Thursday, November 7, 2019

ఉష్‌.. ఇంగ్లిష్‌!

ఉష్‌.. ఇంగ్లిష్‌!
07-11-2019 03:55:01

‘ఇంగ్లిష్‌ మీడియం’ నిర్ణయంపై నోరుమెదపని తెలుగు ప్రేమికులు
నాడు ఆంగ్లమంటేనే ఆగ్రహావేశం
పట్టణాలకు ఇంగ్లిష్‌ మీడియాన్ని పరిమితం చేస్తామన్నా ససేమిరా
తల్లిదండ్రులు స్వాగతించినా, టీడీపీ నిర్ణయంపై రోడ్డెక్కి నిరసన
‘ఐచ్ఛికం’ చేసేదాకా ఉద్యమబాట
అలాంటిదిప్పుడు అన్ని స్కూళ్లలో ఎనిమిదో క్లాసుదాకా ఉన్నపళంగా
అయినా, స్పందించని సంఘాలు
ఆనాడు వ్యతిరేకించిన యార్లగడ్డ అధికార భాషా సంఘానికి పెద్ద
ఇప్పుడేమో నోరుమెదపని వైనం
కసరత్తు, క్రమమంటూ లేకుండా ‘తెలుగు’ స్కూళ్లు ఇంగ్లిష్‌లోకి..
టీచర్లలో ఆంగ్లంపై పట్టు కొంతే
పిల్లలు భయపడితే డ్రాపవుట్ల ముప్పు
తల్లిదండ్రుల్లో భయాందోళనలు
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని జగన్‌ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై ‘తెలుగు ప్రేమికులు’, భాషా సంఘాల మౌనం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం కేవలం అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలనుకొన్నప్పుడు గగ్గోలు పెట్టినవారంతా, ఇప్పుడు గప్‌చుప్‌ అయిపోయారు. నాడు ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించినవారిలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ముందున్నారు. ఇప్పుడు ఆయన అధికార తెలుగు భాషాసంఘం చైర్మన్‌. తెలుగు భాషను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయనదే. అలాంటిది రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఎనిమిదో తరగతి వరకు తెలుగును కేవలం ఒక సబ్జెక్టుకు కుదించేలా ప్రభుత్వ నిర్ణయం ఉన్నా, ఆయన స్పందించడం లేదు. అలాగే, అర్బన్‌లో ఇంగ్లిష్‌ మీడియంపై నాటి మంత్రి నారాయణ ప్రతిపాదన చేసినప్పుడు, వ్యతిరేకించిన వారెవరూ ఇప్పుడు నోరు మెదపకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


నాడు ‘అర్బన్‌’ అన్నా మంటలే
చంద్రబాబు ప్రభుత్వంలో అర్బన్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో మున్సిపల్‌ శాఖ నిర్వహించిన మంత్రి నారాయణ.. విద్యావేత్త కూడా కావడంతో ఈ అంశంపై లోతుగా అధ్యయనం జరిపారు. పట్టణాల్లో పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను, విద్యారంగంతో ముడిపడిన అన్ని వర్గాలను దీనిపై ఆరా తీశారు. వారిలో ఎక్కువమంది ఆంగ్ల మాధ్యమం పట్ల మొగ్గు చూపించారు. భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకొని, జీవితంలో తమ పిల్లలు మెరుగ్గా స్థిరపడేందుకు ఇంగ్లిష్‌ మీడియం ఆవశ్యకమని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి పట్టణాల్లోని మున్సిపల్‌ పాఠశాలల్లో చదివేవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలే ఎక్కువ. ప్రైవేట్‌ పాఠశాలల గడప తొక్కడానికి వారి పేదరికం అడ్డుగా ఉంది. చదివించే స్థోమత లేని కుటుంబాల్లోని పిల్లలే మున్సిపల్‌ స్కూళ్లకు వస్తుంటారు. ఆంగ్ల మాధ్యమంలో చదివి, మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆకాంక్షను వారు తీర్చుకోలేని పరిస్థితి! ఈ పరిస్థితులన్నీ మంత్రి నారాయణ ప్రతిపాదనను బలపరిచేలా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది.

