Friday, September 27, 2019

GANDHI and RSS - Ramacvhandra Guha

GANDHI and RSS -  Ramacvhandra Guha 

నయవంచన అంటే ‘ధర్మాన్ని అధర్మం ప్రశంసించడమే’ నని 17వ శతాబ్ది ప్రముఖ ఫ్రెంచ్ రచయిత ఒకరు నిర్వచించారు. అక్టోబర్ 2న ఈ సామాన్య సత్యం భారతీయులకు అనేక విధాలుగా  తేటతెల్లమవనున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ వ్యక్తినయితే ఆయన జీవిత కాలంలో తీవ్రంగా దూషించిందో, ఆ కీర్తిశేషునికి నివాళులర్పించడానికి ఆ రోజున సంఘ్ ప్రచారక్‌లు- ప్రధానమంత్రి మొదలు పల్లె స్థాయి స్వయం సేవకుడి దాకా- తప్పక బారులు తీరుతారు. మహాత్ముని గురించి స్వయం సేవకులు బహిరంగంగా ఏమి చెప్పినప్పటికీ, ఆయనను గౌరవించే విషయంలో వారికి ఇప్పటికీ తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి.


మహాత్ముని 150 వ జయంత్యుత్సవాలను మరో ఐదు రోజుల్లో జరుపుకోనున్న శుభ సందర్భంలో ఈ కాలమ్ ప్రచురితమవనున్నది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మాజీ ప్రచారక్ ఒకరు దేశ ప్రధానమంత్రిగా వున్న; జాతి రాజకీయ, సామాజిక జీవనంలో ఆరెస్సెస్ ప్రాబల్యం అంతకంతకూ పెరిగిపోతోన్న కాలంలో మనం మన జాతిపిత నూట యాభయ్యవ జయంతిని జరుపుకోనున్నాం. అక్టోబర్ 2 న, గాంధీజీ గురించి ప్రధానమంత్రితో పాటు ఆరెస్సెస్‌తో సంబంధమున్న ఇతర ప్రముఖులు చాలా మంచి మాటలు చెప్పనున్నారు. చరిత్ర ఏమి చెప్పిందనే విషయమై పాఠకులను అప్రమత్తం చేయడం చాలా ముఖ్యమని భావిస్తున్నాను. మహాత్ముడు ఈ ధాత్రిపై నడయాడిన కాలంలో ఆరెస్సెస్, గాంధీ మధ్య వాస్తవ సంబంధాలను విశదం చేయాలని సంకల్పించాను.

శతాధిక సంపుటాలుగా ప్రచురితమైన ‘కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ’ లో ఆరెస్సెస్ గురించిన తొలి ప్రస్తావన 87 వ సంపుటంలో కనపడుతుంది. 1947 ఏప్రిల్ నాటి విషయమది. ఢిల్లీలో ఒక ప్రార్థనా సమావేశంలో, హిందూ-ముస్లిం సమైక్యత గురించి నొక్కి చెబుతూ మహాత్ముడు మాట్లాడారు. ప్రార్థనా సమావేశాలలో ఇస్లాం పవిత్ర గ్రంథం ‘ఖురాన్’ ప్రవచనాలను, హిందూ ధర్మాన్ని సుబోధకం చేసే ‘భగవద్గీత’ శ్లోకాలను ఉటంకిస్తూ అవి ఒకే సత్యాన్ని భిన్నరీతుల్లో ఎలా చెబుతున్నాయో గాంధీజీ వివరించారు. భిన్న మతాల ధర్మసూక్తులను గాంధీ ఇలా ఉటంకించడం పట్ల అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసనల్లో ఆరెస్సెస్ ప్రమేయమున్నదని వార్తలు వెలువడ్డాయి. అయితే సదరు నిరసనల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేస్తూ ఆరెస్సెస్ నుంచి తనకు ఒక లేఖ అందిందని గాంధీజీ పేర్కొన్నారు.

