Wednesday, November 6, 2019

మనుస్మృతి (భాగం-2)- నాగవరపు రవీంద్ర

మనుస్మృతి (భాగం-2)-   నాగవరపు రవీంద్ర
వివాహం ఎనిమిది రకాలు: అవి-బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. ఈ ఎనిమిదింటిలో పైశాచం అధమము, బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్యములు. ఈ నాలుగు వివాహాలు బ్రాహ్మణునికి మేలయినవి. అసుర, పైశాచ వివాహములు తప్ప మిగిలినవి క్షత్రియులకు సమ్మతములు. రాక్షసము తప్ప మిగిలిన వివాహాలు వైశ్య, శూద్రులకు ధర్మ శాస్త్ర విహితమే అని తెలుసుకోవాలి.

వేదాధ్యయనం చేసి, సదాచార వంతుడయిన ఒక బ్రహ్మచారిని తానుగా రప్పించి, మర్యాదలు చేసి, అలంకరించిన కన్యను అతనికి ఒసగడాన్ని బ్రాహ్మణ వివాహం అంటారు.

జ్యోతిష్టోమము మొదలయిన యజ్ఞాలలో ఆధ్వర్యం చేసే ఋత్విజునికి కన్యను ఇవ్వడం దైవ వివాహమంటారు.

యాగాది సిద్ధికోసంగాని, కన్యకు ఇవ్వడానికిగాని రెండు ఆవులనో, రెండు ఎద్దులనో వరుని నుంచి తీసుకుని శాస్త్ర ప్రకారం వరునికి కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం అంటారు.

“మీ ఇద్దరూ కలసి ధర్మమాచరించండని చెప్పి కన్య తల్లిదండ్రులు వరుని పూజించి పిల్లనివ్వడం ప్రాజాపత్య వివాహం అంటారు.”

జ్ఞాతులకు, పిల్లకు కావలిసిన ధనం ఇచ్చి తమ ఇష్టంతో పెళ్లిచేసుకోవడాన్ని అసుర వివాహమంటారు. స్త్రీ పురుషు లొకరికొకరు ఇష్టంతో అంగీకరించి కలవడాన్ని గాంధర్వమంటారు. ఈ వివాహం కామసంబంధమైనది. మైధున కర్మ కోసం ఏర్పడింది.

కన్యక బంధువులు సమ్మతింపనప్పుడు వారిని చంపిగాని లేదా నాశనం చేసి వాళ్ళకోసం విలపిస్తున్న కన్యను బలవంతంగా తెచ్చుకోవడం రాక్షస వివాహం అంటారు.

నిద్రించే ఆమెనుగాని, మత్తులోవున్న ఆమెనుగాని, ఏమరుపాటుతోనున్న ఆమెనుగాని బలాత్కారముగా, ఏకాంతముగా క్రీడించడాన్ని పైశాచికం అంటారు. ఈ వివాహం మిక్కిలి నీచమైనది.

జలధారాపూర్వకంగా కన్యాదానం చేయడం బ్రాహ్మణులకు ఉత్తమం. ఉదకథారా పూర్వకంగా కన్యాదానం చేయాలన్న నియమం క్షత్రియాది తక్కిన వర్ణాల వారికి లేదు. తల్లి దండ్రులు మాట ఇవ్వడం, వధూవరులకు ఇష్టం వుంటే చాలు.

బ్రాహ్మ వివాహముచే పుట్టిన కుమారుడు పుణ్యం చేసినవాడు. అతడు తన ముందటి పది తరాల వారిని, తన తరువాత పది తరాల వారిని పాపాల నుంచి విముక్తం చేస్తాడు.

దైవ వివాహం చేసుకున్న దంపతులకు పుట్టినవాడు ముందు ఏడు తరాల వారిని,   తరువాత ఏడు తరలవారిని పాపవిముక్తులను చేస్తాడు. ఆర్ష వివాహజాతుడు ముందు వెనుకల మూడు తరాల వారిని, ప్రాజాపత్య వివాహజాతుడు “ముందు వెనుకల ఆరు తరాల వారిని ఋణ విముక్తుడిని చేస్తాడు.”

బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము మొదలైన నాలుగు వివాహాల్లో జన్మించిన పుత్రులు వేదాధ్యయన సంపత్తి వలన వచ్చిన తేజస్సు కలిగినవారై, పెద్దలకు ఇష్టమైన వారుగా జన్మిస్తారు. వీరు మంచి రూపము, గుణము, బలము గలవారై, ధనవంతులై కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూరేళ్ళు జీవిస్తారు.

రాక్షస వివాహం వలన జన్మించిన పుత్రులు క్రూరులు, అసత్యవాదులు, వేదవిరోధులు, యాగాదికర్మ ద్వేషులై వుంటారు.

భార్యను సంతోషపెట్టడమే వ్రతంగా భావించి, ఇతర స్త్రీలను కోరక భార్యను ప్రేమించాలి.

స్త్రీలకు సహజంగా పదహారు దినాలు ఋతుకాలం. అందులో మొదట నాలుగు రోజులు సజ్జన నిందితాలు. ఈ ఋతుకాలం దినాలలో మొదటి నాలుగు, పదకొండవ పదమూడవ దినాలు దాంపత్య జీవితానికి పనికిరావు. తక్కిన పది రాత్రులు ప్రశస్తమైనవి. ఈ పదిరాత్రులలో ఆరు, ఎనిమిది మొదలగు సరి రాత్రులలో స్త్రీతో కలిస్తే పుత్రులు పుడతారు, బేసి రాత్రులలో సంగమంవల్ల స్త్రీలు పుడతారు. కాబట్టి పుత్రుణ్ణి కోరుకునే వ్యక్తి సరిరాత్రులలో, పుత్రికను కోరుకునే వ్యక్తి బెసిరాత్రులలో భార్యతో కలవాలి.

వివేకి అయిన కన్యతండ్రి, వరుని నుంచి కొద్దిగా అయినా ఓలి తీసుకోరాదు. అలా ఓలి తీసుకోవడమంటే బిడ్డను అమ్ముకున్నట్లే.

కన్యకు వివాహకాలంలో ఇచ్చిన ధనాన్ని, వాహనాలను, వస్త్రాలను ఆ కన్య తండ్రిగాని, బంధువులుగాని వాడుకుంటే వాళ్ళు పాపం చేసిన వాళ్లై అధోగతి పాలవుతారు. కన్యలకు ప్రీతితో ఒసగిన ధనాన్ని వారి నిమిత్తమే ఉపయోగించాలి.

ఏ కులంలో స్త్రీలు గౌరవింపబడుడురో ఆ కులం వారిపై దేవతలు దయ గలిగి వుంటారు. ఏ కులం స్త్రీలను గౌరవించారో ఆ కులం వారు  దైవక్రియలన్నీ వృధా.

కాబట్టి ఐశ్వర్యం కోరే మానవులు ఉత్సవాలప్పుడు, వివాహలప్పుడు తోబుట్టువులు మొదలైన స్త్రీలను భూషణావాదులతో సత్కరించాలి.

ఏ వంశంలో భార్తవల్ల భార్య, భార్యవల్ల భర్త సంతోషంగా వుంటారో ఆ వంశంలో సంపద తాండవమాడుతుంది.

గృహస్థుడు చేట, రోలు, రోకలి, ఇంటిపాత్రాలు శుద్ధిచేసే ఆలుకుచుట్ట, నీళ్ళ కడవ – వీటిని ఉపయోగించడం వల్ల అయిదు హత్యాపాపములను పొందుతున్నాడు. ఈ అయిదు పాపాలను పోగొట్టుకోవడానికి అయిదు మహాయజ్ఞాలు చేయమని పండితులు గృహస్థులకు బోధించారు.

వేదాలు చెప్పడం, తాను చదవడం – బ్రహ్మయజ్ఞం, పితరులను తర్పణములతో తృప్తినోందించడం పితృయజ్ఞము. అగ్నియందు వేల్చు హోమం దైవయజ్ఞము. వైశ్యదేవము, భూత బలి-ఇవి భూత యజ్ఞము. అతిధి పూజ  మనష్య యజ్ఞము.

ఎవరు ఈ అయిదు యజ్ఞాలను వదలక యధాశక్తి ఆచరిస్తారో వారిని పై అయిదు హత్యాపాపాలు అంటవు.

దేవతలకు, భూతములకు, అతిధులకు, పితరులకు ఏ గృహస్థుడు అన్నము నొసగడో అతను జీవించివున్నా మరణించినవాడి క్రిందే లెక్క.

