Friday, November 22, 2019

ఇంగ్లీషు కొత్తేమీ కాదు!

ఇంగ్లీషు కొత్తేమీ కాదు!
22-11-2019 03:20:06

సర్కారు వారి అసలు ఉద్దేశం ఏమిటి?
ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడమా? లేక...
తెలుగు మాధ్యమాన్ని ఎత్తి వేయడమా?
ఇంగ్లీషు చదువులను దగ్గర చేయడమా? లేక...
తెలుగులో చదువుకునే అవకాశాన్ని పూర్తిగా దూరం చేయడమా?
లోతుగా ఆలోచించి చూస్తే... తెలుగు మాధ్యమాన్ని తుంచడమే సర్కారు వారి అజెండా అని అర్థమవుతోంది.
తెలుగును పూర్తిగా తుంచడమే అసలు సమస్య
బడుగుల బడుల్లో 15 ఏళ్ల కిందటి నుంచే ఆంగ్లం
సక్సెస్‌ స్కూళ్ల పేరిట వైఎస్‌ హయాంలోనే అమలు
ఇప్పుడు 3వ వంతు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం
సమాంతరంగా తెలుగు మాధ్యమం కొనసాగింపు
ఇప్పుడు... అంతా ఆంగ్లమయం అంటున్న జగన్‌
బడుల్లో తెలుగు మీడియం పూర్తిగా మూసివేత
దీనిపైనే భాషా నిపుణులు, టీచర్ల ఆందోళన
కానీ వారిని ఇంగ్లిష్‌ వ్యతిరేకులుగా చిత్రీకరించే యత్నం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం కొత్తేమీ కాదు! 15 సంవత్సరాల కిందటే బడుగులు చదివే బడుల్లోకి ఆంగ్ల మాధ్యమం ప్రవేశించింది. అన్ని వర్గాలకు ఆంగ్లంలో చదువుకునే అవకాశం ఎప్పటి నుంచో ఉంది. కాలం గడిచేకొద్దీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విస్తరిస్తూ వచ్చింది. అయితే... దీనికి సమాంతరంగా తెలుగు మాధ్యమంలోనూ బోధన సాగుతోంది. ఇప్పుడు కొత్తగా చేస్తున్నదేమిటంటే... మొత్తం అన్ని స్కూళ్లను ఆంగ్లమయం చేయడం! తెలుగును పూర్తిగా ఎత్తివేయడం! ..‘‘వెంకయ్య నాయుడు కుమారుడు, మనవళ్లు చదివింది ఏ మీడియం? చంద్రబాబు కుమారుడు చదివింది ఏ మీడియం? ఆయన మనవడు చదవబోయేది ఏ మీడియం? మీ పిల్లలు మాత్రం ఇంగ్లీషులో చదువుకోవాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగులు మాత్రం తెలుగులో చదువుకోవాలా?’’ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వర కు సర్కారు పెద్దలు సంధిస్తున్న ప్రశ్నలివి! తాజాగా.. ‘మీ పిల్లలు ఏ మీడియంలో చదివారో నిలదీయండి’ అంటూ స్వయంగా సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

ఇది కేవలం ఎదురు దాడికి దిగి, అవతలి వారి నోళ్లు మూయించేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్ప.. అర్థవంతమైన, హేతుబద్ధమైన వాదన కానే కాదు. ఎందుకంటే భాషావేత్తలు, నిపుణులు, విపక్షాలు, ఉపాధ్యాయులు అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఇంగ్లీషు మీడియంపై కానేకాదు! తెలుగు మాధ్యమానికి పూర్తిగా తలుపులు మూయడంపైనే! రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకునే అవకాశం ఎప్పటి నుంచో ఉంది. ఆ పాఠశాలల సంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది మిగిలిన పాఠశాలలకు కూడా ఆంగ్ల మాధ్యమాన్ని విస్తరించడం మాత్రమే! ఇది.. ఆంగ్ల మీడియం విస్తరణకు పరిమితమైతే ఎవరి నుంచీ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి కావు. కానీ.. తెలుగు మీడియంలో చదువుకునే అవకాశాలను లేకుం డా చేయడమే అసలు సమస్య! తెలుగు మాధ్యమాన్ని ఎత్తేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో మాతృ భాషను కనుమరుగు చేయడమే రహస్య అజెండాగా పెట్టుకున్నారనే విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నది ఇందుకే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారి ‘సక్సెస్‌’ స్కూళ్ల పేరిట ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. అదికూడా.. సీఎం జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే! ఇది కేంద్రప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం! క్రమేపీ ఆ స్కూళ్ల సంఖ్యను పెంచుతూ పోయారు. అయితే తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా అమలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఇది మరింత విస్తరించింది.