1947 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో ఆరెస్సెస్ కార్యకర్తల బృందం ఒకదానితో గాంధీజీ సమావేశమయ్యారు. ‘ప్రయోజనకరమైన సేవలు అందించేందుకు ఆత్మ త్యాగం ఒక్కటే సరిపోదు. లక్ష్య శుద్ధి, సమాజ సమస్యల పట్ల సరైన అవగాహన ఉండడం కూడా ఎంతైనా అవసరమని’ సంఘ్ కార్యకర్తలకు గాంధీ చెప్పాడు. ముస్లిముల విషయంలో ఆరెస్సెస్ నిష్పాక్షిక భావంతో వ్యవహరించదని తాను విన్నానని ఆయన పేర్కొన్నారు. హిందూ మతం కేవలం కొద్దిమందికే పరిమితమైన మతంకాదని తాను విశ్వసిస్తానని మహాత్ముడు అన్నారు. హిందువులకు ఇస్లాంతో ఎలాంటి ఘర్షణ లేదని ఆయన వక్కాణించారు.

హిందువులు- ముస్లిముల మధ్య హింసాకాండను నివారించడానికై 1947 సెప్టెంబర్ తొలి దినాల్లో మహాత్ముడు కలకత్తాలో నిరాహార దీక్ష చేపట్టారు. శాంతి స్థాపనకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ అపహసించింది. ‘రోమ్ నగరం తగుల బడిపోతుండగా నీరో చక్రవర్తి ఫిడేలువాయిస్తూ ఉండిపోయాడన్న’ నానుడిని ఉటంకిస్తూ ‘ఆర్గనైజర్’ ఇలా వ్యాఖ్యానించింది: ‘చరిత్ర మన కళ్ళ ముందు పునరావృతమవుతున్నది. ఇస్లాంను మహాత్మా గాంధీ ప్రశంసిస్తున్నారు. అల్లా హో అక్బర్ అని ఘోషిస్తున్నారు. ఒక పక్క పంజాబ్‌లోను, ఇతర రాష్ట్రాలలోను ఇస్లాం పేరిట అత్యంత అమానుషాలు చోటు చేసుకుంటుండగా, మరో పక్క హిందువులు కూడా అల్లా హో అక్బర్ అని నినదించాలని ఆయన ఉపదేశిస్తున్నారు!’

నిజానికి గాంధీ నిరాహార దీక్షతో కలకత్తాలో మతఘర్షణలు నిలిచిపోయాయి. హిందువులు, -ముస్లిముల మధ్య శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. 77 ఏళ్ళ ఆ వృద్ధమూర్తి తన నైతిక శక్తితో, ఘర్షించుకుంటున్న భిన్న మత వర్గాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడంలో సఫలమయ్యారు. న్యూఢిల్లీలో మత ఘర్షణలను నివారించేందుకు, భయాందోళనలతో పాకిస్థాన్ కు వెళ్ళ వలసిన అవసరం లేదని అక్కడి ముస్లిములకు నచ్చచెప్పేందుకు మహాత్ముడు 1947 సెప్టెంబర్ 7న దేశ రాజధానికి వచ్చారు. ఇక్కడ ఆయన ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ ఎమ్. ఎస్. గోల్వాల్కర్‌తో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12న ఒక ప్రార్థనా సమావేశంలో గాంధీజీ ప్రసంగాన్ని గురించిన వార్తకథనం ఇలా ముగిసింది: ‘చివరగా, ఆరెస్సెస్ అధిపతితో తాను, దిన్షా మెహతా జరిపిన సంభాషణల గురించి గాంధీజీ ప్రస్తావించారు. ఆరెస్సెస్ హస్తాలు రక్తపంకిలమయ్యాయని గాంధీజీ అన్నారు. ఇందులో నిజం లేదని ఆరెస్సెస్ అధినేత ఖండించారు. తమ సంస్థ ఏ మనిషికీ శత్రువుకాదని ఆయన స్పష్టం చేశారు. ముసములను సంహరించాలన్న భావన తమకులేదని, హిందుస్థాన్‌ను తమ శక్తి మేర సంరక్షించాలన్నదే తమ అభిమతమని అన్నారు. తమ సంస్థ (ఆరెస్సెస్) శాంతి స్థాపనకు నిబద్ధమయిందని పేర్కొంటూ గాంధీజీ తన అభిప్రాయాలను బహిరంగంగా తెలపాలని గోల్వాల్కర్ కోరారు’. గాంధీకి గోల్వాల్కర్ చెప్పింది నిజం కాదు. ఆరెస్సెస్, దాని అధినేత ముస్లిములను ద్వేషించారు. గాంధీ జీవితచరిత్ర రాసే కృషిలో భాగంగా నేను ఆ కీలక నెలల(1947 సెప్టెంబర్- 1948 జనవరి)కు సంబంధించిన ఢిల్లీ పోలీసు రికార్డులను అధ్యయనం చేశాను. ఆరెస్సెస్ సమావేశాలలో గాంధీ, ముస్లిములపై విద్వేష పూరిత విమర్శలు వెల్లువెత్తిన కథనాలు ఆ రికార్డులలో నాకు కొల్లలుగా కన్పించాయి. 1947 అక్టోబర్ చివరి వారంలో జరిగిన ఒక ఆరెస్సెస్ సమావేశం గురించిన పోలీసు నివేదిక ఇలా పేర్కొంది: ‘ఢిల్లీలో కొంత కాలం క్రితం ముస్లిములకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న తీవ్ర హింసాత్మక దాడుల వంటివి మరోసారి జరిగినప్పుడు మాత్రమే ముస్లిములు భారత్ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తారని సంఘ్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.. మహాత్ముడు ఢిల్లీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారా అని వారు ఎదురు చూస్తున్నారు. మహాత్ముడు ఢిల్లీలో ఉన్నంతవరకు ముస్లిములకు వ్యతిరేకంగా తాము రూపొందించుకున్న పథకాలను అమలుపరచడం సాధ్యం కాదని సంఘ్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు’.