ఆహుతము, హుతము, ప్రహుతము, బ్రాహ్మ్యహుతము, ప్రాశితము అనునవి పంచ యజ్ఞములు. ఆహుతము అనగా జపము. హుతమనగా అగ్నిహోత్రమునందు చేసే హోమము. ప్రహుత మనగా భూతముల కోసగే బలి. బ్రాహ్మ్యహుతమనగా బ్రాహ్మణోత్తముని పూజ, ప్రాశిత మనగా పితృతర్పణము.

దారిద్ర్యంతో నిత్యం అతిధిపూజ చేయలేని బ్రాహ్మణుడు ఎల్లప్పుడు వేదాధ్యయనంపై శ్రద్ధ కలిగి వుండాలి. అగ్నిహోత్రమునందు, దైవకర్మలపై శ్రద్ధ గలవాడు చరాచర రూపమగు ప్రపంచాన్ని పోషించగలుగుతాడు. ప్రాణవాయువు నాశ్రయించి జీవులు జీవించినట్లు గృహస్థుని ఆశ్రయించి తక్కిన యాశ్రమస్థులు జీవిస్తారు.

గృహస్థుడు మిగిలిన ఆశ్రమముల వారిని వేదాధ్యయనం చేయించి, అన్న పానముల నొసగి ప్రతిరోజూ వారిని పోషిస్తున్నాడు. కాబట్టి మిగిలిన ఆశ్రమముల కన్నా గృహస్థుడు శ్రేష్టుడు.

ఋషులు, పితృదేవతలు, వేల్పులు, భూతములు, అతిథులు, వీరంతా గృహస్థుల నుంచి తమకు కావలిసినవి కోరుకుంటారు. కాబట్టి బుద్ధిమంతుడగు గృహస్థుడు వారికి కావలసినవి తెలుసుకుని సమర్పించుకోవాలి.

వేదాధ్యయనంతో ఋషులను, హోమములతో దేవతలను, శ్రాద్ధములచేత పితృదేవతలను, అన్నముతో అతిథులను పూజించాలి.

గృహస్థుడైన బ్రాహ్మణుడు శాస్త్ర ప్రకారం గోదానం చేసి ఎంత పుణ్యం పొందుతాడో అంట పుణ్యాన్ని భిక్షమొసగి పొందవచ్చును.

అతిథికి భోజనం పెట్టలేనప్పుడు పడుకోవడానికి వసతి కల్పించాలి. త్రాగడానికి నీళ్లివ్వాలి, మంచిగా మాట్లాడాలి.

ఏ గృహస్థులు ఎల్లప్పుడూ ఇతరుల ఇళ్ళల్లో భోజనాలు కోరుతుంటారో వారు మరుజన్మలలో ఆ దాతల గృహాల్లో పశువులుగా జన్మిస్తారు.

సూర్యుడు అస్తమించాక వచ్చిన అతిథిని గృహస్థుడు తిరస్కరింపకూడదు. అతిథికి భోజనం పెట్టాలి. అతిథికి పెట్టని పదార్థాలను తాను కూడా తినకూడదు. వచ్చిన అతితుల్లో గొప్పవారికి గొప్పగాను, తక్కువవారికి తక్కువగాను, సములకు సమముగాను అతిథి మర్యాదలు చేయాలి.

అతిథి అయిన బ్రాహ్మణుడు భోజనం కోసం తన కులగోత్రాలను చెప్పకూడదు. అలా భోజనం కోసం కులగోత్రాలు చెప్పేవాడు వాంతి చేసుకున్న అన్నాన్ని తినే వాడని పండితులు అంటారు.

బ్రాహ్మణ గృహంలో బ్రాహ్మణులు తప్ప మిగిలిగినవారు అతిథిలుగారు. క్షత్రియ గృహంలో బ్రాహ్మణులు, క్షత్రియులు అతిథులు. వైశ్యునికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు  అతిథులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు శూద్రుడు అతిథి కాదు.

క్షత్రియుడు బ్రాహ్మణుని ఇంటికి వస్తే బ్రాహ్మణులు భోజించిన పిదప అతనికి భోజనం పెట్టాలి.

