Monday, November 18, 2019

‘ఇంగ్లీష్‌ మీడియం విద్యను మతానికి ముడి పెట్టే వారిని జాతి క్షమించదు’

‘ఇంగ్లీష్‌ మీడియం విద్యను మతానికి ముడి పెట్టే వారిని జాతి క్షమించదు’
Nov 18, 2019, 15:31 IST
Minister Adimulapu Suresh Comments On Andhrajyothi Radha Krishna - Sakshi
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల వారికి ఉన్నత విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసమే సీఎం వైఎస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టారని చెప్పారు. గతంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరువేల పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారని..ఇప్పుడు 61 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారని తెలిపారు. ఇంగ్లీష్‌పై పట్టులేక ఎంతో మంది ఉద్యోగవకాశాలను కోల్పోతున్నారని, పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. శాస్త‍్రీయ పద్ధతిలో ఇంగ్లీష్‌ మీడియం విద్యాబోధన ఉంటుందన్నారు.


మతం రంగు పూయడం దారుణం..
ఆంగ్ల బోధనపై మతపరమైన రంగు పూయడం దారుణమన్నారు. ఇంగ్లీష్‌ మీడియానికి, మతానికి సంబంధం ఏమిటని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందన్నారు. ‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు రాతలు రాస్తున్నారు. వారి పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలోనే చదివారు.. వారు మతం మారారా..? రెండు లక్షల మంది ఇంగ్లీష్‌ చదివి విదేశాలకు వెళ్ళారు.. వారు మతం మారారా..’ అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి గొప్ప మేలు చేస్తున్నారని.. కొంతమంది అది జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మతానికి ముడి పెట్టే వారిని జాతి ఎప్పటికీ క్షమించదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చర్యలు తీసుకుంటామన్నారు. మతం పేరుతో చేసిన దుష్ప్రచారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకంతో పేదలను విద్యకు దగ్గర చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment