Thursday, November 7, 2019

తెలుగు లేని సంఘం యేల?

తెలుగు లేని సంఘం యేల?
08-11-2019 04:06:43
అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మాతృభాషలోనే బోధన లేనప్పుడు సంఘం ఎందుకు? పిల్లల బడిలో అమ్మభాష రద్దయినప్పుడు ఆ ‘అధికారం' ఎవరికోసం? తెలుగు పునాదులే కదిలిపోతుండగా, ఇక అధ్యక్ష పీఠాలు ఉండేం లాభం?.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో.. అధికార భాషా సంఘంపై వెల్లువెత్తుతున్న ప్రశ్నల సరళి ఇదీ! ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ అంశమే హల్‌చల్‌ రేపుతోంది. 1974లో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం ఏర్పాటైంది. ఇది పరిపాలనా రంగంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసింది. మాతృభాషను కాపాడుకోవడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు అధికార భాషా చట్టాలు ఏర్పాటుచేసుకొన్నాయి. తెలుగు నుడికి గుడి కడుతూ.. ఏపీలోనే మొదటగా 23 శాఖలతో మండలం, దాని కన్నా తక్కువ స్థాయిలోని కార్యాలయాలలో అమ్మభాషను తప్పనిసరి చేయడం జరిగింది.

1974 నుంచి 1979 వరకు రాష్ట్ర స్థాయిలో తెలుగు అమలు విషయమై ప్రభుత్వ ఉత్తర్వులు జారీఅయ్యాయి. 1983లోముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుకు వెలుగు పెరిగింది. అప్పట్లో ప్రభుత్వ శాఖలు మాతృభాషలోనే ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ దశలన్నింటిలోనూ తెలుగు భాష విశిష్ఠతను భావితరాలకు వివరించేందుకు, పూర్తి స్థాయిలో జవసత్వాలు కల్పించేందుకు అధికార భాషా సంఘం ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించింది. అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షులుగా వావిలాల గోపాలకృష్ణయ్య పనిచేశారు. ఇప్పటి వరకు 14 మంది అధ్యక్షులుగా వ్యవహరించి తెలుగు భాషాభివృద్ధికి కృషి సల్పారు. అలాంటి విశిష్ఠ సంఘం ఉనికి ‘ఇంగ్లిష్‌ మీడియం’ జీవోతో ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఏపీ నెత్తిన ఆంగ్లం బండ.. సర్కారీ ఉత్తర్వుల సారాంశమేంటంటే ?
Posted November 7, 2019
6:05 pm
IST

ఆంధ్రప్రదేశా లేక ఆంగ్ల ప్రదేశా.. ఈ ప్రశ్న తాజాగా ఏపీని కుదిపేయడం మొదలు పెట్టింది. పదో తరగతి వరకు ఇంగ్లీష్ భాష కంపల్సరీ అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏపీలో దుమారానికి తెరలేపాయి. తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌గా మారుస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంతో మాతృభాషలను చంపేస్తున్నారని భాషాభిమానులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం- ఆంగ్ల పాఠశాలలవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని కౌంటర్‌ ఇస్తోంది. సర్కారీ బడులు- ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌గా మారితే లాభమా, నష్టమా ఈ ప్రశ్న ఇపుడు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజానీకంలో మొదలైంది.
ప్రభుత్వ పాఠశాల్ని ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ మార్చాలన్న అంశంపై అక్టోబర్ నెల 29వ తేదీన ప్రొఫెసర్‌ కె.బాలకృష్ణన్‌, సుధా నారాయణమూర్తి తదితర విద్యావేత్తల కమిటీతో ఏపీ సీఎం జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి ఈనెల 5వ తేదీన జీవో నెంబర్‌ 81ని జారీచేసి- కార్యాచారణ ప్రణాళిక ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. సర్కారీ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌కి బదులు CBSE సిలబస్‌ను ప్రవేశపెడతారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ఉంటుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది, పదో తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులో ఉంటుంది. ఈ జీవోపై విమర్శలు వస్తున్నాయి. 81వ జీవో చారిత్రక తప్పిదమనీ, మాతృభాషను మృతభాషగా చేయడమేనని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. పలు తెలుగు భాషా సంఘాలు ప్రభుత్వ చర్యను తప్పు పడుతున్నాయి. ఈ చర్య ద్వారా పిల్లల్లో తెలుగు నేర్చుకోవాలన్న కోరిక చచ్చిపోతుందని, భావితరాలకు తెలుగు భాష రాని దుస్థితి ఏర్పడుతుందని ఈ సంఘాలు వాదిస్తున్నాయి.
కానీ మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా యువతలో భాషా పరిఙ్ఞానాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. తెలుగు భాష పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే ఆంగ్ల భాషా పరిఙ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా బెటర్ ఉద్యోగావకాశాలు యువతకు అందేలా చూడాన్నదే తమ అభిమతమని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అంటున్నారు.
మరోవైపు టిడిపి జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపట్టారు. ”తెలుగు’లెస్సేనా’, ఎందుకింత తెగులు..?”,”ఏకపక్ష నిర్ణయం..,విద్యకు దూరమయ్యే ప్రమాదం”, ”మాతృభాషపై అంత అక్కసు ఎందుకో” ”డ్రాప్‌ అవుట్స్‌ పెరుగుతాయి, విద్యార్థులకు నష్టమే” ఇవన్నీ నేను ఇప్పుడు అంటున్నవి కావు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలి… అది కూడా విద్యార్థులకు ఇష్టమైతేనే.. అని నిర్ణయం తీసుకున్నపుడు వైసీపీ నాయకుల కూతలు ఇవి.. అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నారా లోకేశ్. 