వైశ్యశూద్రులు బ్రాహ్మణుని ఇంటికి భోజనానికి వస్తే వారికి తమ ఇంటిసేవకులతో భోజనం పెట్టాలి.

కొత్త పెళ్ళికూతురికి, రోగులకు,  గర్భిణులకు – వీళ్ళకు అతిధులకంటే ముందే భోజనం పెట్టాలి.

బ్రాహ్మణులు, అతిథులు, సేవకులు భుజించిన పిదప దంపతు లిరువురూ భోజనం చేయాలి.

బ్రాహ్మణుడు అమావాస్యనాడు పితృ యజ్ఞమును చేసి, ఆ తరువాత పిండాన్వాహార్యకమనే శ్రాద్ధమును పెట్టాలి.

పితృదేవతలను గురించి నెలనెలా చేసే మాసిక శ్రాద్ధమును నన్వాహార్య మంటారు. ఈ మాసిక స్రాద్దములో ప్రశస్త మాంసాన్ని ఉపయోగించాలి.

ఈ శ్రాద్ధములో దేవతా స్థానంలో ఇద్దరు బ్రాహ్మణులను, పితృ దేవతా స్థానమున ముగ్గురు బ్రాహ్మణులను, లేదా దేవస్థానమునకు, పితృస్థానానికి ఒక్కొక్క బ్రాహ్మణుని భోజనానికై నియమించాలి. ఎంత ధనికుడైనా ఇంతకంటే ఎక్కువ మందిని శ్రాద్ధానికి నియమింపకూడదు.

వేదాధ్యయన మొనర్చిన బ్రాహ్మణులకే దాతలు హవ్యమును (దేవతలకు సమర్పించే భోజనం) కావ్యమును (పితృదేవతలకు సమర్పించే భోజనం) సమర్పించాలి, అట్టి ఉత్తములకు సమర్పించే హవ్య, కవ్యముల వల్ల దాతలకు ఎక్కువ ఫలితం కలుగుతుంది.

దేవతా కార్యాలలో, శ్రాద్దాదులైన పితృకార్యాలలో ఒక్కొక్క విద్వాంసుడైన బ్రాహ్మణునికైనా భోజనం పెట్టాలి. ఇలాంటి విద్వాంసులకు భోజనం పెడితేనే ప్రయోజనం ఉంటుంది. వేద మంత్రాలి తెలియని ఎంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినా ఫలితం ఉండదు.

శ్రాద్ధాది కర్మలలో వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే, వేదమంత్రాలు తెలియని పదిలక్షలమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత ఫలం కలుగుతుంది.

వేదాలు తెలియని బ్రాహ్మణునికి శ్రాద్ధాది కర్మలలో భోజనం పెడితే ఆ దాత నరకంలో శిక్షను అనుభవిస్తాడు.

స్నేహితులను సంతోషపరచేందుకు ఎవడు మిత్రులను శ్రాద్ధ కర్మలకు పిలిచి, దక్షిణ ఇస్తాడో అతనిచ్చిన దక్షిణ, పైశాచ దక్షిణ అవుతుంది. కర్త స్వర్గలోకం నుంచి భ్రష్టుడైపోతాడు.

యోగ్రులను పిలిచి గౌరవించి దక్షిణ ఇవ్వడం వల్ల దాతకు పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతులు దొరకనప్పుడు గుణవంతుడైన స్నేహితుని ఆహ్వానించ వచ్చును.

శ్రాద్ధమునందు ఋగ్వేదమును అధ్యయనం చేసిన వానిని గాని, యజుర్వేదమును పూర్తిగా అధ్యయనము చేసిన వానిని గాని, పరిపూర్ణంగా సామవేదమును అధ్యయనము చేసిన వానిని గాని పిలిచి అతనికి భోజనము పెట్టవలయును. వీరిలో ఏ ఒక్కరినైనా ఏ శ్రార్ధకర్మలలోనైనా ఆహ్వానించి పూజిస్తే ఆ శ్రార్ధకర్మ యొక్క పెద్దలకు ఏడు తరాలకు శాశ్వత ముక్తి కలుగుతుంది.

హవ్యకవ్యములకు జ్ఞానులు దొరకనప్పుడు తల్లి తండ్రిని, మేనమామను, మేనల్లుని, పిల్లనిచ్చిన మామను, గురువును, కూతిరి కొడుకును, అల్లుని, పినతల్లి కొడుకులను, యజ్ఞాలు చేయించిన ఋత్విజుని, శిష్యుని ఆహ్వానించవచ్చును.

