఈ సంపుటాలు అనేక తరగతులుగా, అనేక విషయాలుగా, వర్గీకరించి క్రమబద్ధీకరించారు. గాంధీజీ అన్ని విషయాల గురించి మాట్లాడారు. అన్ని విషయాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. కాబట్టి ఎవరికి ఏది ఇష్టమైతే అది ఏరుకుని వాడుకోవచ్చు.

ఉదాహరణకు 1946లో ఆయన ఆర్కేడియన్ పారడైజ్ గురించి రాశారు. “పిరమిడ్ వర్సెస్ ది ఓషనిక్ సర్కిల్‌” అనే వ్యాసంలో స్వతంత్రం అనేది క్రింది నుంచి ప్రారంభం అవుతుంది. అందులో ప్రతి ఊరు ఒక రిపబ్లిక్. లేదా ప్రతి పంచాయతికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఊరు స్వయం సమృద్ధిగా తన వ్యవహారాలను తానే నిర్వహించుకునే స్థాయికి చేరుకుంటుంది. చివరకు యావత్తు ప్రపంచం నుంచి తన రక్షణ కూడా చూసుకునే స్థాయికి చేరుకుంటుంది.

ఈ విధమైన అనేక గ్రామాల వలయం ఏర్పడుతుంది. జీవితం అనేది పిరమిడ్‌లా మొత్తం భారాన్ని క్రింద ఉన్న ఆధారం మోసేది కాదు. జీవితం సముద్రంలోని వలయం వంటిది. ఈ వలయంలోని కేంద్రం ఎల్లప్పుడు గ్రామం కోసం సర్వం త్యజిస్తుంది. దాని వల్ల వలయం అంచుల్లో ఉన్న గ్రామం లోపలి వలయాన్ని ధ్వంసం చేయడానికి తన శక్తిని ఉపయోగించడం సాధ్యపడదు. కాని ప్రతి గ్రామం అందులోని గ్రామాలకు శక్తినిస్తుంది. ఇతరుల నుంచి శక్తిని పొందుతుంది.

ఈ మాటలు రాసిన గాంధీజీ 1921 నవజీవన్ లో కులవ్యవస్థను సమర్ధిస్తూ రాశారు. ఈ వ్యాసాన్ని అంబేద్కర్ గుజరాతీ నుంచి అనువదించారు. గాంధీజీ ప్రజలను మోసగిస్తున్నారని, ఆయన ఇంగ్లీషులో రాసినవి, గుజరాతీలో రాసినవి పోల్చి చూడండని అంబేద్కర్ అనేక సార్లు చెప్పారు.

కులం అనేది నియంత్రణకు మరో పేరు. సుఖ విలాసాలపై పరిమితులు విధిస్తుంది. కుల పరిధిని దాటి మనిషి సుఖవిలాసాల కోసం వెళ్ళలేడు. కులపరమైన ఆంక్షలకు అర్థమిదే. కులాంతర వివాహాలు, కులాంతర పంక్తి భోజనాలపై ఆంక్షలు ఇందువల్లనే. కులంపై ఇవి నా అభిప్రాయాలు అందువల్ల నేను కుల వ్యవస్థను ధ్వంసం చేయాలనుకునే వారిని నేను వ్యతిరేకిస్తాను అని రాశారు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ఇంతకు ముందు మనం చదివిన సముద్రంలో వలయం లాంటి నిర్మాణం గురించి రాసిన మాటలకు, అందరూ సమానంగా ఉంటారని రాసిన మాటలకు ఈ మాటలకు పొంతన ఉందా? ఈ రెండు అభిప్రాయాలు ప్రకటించిన తేదీల్లో పాతికేళ్ళ తేడా ఉందన్నది నిజమే. అంటే 1921 తర్వాత 1946 నాటికి గాంధీజీ మారిపోయారా? కులం గురించి ఆయన అభిప్రాయాలు మారిపోయాయా? కొంతవరకు ఆయన అభిప్రాయాలు మారాయి. ఎలా మారాయంటే, దేశంలోని నాలుగువేల పై చిలుకు కులాలన్నీ నాలుగు వర్ణాలుగా మారిపోవాలన్నారు. ఈ నాలుగు వర్ణాలనే అంబేద్కర్ కుల వ్యవస్థకు పునాదులని అంబేద్కర్ చెప్పారు.

హిందూ ధార్మిక శీలి
గాంధీజీ బహిరంగ ప్రసంగాలు, రచన లు చూస్తే, గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాతి నుంచి అంటే 1915 తర్వాతి నుంచి 1948 వరకు ఆయన ప్రతి ప్రసంగంలోను, ప్రతి రచనలోను హిందూ ధార్మిక అంశాలే మాట్లాడారు. ఉదాహరణకు రామరాజ్యం, గో రక్షణ, బ్రహ్మచర్యం, వర్ణాశ్రమం వగైరాలు మాట్లాడుతూ వచ్చారు. గాంధీజీ యంగ్ ఇండియా 10.6.1921లో రాసిన మాటలు “నేను సనాతన హిందువును. నేను వర్ణాశ్రమ ధర్మాన్ని విశ్వసిస్తాను. నేను గో రక్షణను విశ్వసిస్తాను”. హిందూ భజనలతో జరిగే బహిరంగ సమావేశాల్లో రఘుపతిరాఘవ రాజారం భజన బిగ్గరగా పాడేవారు. భారతీయులు ధార్మిక ప్రజలు. అప్పట్లో ధార్మిక భావాలు మరింత ఎక్కువగా ఉండేవి. ఒక సాధువు లేదా ఒక స్వామీజీ తన ఆశ్రమంలో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు బోధించవచ్చు.

