Thursday, November 7, 2019

ఆంగ్ల భాషపై ఉపాధ్యాయులకు శిక్షణ

ఆంగ్ల భాషపై ఉపాధ్యాయులకు శిక్షణ
Nov 07, 2019, 15:35 IST
English Training To Govt Teachers In Andhra Pradesh - Sakshi
పిల్లలకు నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది

8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం: మంత్రి  సురేష్‌

సాక్షి, వైఎస్సార్‌: రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ మండల, గ్రామ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. గురువారం మంత్రి కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనవరి నుంచి మే నెల వరకు వివిధ దశల్లో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషపై ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఆంగ్ల భాష నైపుణ్యాలను పిల్లలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇంగ్లీష్‌ నైపుణ్యం పిల్లలకు అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.


ఆంగ్ల భాషలో బోధించేందుకు 98 వేల మంది ఉపాధ్యాయులు అవసరం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 62.36 శాతం మాత్రమే ఆంగ్ల భాష అభ్యసిస్తున్నారని వివారలను వెల్లడించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర  ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యము, ప్రతిభ బయటపడుతుందని చెప్పారు. తెలుగు భాష వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కచ్చితంగా అన్ని అంశాల్లో తెలుగు భాషను కూడా బోధిస్తామని,  ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్ల ప్రదేశ్ అనడం సమంజసం కాదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ భాషా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, విద్యార్థుల బావి తరాల భవిష్యత్‌ను గుర్తు పెట్టుకుని ఇంగ్లీషు మీడియంను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ పెట్టామని అ‍న్నారను. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెడుతున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీషు మీడియం లేక చాలా మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగీషు మీడియంను ప్రవేశ పెట్టి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదలు, వెనుక బడిన ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టడం ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.



No comments:

Post a Comment