దైవ కార్యాలకు బ్రాహ్మణుని కులగోత్రాలను, యోగ్యతలను పరశీలించాల్సిన అవసరం లేదు. శ్రాద్ధానికి మాత్రం బ్రాహ్మణుని యోగ్యతలను పరిశీలించాలి.

దొంగ, పతితుడు, నాస్తికుడు మొదలైన వారు హవ్యకవ్యములకు అనర్హులు.

వైద్యులను, కూలికోసం గుడిపూజా చేసే వారిని, మాంసం అమ్మే వాళ్ళను, వ్యాపారం చేసే వాళ్ళను హవ్యకవ్యాలకు పిలవకూడదు.

క్షయరోగం గలవాడిని, బ్రతుకునకు గొర్రెలను, మేకలను చంపెవాడిని, అన్నకన్నా ముందు పెళ్లిచేసుకున్నవాడిని, పంచ మహాయజ్ఞములు చేయని వాడిని బ్రాహ్మణులను ద్వేషించే వాడిని, తమ్ముడు విహాహము చేసుకున్నా పెళ్లి చేసుకోని అన్నను, నాట్యం వల్ల జీవించేవాడిని, పెళ్ళికాకముందే స్త్రీలతో సంబంధం వుండే వాడిని, సవర్ణ స్త్రీని విడిచి శూద్ర స్త్రీని పెళ్లి చేసుకున్నవాడిని, రెండవ పెళ్ళిచేసుకున్న ఆమె కొడుకును, ఇంటిలోనే యువసతి గలవాడిని, జీతం తీసుకని వేదం చెప్పేవాడని, జీతం ఇచ్చి చదువుకున్న వాడిని, శూద్ర గురువుని, శూద్రుని శిష్యుని, తల్లిదండ్రులను, గురువుకు సేవలు చేయని వాడిని, ఇల్లు తగుల బెట్టిన వాడిని, విషము పెట్టిన వాడిని, సముద్రయానం చేసిన వాడిని, తప్పుడు సాక్ష్యం చెప్పే వాడిని, తండ్రితో వాడడం చేసేవాడిని, డబ్బు ఇచ్చి జూదం ఆడించేవాడిని, పాప రోగాలు గలవాడ్నిని, నేరం మోపబడినవాడిని, విల్లు, బాణాలు చేసేవాడిని, పెద్దది వుండగా ముందుగా పెళ్లి చేసుకున్న ఆమె భర్తను, మిత్ర ద్రోహిని, జూదమాడి జీవించేవాడిని, కొడుకు దగ్గర వేదాధ్యయనం చేసిన వాడిని, బోల్లిగాలవాడిని, అపస్మార రోగిని, తగాదాలమారిని, పిచ్చివాడిని, గుడ్డివాడిని, వేదాలను నిందించే వాడిని, ఒంటెలు, గుర్రాలు, ఏనుగుల్ని మచ్చిక చేసేవాడిని, జ్యోతిశ్శాస్త్రముచే జీవించే వాడిని, సేవకవృత్తి చేసేవాడిని, కూలికి చెట్లు పెంచేవాడిని, కుక్కలను పెంచే వాడిని, శూద్ర వృత్తిలో ఆసక్తి గలవాడిని, మేకలను, గేదెలను పెంచేవాడిని, విధవను వివాహం చేసుకున్న వాడిని, డబ్బు తీసుకుని శవాలు మోసేవాడిని, సజ్జనుల తోడ సహపంక్తి భోజనానికి అనర్హుడైన బ్రాహ్మణాధమున్ని హవ్యకవ్యములకు పిలవకూడదు.

అన్న కన్నా ముందు పెళ్లి చేసుకున్న తమ్ముడు ఆ అన్న, తమ్మున్ని వివాహం చేసుకున్న కన్య, కన్యాదాత ఆ వివాహము చేయించువాడు వీరు ఐదుగురు నరకం పొందుతారు.