గాంధీ ఈ పోలీసు నివేదికలను చదివి వుండే అవకాశ

Jaha
గాంధీ ఈ పోలీసు నివేదికలను చదివి వుండే అవకాశం లేదు. అయితే ఆరెస్సెస్ దాని అధినేత చెబుతున్న విషయాలు అబద్ధాలని ఆయన తన సొంత ఆధారాలతో ధ్రువీకరించుకున్నారు. 1947 నవంబర్ 15న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీ ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ వాదులు తమ సంస్థ మౌలిక ఆదర్శాలు, లక్ష్యాలకు నిబద్ధమయివుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూ,ముస్లిం సమైక్యతే కాంగ్రెస్ లక్ష్యమని, ఇందుకు కాంగ్రెస్ ఆరు దశాబ్దాలకు పైగా కృషి చేస్తూవస్తోందని ఆయన ఆ ప్రసంగంలో అన్నారు. భారత్‌లో ఉండిపోయిన ముసములకు పూర్తి భద్రతా భావం కలిగించాలని తన సహచరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. హింసాత్మక దౌర్జన్యాలు హిందూ మతాన్నిగానీ, సిక్కు మతాన్ని గానీ కాపాడలేవని ఆయన స్పష్టం చేశారు. గాంధీజీ ఇంకా ఇలా అన్నారు: ‘ఆరెస్సెస్ గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఈ దుండగాలన్నిటికీ ఆ సంస్థే మూల కారణమని కూడా విన్నాను. వెయ్యి ఖడ్గాల కంటే ప్రజాభిప్రాయమే మహా శక్తిమంతమయినదన్న సత్యాన్ని మనం విస్మరించకూడదు. అడ్డూఅదుపూ లేని హత్యలతో హిందూ మతానికి రక్షణ సమకూరదు. ఇప్పుడు మీరు స్వేచ్ఛా పౌరులు. ఈ స్వేచ్ఛను మీరు కాపాడుకోవాలి, మీరు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ధైర్యంగా ఉండాలి. నిరంతర జాగరూకతతో వ్యవహరించాలి. లేని పక్షంలో మీరు ఎంతో కష్టం మీద సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోతారు. అటువంటి దుర్దినం రాకూదని నేను ఆశిస్తున్నాను’.

ఆరెస్సెస్ పట్ల గాంధీకి ఇంకెంత మాత్రం భ్రమలు లేవు. ఇక సంఘ్‌లో మహాత్ముని పట్ల ద్వేష భావం మరింతగా పెరిగిపోయింది. 1947 డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో గోల్వాల్కర్ ప్రసంగిస్తూ ఇలా అన్నారు: ‘ముస్లిములు భారత్‌లో ఉండిపోయేలా చేయడం ఎవరికీ సాధ్యంకాదు. వారు వెంటనే ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. ముస్లిములు భారత్‌లో వుండిపోవాలని మహాత్ముడు కోరుతున్నారు. వచ్చే ఎన్నికలలో ముస్లిముల ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం. అయితే ఎన్నికలు వచ్చేనాటికి ఒక్క ముస్లిం కూడా భారత్‌లో ఉండబోడు. మహాత్ముడు వారిని ఇంకెంత మాత్రం తప్పు దోవ పట్టించలేరు. అటువంటివారిని మౌనం వహించేలా చేసేందుకు అవసరమైన సాధనాలు మనకు ఉన్నాయి. అయితే హిందువులకు హాని తలపెట్టడం మన సంప్రదాయం కాదు. అనివార్యమయితే అటువంటి చర్యలు చేపట్టేందుకు వెనుకాడే ప్రసక్తి లేదు’.