కాని ఒక రాజకీయ నాయకుడు ఇవే విషయాలను ప్రతిరోజు రాత్రింబవలు బోధిస్తుంటే వాటి ప్రభావం ఒక నిష్ట గలిగిన ముస్లింపై ఎలా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి ముస్లింలు ముస్లింలకు సంబంధించిన ముస్లిం లీగ్ వంటి పార్టీల వైపునకు వెళతారు. ఇది బ్రిటీషు వారి ఉద్దేశాలకు అనుగుణంగా లేదా? విభజించు పాలించు విధానానికి అనుకూలంగా లేదా? అనేక దశాబ్దాల పాటు మతాన్ని రాజకీయాల్లో చొప్పించడం ద్వారా బ్రిటీషు వారికి ఏజంటుగా వ్యవహరించలేదా? భారతదేశంలో 20 శతాబ్దం ప్రారంభం నుంచి విప్లవాత్మక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అనుశీలన్ సమితి, జుగాంతర్ వంటి సంస్థల ఆధ్వర్యంలో జరిగాయి. సూర్యసేన్, రాంప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా, భగత్ సింగ్, రాజ్ గురు వంటి విప్లవ వీరులు (బ్రిటీషు పాలకులు ఉరి శిక్ష విధించారు) పోరాడారు. గాంధీజీ జాతీయోద్యమం విప్లవాత్మక పంథాలోకి వెళ్ళకుండా హాని చేయలేని అహింసాయుత సత్యాగ్రహం వైపునకు మళ్ళించారు. దీని వల్ల బ్రిటీషు వారికి ఎలాంటి హానీ కలుగదు. ఇది కూడా బ్రిటీషు ప్రయోజనాలకు అనుగుణమైనదే.

గాంధీజీ ఆర్ధిక విధానాలు ప్రతిచర్యాత్మకమైనవి. స్వయంసమృద్ధ గ్రామాలు రావాలని చెప్పారు. కాని ఈ గ్రామాల్లో ఉండేది కుల వ్యవస్థ. గ్రామాల్లో భూస్వాములు, వడీ వ్యాపారుల గుప్పిట్లోనే గ్రామాలు ఉంటాయి. గాంధీజీ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. నూలు వడకడాన్ని బోధించారు. చరఖా తిప్పమన్నారు. పారిశ్రామికీకరణకు దూరంగా ఉంచడానికి చూశారు. నోఖాలీ వెళ్ళి మత కలహాలను అదుపు చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలను చాలా మంది ప్రశంసిస్తుంటారు. దేశ విభజన కాలంలో జరిగిన దారుణ మత కలహాలివి. కాని ఆలోచించవలసిన ప్రశ్న ఏమంటే, అనేక దశాబ్దాల పాటు తన ప్రసంగాల్లో ధార్మిక బోధనలతో రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించి, అలా ఇల్లు తగలబెట్టే పని చేసి, తర్వాత మంటలను ఆర్పడమేమిటి?

గాంధీ తాత్వికతే సమితికి పునాది
గాంధీజీ దృష్టి, ఆయన తాత్వికతలే ఐక్యరాజ్యసమితికి మూల స్తంభాల వంటివి. ఆయన గొప్పదనం అన్నింటా సమైక్యతను చూడ డం. ఒకదానితో ఒకటి ఎలా సంబంధించి ఉన్నాయో అయన చూడగలిగే వారు. భారతదేశంలో వలస పాలన ను అంతం చేసిన జాతీయోద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. శాంతి, ప్రేమ, సమగ్రతలను కాపాడారు. ఆయన దృష్టి కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. మానవ హక్కులు, సమగ్ర పురోభివృద్ధిపై కూడా ఆయన దృష్టి సారించారు. గాంధీజీ అహింసను ప్రోత్సహించారు. ఒక తాత్వికతగా మాత్రమే కాదు, ఒక రాజకీయ వ్యూహంగా మాత్రమే కాదు, న్యాయాన్ని, మార్పును సాధించే మార్గంగా చూపించారు.

నిజానికి 2030 సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గురించిన ఆలోచనలపై గాంధీజీ ప్రభా వం చాలా ఉంది. ఒక ఉదాహరణ ఏమంటే, గాంధీజీ పారిశుద్ధ్యం విషయంలో అవగాహన కల్పించడం, ఆచరణాత్మక చర్యలు తీసుకోవడం ఈ రెండింటి ప్రాముఖ్యాన్ని గుర్తించారు. అందుకు ఉద్యమాలు నడిపారు. స్వచ్ఛమైన తాగు నీరు, పారిశుద్ధ్య సదుపాయాల కోసం ఉద్యమించారు. ఈ సమస్యలు నేటికి కూడా ఉన్నాయి. నిమ్న కులాల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, ముఖ్యంగా అంటరాని వారి కోసం ఆయన చేసిన ప్రయత్నాలు చెప్పుకోదగ్గవి.”

మద్యంకన్నా సిగరెట్టే ఎక్కువ ప్రమాదకారి. మద్యానికి ఒక మందు లక్షణం వుంది. మద్యపాన నిషేధ ఉద్యమకారులు దీన్ని గమనించాలి.  

No comments:

Post a Comment