పంక్తికి అర్హుడు కానివాడు చూస్తుండగా ఆ సహాపంక్తిలో ఎందరు సజ్జనులకు భోజనం పెట్టినా దాతకు భోజనం పెట్టినందువల్ల లభించిన ఫలం అనర్హుడు చూడటం వల్ల పోతుంది. కాబట్టి అనర్హున్ని సజ్జనుల మధ్య భోజనానికి కూర్చో పెట్టకూడదు.

పంక్తిలో గ్రుడ్డివాడికి భోజనం పెట్టడం వల్ల తొమ్మిదిమందికి భోజనం పెట్టిన ఫలితాన్ని దాత కోల్పోతాడు. కంటిమీద కాయగాచిన వాడికి భోజనం పెట్టడంవల్ల అరవై మందికి భోజనం పెట్టిన ఫలాన్ని, తెల్ల కుష్టు గలవాడికి భోజనం పెడితే వందమందికి పెట్టిన ఫలమును, రాజయక్ష్మ రోగ పీడుతుడికి భోజనం పెడితే వేయి మందికి భోజనం పెట్టినప్పుడు పొందిన ఫలాన్ని దాత కోల్పోతాడు.

శూద్రులకు పురోహితుడైన వాడికి పంక్తి భోజనం పెడితే ఆ పురోహితుడు పంక్తిలో ఎంతమంది బ్రాహ్మణులను తాకుతాడో అంతమందికి భోజనం పెట్టిన ఫలాన్ని దాత కోల్పోతాడు.

వేదవేత్త అయిన బ్రాహ్మణుడు శూద్ర యజమాని నుంచి ఆశతో దానాన్ని తీసుకుంటే మట్టి నీటిలో కరిగినట్టు నశిస్తాడు.

వైద్యునికి దానం చేస్తే ఆ దాత మరుజన్మలో చీము, రక్తం తినే పురుగుగా పుడతాడు. పూజారికి దానం చేస్తే దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. వడ్డీలకు, అప్పులిచ్చేవాడికి దానం చేస్తే దాతకు కీర్తి నశిస్తుంది. కావున శ్రాద్ధ కర్మలలో వీరిని పిలవకూడదు.

వేదాలను చక్కగా ఆధ్యయనం చేసిన వానిని, షడంగ ములను ఎరిగిన వానిని, శ్రోతీయ వంశములో పుట్టిన వానిని పంక్తి పావనులంటారు.

ఐదు అగ్నిహోత్రములు చేసే వానిని, బ్రాహం వివాహం చేసుకున్న వారికి పుట్టిన కుమారుని, వేదార్థవేత్తను, వేదార్థ ప్రవచనం చేసే వానిని, బ్రహ్మచర్య వ్రతము అనుష్ఠించు వానిని, ఎక్కువగా గోదానములు చేసిన వానిని, శ్రోత్రియుడైన బ్రాహ్మణుని పంక్తిపావనులుగా భావిస్తారు.

అనర్హుల వలన అపరిశుద్ధమయిన బ్రాహ్మణుల పంక్తిని ఈ పంక్తిపావనులను ఆహ్వానించడం ద్వారా పరిశుద్ధ పరచవచ్చును.

బ్రాహ్మణులకు దేవతల కార్యముకంటె పితృకార్యము ముఖ్యమైనది.

శ్రాద్ధకర్మ చేసే ప్రదేశాన్నిగోమయంతో ఆలికించాలి. ఆ ప్రేదేశం దక్షిణం వైపుకు వాలుగా వుండేలా చూడాలి. స్వభావ సిద్ధంగా పరిశుభ్రంగా వుండే అరణ్యాలు, ఏకాంత స్థలాలు, పుణ్యనదుల తీరాల్లో చేసే శ్రాద్ధంవల్ల పితరులు సంతోషపడతారు.

తండ్రి ఉన్నప్పుడు తల్లికి శ్రాద్ధం పెట్టవలిసి వస్తే అప్పుడు తండ్రిని విడిచి పితామహాదులు ముగ్గిరికే పిందదానం చేయాలి.

శ్రాద్ధకర్మ అన్నం వుంచిన పాత్రను ఒకచేత పట్టుకుని మరో చేత్తో డాన్ని మూసి తీసుకురాక, ఒక్క చేత్తోనే మూయకుండా పట్టుకు వస్తే ఆ అన్నాన్ని రక్కసులు అపహరిస్తారు.