ఈ మేరకు 2017 జనవరి 2న జీఓ. నం.14 విడుదల అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్‌ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో పిల్లలకు చదువు చెప్పాలని ఆ జీవోలో స్పష్టం చేశారు. మున్సిపల్‌ స్కూళ్లలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. అయితే, మేధావులు, విద్యావేత్తలు, భాషాసంఘాలు మాత్రం వ్యతిరేకించాయి. ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఉపాధ్యాయ సంఘాలు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వంటి భాషాభిమానులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ పేరుతో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. తెలుగును విస్మరించిందని తీవ్ర స్వరం వినిపించారు. మంత్రి నారాయణ విద్యను వ్యాపారం చేసే కుట్రలో ఈ ఉత్తర్వులు ఇచ్చారని ఆగ్రహించారు. ఉపాధ్యాయ సంఘాలు.. ఉద్యమాలు చేసి వరుస ధర్నాలు, నిరసనలు చేపట్టాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘాలు, భాషాభిమానుల మనోగతాన్ని కూడా అప్పటి ప్రభుత్వం గమనంలోకి తీసుకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టారు. తెలుగు మీడియంకు సమాంతరంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తూ, ఆసక్తి మేరకు విద్యార్థులు ఏ మీడియంనైనా ఎంచుకొనేలా ఉత్తర్వులు సడలించారు. దీంతో అప్పట్లో ఆ సమస్య సద్దుమణిగింది.

నేడు ‘అన్నీ’ అన్నా మౌనమే..
జగన్‌ ప్రభుత్వం అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంను ఉన్నఫళంగా ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా టీచర్లు తెలుగులో పాఠ్యాంశాలను బోధించారు. వారిలో ఎక్కువమందికి ఇంగ్లి్‌షపై పట్టు తక్కువ. స్కూలును ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చినంత తేలిగ్గా, పాఠ్యాంశాలను ఇంగ్లి్‌షలో చెప్పించడం సాధ్యం కాదు. దానికోసం ముందస్తు ప్రణాళిక, తగిన కసరత్తు, క్రమ విధానం పాటించాల్సి ఉంటుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లుగా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థుల ముందు ఇంగ్లిష్‌ మీడియం పెడితే, వారిలో భయం పెరిగి డ్రాపవుట్లు పెరిగే ప్రమాదం ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను గానీ, టీచర్లను గానీ ఇంగ్లిష్‌ మీడియం మార్చే విధానం క్రమానుగతంగా సాగాలని, ఒక తరగతి నుంచి మరో తరగతికి ఈ విధానం అమలుచేస్తూ.. ఫలితాలను సమీక్షిస్తూ, దీర్ఘకాలంగా ఈ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలే అంటున్నాయి. అయితే, రాష్ట్రప్రభుత్వం ‘ఇంగ్లిష్‌ మీడియం’ ప్రకటనలో ఇలాంటి ముందుచూపు గానీ, ప్రత్యేక చర్యలు గానీ కనిపించకపోయినా.. ‘తెలుగు ప్రేమికుల’ స్వరాలేవీ వినిపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ లాంటి భాషా సంఘాల పెద్దలు ఇప్పుడేమయ్యారన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

ఉత్తర్వు రద్దు చేయండి: జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న మాటకు తూట్లు పొడిచేలా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల భాషలో బోధనను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులివ్వడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. దీనిపై బుధవారం సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు చదువుతామనే విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

సర్కారు ఉత్తర్వులపై ఖండన
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విద్యా హక్కు చట్టాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, జింకల సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని ఆంగ్లప్రదేశ్‌గా మార్చడం సమంజసం కాదని, ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎ్‌సటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జోసెఫ్‌ సుధీర్‌బాబు, గాజుల నాగేశ్వరావు అన్నారు. రాష్ట్రంలో మాతృభాషా మాధ్యమాన్ని పూర్తిగా రద్దుచేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అశాస్ర్తీయమని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.రఘురామిరెడ్డి, పి.పాండురంగవరప్రసాద్‌ అన్నారు. తమ బిడ్డలను ఏ మీడియంలో చదివించుకుంటారో తల్లిదండ్రుల ఇష్టానికి వదిలేయాలని సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ స్టడీస్‌ అండ్‌ సర్వీ్‌స(సెస్‌) చైర్మన్‌ నాగటి నారాయణ అన్నారు. ఇంగ్లిష్‌ మీడియం మాత్రమే అమలు చేయాలనే నిర్ణయం విద్యారంగానికి, ప్రభుత్వానికి నష్టం చేస్తుందన్నారు. పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు తెలుగును కొనసాగించాలన్నారు.

No comments:

Post a Comment