Saturday, November 9, 2019

అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు అప్రజాస్వామికం! - న్యూ డెమోక్రసీ

అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు అప్రజాస్వామికం! రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం!     
న్యూ డెమోక్రసీ , ఏపీ, రాష్ట్రాకమిటీ
----------------------------------
                                                      అయోధ్యలో రామజన్మభూమి, బాబరీ మసీదు వివాద స్థలం 2.77 ఎకరాల స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అప్రజాస్వామికమైనది. ఒకవైపు 27 ఏళ్ల క్రితం మసీదు కూల్చివేత చర్యని తప్పుపట్టిన సుప్రీంకోర్టు, మరోవైపు అదే తప్పు చేసిన శక్తులకు అదే  వివాదాస్పద స్థలాన్ని అప్పగించడంలో పరస్పర వైరుధ్యం ఉంది. చట్టాన్ని స్వయంగా తమ చేతుల్లోకి తీసుకొని మసీదును కూల్చి వేసిన విధ్వంస శక్తులకి పై స్థలాన్ని అప్పగించిన చర్య, భవిష్యత్తు లో అట్టి విధ్వంసకర విధానానికి మరింత బలం చేకూరుస్తుందని మా పార్టీ అభిప్రాయపడుతోంది. ఎనిమిదేళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టు మెజారిటీ బెంచి వివాదాస్పద స్థలాన్ని మూడు సంస్థలకి మూడు సమభాగాలు చేసి పంపిణీ చేసిన పాక్షిక తీర్పును కూడా తోసిపుచ్చి, ఆనాడు జస్టిస్ వర్మ (మైనారిటీ బెంచి) ఇచ్చిన తీర్పును ఖరారు చేయడం పెనం మీద నుండి పొయ్యిలో  పడినట్లు అయినది.  బాబరీ మసీదు కూల్చక ముందు కాలంలో "మసీదును ముస్లిములు వదులుకుంటే, అయోధ్యలోనే కోరుకున్న మరోచోట ప్రత్యామ్నాయ స్థలం ఇస్తాం" అని హిందుత్వ సంస్థలు ఇవ్వ జూపిన నాటి పరిస్కారాన్నే నేడు సుప్రీంకోర్టు చూపించిన చర్య అత్యంత అన్యాయం. పురావస్తు ఆధారలే ప్రాతిపదికగా మార్చితే ప్రాచీన, మధ్యయుగ కాలాలలో ఫ్యూడల్ పాలకుల చర్యలకు నేడు విరుగుడు పరిష్కారాల్ని వెదకాల్సి వస్తుంది. ఇది ఆధునిక న్యాయసూత్రాలకు విరుద్ధం.వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటం ద్వారా కొన్ని లౌకిక, సమాఖ్యవాద, ప్రజాతంత్ర విలువలను భారత రాజ్యాంగ సభ అంగీకరించి రాజ్యాంగంలో చేర్చింది. భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన  రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసి, హిందూరాష్ట్ర స్థాపన లక్ష్యంతో పనిచేస్తున్న ఆర్.ఎస్.ఎస్. రాజకీయ ఎజెండాకు బలం చేకూర్చే తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చిందని మాపార్టీ భావిస్తోంది. ఇది ఫాసిస్టు మార్గానికి బలం చేకూర్చే తీర్పు! మెజారిటీ మత విశ్వాసాల పేరిట హిందువుల్ని రెచ్చగొట్టి, వారు ఎదుర్కొనే వాస్తవ సమస్యల నుండి దృష్టి మళ్లించే హిందుత్వ రాజకీయ స్వార్ధ శక్తుల వ్యూహానికి ఉపయోగపడే తీర్పుగా కూడా మాపార్టీ భావిస్తోంది. దేశ ప్రజల మధ్య మతవిద్వేషాలతో చిచ్చు పెట్టి వర్గపోరాటలు, ప్రజాతంత్ర, సామాజిక, అస్తిత్వ ఉద్యమాల్ని  బలహీన పరిచే బడా కార్పొరేట్ వర్గాల లక్ష్యాలకు ఈ తీర్పు ఉపయోగపడుతుందని కూడా  మా పార్టీ భావిస్తోంది. ఈ తాజా సుప్రీంకోర్టు తీర్పు పట్ల నిరసన వ్యక్తం చేయాల్సిందిగా ప్రజలకు మా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.
ఇట్లు
వై. సాంబశివరావు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి,
సి.పి.ఐ. ఎం.ఎల్.న్యూడెమోక్రసీ, ఏ.పి. రాష్ట్ర కమిటీ,
విజయవాడ
9-11-2019

No comments:

Post a Comment