కూరలను, పప్పు, కూరగాయలకు, పెరుగు, పాలు, తేనే మొదలైన వాటని అన్నం కన్నా ముందే తెచ్చి అక్కడ వుంచాలి.

వడలు మొదలయిన పిండి వంటలను పాయాసాలను, ఫలాలను హృద్యము లైన సువాసన గల మాంసములను, పానీయాలను తెచ్చి చుట్టూ వుంచాలి.

పరిశుభ్రంగా వుండి, పదార్థగుణాలను తెలుపుతూ జాగ్రత్తగా వడ్డించాలి. అలా వడ్డించేటప్పుడు చనిపోయిన వ్యక్తిని తలచుకొని కన్నీరు కార్చకూడదు. కోపపడకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. చెదిరిన అన్నమును కాలితో తొక్క కూడదు. విస్తరిలో అన్నం చెదిరిపడేటట్లు వడ్డించకూడదు.

కన్నీరు పెడితే శ్రాద్ధాన్నాన్ని ప్రేతాలు భుజిస్తాయి. కోపపడితే శత్రువులు పొందుతారు. కల్లలాడితే కుక్కలు తింటాయి. కాలితో తాకినా అన్నము రాక్షసులను చేరుతుంది. వడ్డించేటప్పుడు చెదిరిన అన్నాన్ని పాపాత్ములు తింటారు. కాబట్టి జాగ్రత్తగా వడ్డించాలి.

బ్రాహ్మణులకు ఏది ఇష్టమో దానిని మత్సరము మాని వారికి వడ్డించాలి. బ్రహ్మతత్త్వ ప్రతిపాదకములైన కథలను చెప్పాలి. పితరులకు ఈ కథలు బాగా ఇష్టం.   

భోజన కాలంలో వేదాలను, ధర్మశాస్త్రాలను వినిపించాలి. ఇతిహాసాలను, పురాణాలను, పురుషసూక్తం, శ్రీ సూక్తం మొదలైన సూక్తాలను వినిపించాలి.

పరిశుభ్రత, కోపం లేకపోవడం, సావకాశంగా వుండటం మొదలైనవి పితరులకు ప్రీతి కలిగిస్తాయి.

అన్నాది పదార్థాలు ఎప్పటివరకు వేదిగా వుంటాయో, భోక్తలు ఎంతవరకు మౌనంగా భుజిస్తారో, ఎంతవరకు భోక్తలు భోజన అనుగుణాలను చెప్పారో, అంతవరకు పితరులు భోజనం చేస్తారు.

భోక్తలు తలకు పాగా చుట్టుకుని భుజిస్తే, దక్షిణంవేపు కూర్చుని భుజిస్తే, చెప్పులు వేసుకుని కూర్చుని భుజిస్తే దానిని రాక్షసులు భుజిస్తారే గాని పితృదేవతలు భుజించరు. కాబట్టి భోక్తలు అలా భుజించకూడదు. హోమము, దానము, బ్రాహ్మణ భోజనము మొదలైన సమయాలలోను, అమావాస్య, పౌర్ణమి మొదలైన దైవకార్యాల లోనూ, శ్రాద్ధము మొదలైన పితృకార్యములలోనూ చండాలురు మొదలయినవారు కంటబడితే ఆ కార్యము ఏ  ఉద్దేశముతో జేస్తారో ఆ ఫలం దక్కదు.

పంది వాసన చూడటం వల్ల, కోడిరెక్కల గాలి సోకడం చేత, కుక్కచూపు పడడంవల్ల, శూద్రుడు తాకడంవల్ల పదార్థాలు అపరిశుద్ధమవుతాయి. కాబట్టి అలాంటి అపరిశుభ్ర పదార్ధాలతో చేసిన శ్రాద్ధాది క్రియలు నిష్పల మవుతాయి.

కుంటివాడు, కాయగాచిన కంటివాడు, అంగవైకల్యము గలవాడు శ్రాద్ధకర్త ఇంటి పనివాల్లుగా వుంటే శ్రాద్ధకర్మ రోజున వాళ్ళందరినీ యింటినుండి తరిమి వేయాలి. 