చంద్రబాబు హయాంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. సక్సెస్‌ స్కూళ్లను పూర్తిస్థాయి.. అంటే 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమంలోకి మార్చుతూ 2015 ఆగస్టు 14న జీవో జారీ చేశారు. ఇక... కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 6 నుంచి 8 వరకు ఆంగ్ల భాషా బోధన ప్రవేశ పెడుతూ 2015 ఏప్రిల్‌ 29న ఉత్తర్వులు వెలువడ్డాయి. మునిసిపల్‌ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ 2017జనవరి 2న ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ పాఠశాలలన్నింటిలో ఇంగ్లీషుతోపాటు తెలుగు మాధ్యమంలోనూ బోధన కొనసాగుతోంది. 2018-19 నుంచి మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో, ఇతర ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో సమాంతర సెక్షన్లు నిర్వహించాలంటూ చంద్రబాబు ప్రభుత్వమే 2017 అక్టోబరు 5న జీవో జారీ చేసింది. 2018-19 నుంచి ఒకటో తరగతి నుంచి ప్రారంభించి ప్రతి ఏటా ఒక తరగతికి విస్తరించాలని పేర్కొంది. అంటే రాష్ట్రంలోని విద్యార్థులకు 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అందుబాటులో ఉందన్న మాట! ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఇప్పుడు రాష్ట్రంలో మూడో వంతు పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం అందుబాటులో ఉంది.

ప్రైవేటు స్కూళ్లలో చదవలేని బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఎంచక్కా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటూనే ఉన్నారు. ఇది నిజం! మిగిలిన కొన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న జగన్‌ సర్కారు.. ఇప్పుడు తానే కొత్తగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ప్రకటించుకోవడం గమనార్హం. తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేయడం గురించి ప్రశ్నిస్తున్న వారిని, ‘మీ కొడుకులు, మనవళ్లది ఏ మీడియం’ అని నిలదీయడం, బలహీన వర్గాల పిల్లలు బాగు పడటం వారికిష్టం లేదన్నట్లుగా చిత్రీకరించడం మరో విచిత్రం! మాతృ భాషలో కూడా బోధన ఉండాలనే వారిని కుహనా మేధావులుగా, సన్యాసులుగా తిట్టిపోయడం దారుణం!

జీవో ఉపసంహరించాలి: విద్యార్థి సంఘాలు
ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతులకు ఇంగ్లీషు మీడియం మాత్రమే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 85ను విద్యార్థి సంఘాల ఐక్యవేదిక వ్యతిరేకించింది. ఈ మేరకు వేదిక ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, రెండు మాధ్యమాలూ కొనసాగించాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి కసాపురం రమేష్‌, ఉపాధ్యక్షుడు వి.భగవాన్‌ దాస్‌, పీడీఎ్‌సయూ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఆంగ్లంలో బోధన మింగుడు పడని విద్యార్థులు తెలుగు మాధ్యమంలోకి మారే అవకాశముంది. జగన్‌ సర్కారు ఆ అవకాశాన్ని తొలగిస్తుండటమే అసలు సమస్య. ప్రైవేటు స్కూళ్లలో దాదాపు తెలుగు మీడియం లేనట్లే. ప్రభుత్వమే దానిని తొలగిస్తోంది. ఇక ఆంగ్లంలో చదువుకోలేని పిల్లలకు దిక్కేది? ఇదే... నిపుణుల ప్రశ్న!

కోరుకుంటున్నది ఇదే.....
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 వేలకు పైగా ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఏటా దాదాపు 6.2 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 62శాతం మంది ఇంగ్లీషు మీడియం వారే. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులూ ఉన్నారు. ఏరకంగా చూసిన ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్తదేం కాదు. దీనిని తప్పనిసరి మాత్రం చేయలేదు. నిర్భంధం అంత కన్నా లేదు. ‘మేం ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించడం లేదు. కానీ... తెలుగుకు పూర్తిగా తలుపులు మూసివేసి, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపైనే మా ఆందోళన. ఇకనైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఇంగ్లీషుతోపాటు తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాల’ని విద్యావేత్తలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఎన్నెన్ని స్కూళ్లలో ఆంగ్లం...
పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో మొత్తం 44,659 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో... 15,759 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగుతోంది.
33,920 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (1-5 తరగతులు) ఉండగా... అందులో 9,623 పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో 4183 ప్రాథమికోన్నత పాఠశాలలు (1-7 తరగతులు) నడుస్తుండగా... వీటిలో 1,484 పాఠశాలల్లో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో బోధన అందుబాటులో ఉంది.
రాష్ట్రంలో మొత్తం 6,556 ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో 4,652 పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం కొనసాగుతోంది.
ఇవన్నీ ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలే. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలతోపాటు అందరికీ అందుబాటులో ఉన్నవే! ఆంగ్లంతోపాటు తెలుగు మాధ్యమానికీ వీటిలో చోటుంది.

No comments:

Post a Comment