1948 జనవరిలో మహాత్ముడు న్యూఢిల్లీలో నిరాహారదీక్ష చేపట్టారు. కలకత్తాలో వలే, దేశ రాజధానిలో కూడా ఆయన దీక్ష వల్ల హిందువులు, ముస్లిముల మధ్య శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. ఆ తరువాత పాకిస్థాన్ వెళ్ళాలని ఆయన సంకల్పించుకున్నారు. ఆ దేశంలోని హిందువులు, సిక్కులకు సంపూర్ణ రక్షణ సమకూర్చాలనేది ఆయన లక్ష్యం. అయితే జనవరి 30 న నాథూరామ్ గాడ్సే అనే ఆరెస్సెస్ మాజీ సభ్యుడు మహాత్ముడిని శాశ్వతంగా బలిగొన్నాడు. ఆరెస్సెస్‌ను తక్షణమే నిషేధించారు. గోల్వాల్కర్‌తో సహా సంఘ్ నాయకులు పలువురిని జైలుకు పంపించారు.

గోల్వాల్కర్ సంభాషణలు, ప్రసంగాల సంకలనమయిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ (1966లో ప్రచురితమయింది) అనే పుస్తకం ఆరెస్సెస్‌కు బైబిల్ లాంటిది. ‘ఏ మనిషికీ ఆరెస్సెస్ శత్రువు కాదని’ గోల్వాల్కర్ ఒకసారి గాంధీజీకి చెప్పారు. ఈ అభిభాషణ ఒక స్వతస్సిద్ధ అసత్యం మన జాతికి ముగ్గురు శత్రువులు వున్నారని, వారితో మన జాతీయభద్రతకు ఎనలేని ముప్పు వాటిల్లనున్నదని గోల్వాల్కర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ ముగ్గురు ముస్లిములు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు అని ఆయన విశ్వసించారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండు దశాబ్దాల తరువాత కూడా భారతీయ ముస్లిముల పట్ల ఆయన తన అకారణ భయాన్ని, విద్వేషాన్ని విడనాడలేదు. ఆసేతు హిమాచలం ‘మినీ పాకిస్థాన్‌లు’ చాలా ఉన్నాయని గోల్వాల్కర్ వ్యాఖ్యానించారు

నయవంచన అంటే ‘ధర్మాన్ని అధర్మం ప్రశంసించడమే’నని 17వ శతాబ్ది ప్రముఖ ఫ్రెంచ్ రచయిత La Rochefoucald ( 1613–------80) నిర్వచించారు. అక్టోబర్ 2న ఈ సామాన్య సత్యం భారతీయులకు అనేక విధాలుగా తేటతెల్లమవనున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ వ్యక్తినయితే ఆయన జీవిత కాలంలో తీవ్రంగా దూషించిందో, ఆ కీర్తిశేషునికి నివాళులర్పించడానికి ఆ రోజున సంఘ్ ప్రచారక్‌లు- ప్రధానమంత్రి మొదలు పల్లె స్థాయి సంఘీయుడి దాకా- తప్పక బారులు తీరుతారు. భారత్ కేవలం హిందువులకే గాక అన్ని మతాల వారికీ సమత, మమత పంచే ధాత్రి అని సునిశ్చితంగా విశ్వసించి, ఆ విశ్వాస ప్రాతిపదికనే జీవించి, మరణించిన మహాత్ముని గురించి సంఘీయులు బహిరంగంగా ఏమి చెప్పినప్పటికీ, ఆయనను గౌరవించే విషయంలో వారికి ఇప్పటికీ తీవ్ర అభ్యంతరాలు, ఆక్షేపణలు వున్నాయి.
   
రామచంద్ర గుహ 
 (వ్యాసకర్త చరిత్రకారుడు

No comments:

Post a Comment