శ్రాద్ధకర్మ చేసినవాడు భోక్తలకు పెట్టగా మిగిలిన అన్నాన్ని శూద్రుడికి ఇస్తే, ఆ అన్నదాత మూఢుడై, నరకాన్ని చెరతాడు. శ్రాద్ధ భోక్త (తాను కోరక) తనను కోరివచ్చు భార్యతోనైనా ఆ దినము సంగమించిన యెడల అతని పితృదేవతలు ఒక్క నెలవరకు ఆ స్త్రీ యొక్క పురీషములో పడివుంటారు.

భోక్తలు భుజించిన తరువాత కొందరు పిండప్రదానము చేస్తారు. అగ్ని యందు, నీతియందు వేస్తారు. మరికొందరు కాకులు, పక్షులకు పెడతారు.

ధర్మార్థ కామములలో మనోవాక్కాయ కర్మలచే భర్తకే సేవచేసేది, సజాతి యందు పుట్టినది, మొదటి భార్య అయి, శ్రాద్ధ క్రియలందు శ్రద్ధగల పుత్రులను కోరే యువతి ఆ పిండాలలో నడుమనున్న పితామహ పిండాన్ని భుజించాలి.

అలాంటి పిండాన్ని భుజించడంవల్ల ఆ యువతి దీర్ఘాయుష్మంతుడు, కీర్తి, బుద్ధి, ధనసంపద గలవాడు, సంతతి గలవాడు, బలవంతుడు, ధర్మపురుషుడు అయిన పుత్రుని కంటుంది.

తిలలు, ధాన్యములు, యవలు, దుంపలు, నీళ్ళు, పండ్లు మొదలయిన వాటిని పితృప్రీతికై శాస్త్రప్రకారం బ్రాహ్మణునికి దానమొసగితే దాటినళ పితృదేవతలు ఒక్క నెల తృప్తిపొందుతారు. మత్స్య మామసాలు దానము చేస్తే రెండు నెలలు, జింక మాంసం దానం చేస్తే మూడు నెలలు, గొర్రె మాంసం దానం చేస్తే నాలుగు నెలలు, బ్రాహ్మణులు తినదగిన పక్షుల మాంసం దానం చేస్తే ఐదు నెలలు, మేక మాంసం దానం చేస్తే ఆరునెలలు, చారల జింక మాంసం దానం చేస్తే యేడు మాసాలు, కృష్ణ మృగ మాంసం దానం చేస్తే ఎనిమిది నెలలు, దుప్పిమాంసం దానం చేస్తే తొమ్మది నెలలు, ముండ్లపంది, అడవిదున్న మాంసం దానం చేస్తే పది నెలలు, కుందేలు, తాబేలు మాంసం దానం చేస్తే పదకొండు నెలలు, గోవు సంబంధమయిన పాలు, పెరుగు, నెయ్యి వీటితో శ్రాద్ధ మొనర్చి దాన మొసగితే ఒక సంవత్సరకాలం, వార్ధ్రీణ మను ముసలి మేకపోతు మాంసముచే శ్రాద్ధమొనర్చి, దానంచేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పితరులు తృప్తి పొందుతారు.

కాల శాకమను శాకమును, ముళ్ళుగల చేపలు, ఖడ్గమృగము, ఎర్రని పొట్టేలు, వీటి మాంసమును ధాన్యము, తేనె మొదలయిన వాటితో శ్రాద్ధ మొనర్చితే పితరులు అంతులేని కాలంపాటు తృప్తి పొందుతారు.

సరి తిధులయందు, సరి నక్షత్రములయిన భరణి రోహిణ్యాదుల యందును శ్రాద్ధ మొనర్చినవాడు సకల మనోరధములను పొందును. బేసి తిధులగు పాడ్యమి మొదలైన తిధులలో, అశ్వని, కృత్తిక మొదలైన బేసి నక్షత్రాలలో  శ్రాద్ధ మొనర్చే వాడు పూర్ణ ధనమును, విద్యావంతులైన సంతతిని పొందుతారు.

పితృక్రియలను శుక్లపక్షము కంటే కృష్ణ పక్షము ఎలా ఉత్తమమో అలాగే పూర్వాహ్ణము కంటే అపరహ్ణము ఉత్తమము.

రాత్రులందు శ్రాద్ధము చేయరాదు. ఉదయ సాయంత్ర సంధ్యాకాలములలొ శ్రాద్ధము చేయకూడదు. సూర్యోదయం అయిన వెంటనేగూడా చేయగూడదు.

No comments:

Post a Comment