తెలుగుపై జగన్‌ ‘రివర్స్‌’
08-11-2019 04:05:46

దేశమంతా మాతృభాషపై దృష్టి
రాష్ట్రంలో మాత్రం విరుద్ధ వైఖరి
మేధావుల మౌనమేల: రామకృష్ణ
జీవో రద్దుకు సంఘాల డిమాండ్
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్ల బోధన వల్ల తెలుగు భాషకు తీరని అన్యాయం జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రాలన్నీ తమ మాతృ భాషను అభివృద్ధి చేసుకొంటుంటే జగన్‌ ప్రభు త్వం రివర్స్‌లో వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రం లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం దుందుడుకు చర్యగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ‘విద్యా వ్యవస్థపై కూలంకష చర్చ జరగకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు పాఠశాల మానేసే పరిస్థితి రావొచ్చు. మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించే బాల, బాలికల్లో సృజనాత్మకత పెరుగుతుందని ప్రపంచ మేధావులు, విద్యావేత్తలు ముక్తకంఠంతో నినదించారు’ అని ఆ లేఖలో కన్నా గుర్తు చేశారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


ఇప్పటి వరకూ తెలుగులో అలవాటు పడ్డ విద్యార్థులు ఆర్నెళ్లలో బోధన మారితే తట్టుకోగలరా? ఉపాధ్యాయులు ఎలాంటి శిక్షణ లేకుండా బోధించ గలరా.? అని ప్రశ్నలను ఆ లేఖలో కన్నా సంధించారు. ‘ఇప్పటికే అక్షరాస్యతలో అంచున ఉన్న రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయాలు ప్రమాద ఘంటికలను మోగిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని అందరూ కోరుకొంటుంటే వాటికి భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు’ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలు తెలుగు జాతిని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని బీజేవైఎం మండిపడింది. మారుమూల గిరిజన జాతుల శ్రేయస్సు కోరి కేంద్ర ప్రభుత్వం వాళ్ల భాషలోనే బోధనలు చేయిస్తుంటే జగన్‌ ప్రభుత్వం పసిబిడ్డలపై ఒత్తిడి పెంచేలా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం అనాలోచిత చర్యని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేశ్‌ నాయుడు ధ్వజమెత్తారు. ‘పాదయాత్రలో నేను విన్నాను అని పదే పదే మాట్లాడిన జగన్‌.. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకతను ఎందుకు వినలేక పోతున్నారు.? చెవులు మూసుకున్నారా.?యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, లక్ష్మీపార్వతి ఎందుకు మౌనంగా ఉన్నారు? భావి భారత పౌరులకు అమ్మభాషను దూరం చేసిన చరిత్ర హీనుడిగా జగన్‌ మిగిలిపోతారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును ఎత్తివేసిన జీవో ఉపసంహరించుకోకుంటే ప్రజా వ్యతిరేకతను కూడగట్టి, మిమ్మల్ని గద్దెదించే వరకూ బీజేవైఎం ఉద్యమిస్తుంది’ అని హెచ్చరించారు.

లక్ష్మీపార్వతి స్పందించరేం?: సీపీఐ
రాష్ట్రాన్ని ఆంగ్లాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు విడుదల చేసిన జీవోపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమితురాలైన లక్ష్మీపార్వతి ఎందు కు స్పందించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. జగన్‌ అపరిపక్వ పాలనపై మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. త్వరలో ఉద్యోగ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసి ఆంగ్ల మీడియం జీవోను వెనక్కు తీసుకునేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇసుక కొరతకు ముమ్మాటికీ జగన్‌ చేతకానితనమే కారణమని ధ్వజమెత్తారు.

తెలుగునాటే
తెలుగు..లెస్సా?: తెలుగుయువశక్తి
తెలుగు అధికారభాషగా వున్న ఆంధ్రప్రదేశ్‌లోనే.. తెలుగువారు మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం లేకుండాపోతే.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి పరిస్థితి ఏమవుతుందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రశ్నించారు. ‘‘మాతృభాషలో చదువుకోవడమనేది విద్యార్థికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. దానిని కాలరాసేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తమిళనాడు జనాభాలో సుమారు 40 శాతం ఉన్న తెలుగువారంతా తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం కల్పించాలంటూ తమిళనాడు ప్రభుత్వంపై సుదీర్ఘకాలంగా వివిధ మార్గాల్లో ఇక్కడ పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే తెలుగు మాధ్యమంలో చదువుకునే మార్గం లేకపోతే మా ప్రవాసాంధ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వాల్ని మేం ఏమని అడగాలి? ‘నిర్బంధ తమిళం’ జీవోతో మైనారిటీ భాషా విద్యార్థులు పీక నొక్కుతున్న తమిళ ప్రభు త్వం.. ఇప్పుడు ఇక రెచ్చిపోవడం ఖాయం’ అని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ సంఘాల ఖండన
‘ఇంగ్లిష్‌ మీడియం’ అమలుపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకూరి సుభా్‌సచంద్రబోస్‌ అన్నారు. ఉపాధ్యాయులు, మేధావులు, తెలుగు భాషా పండితులతో సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. 1 నుంచి 8 వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని జాతీయ విద్యా విధానం చెబుతుంటే, జగన్‌ ప్రభుత్వం మాత్రం తెలుగు మాధ్యమాన్ని రద్దుచేయడం సరికాదన్నారు. కాగా, తెలుగు మీడియం రద్దు చేయడం సమంజసం కాదని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పి.బాబురెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం రెండూ కొనసాగుతున్నాయని, ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాల కమిటీ కోరితే ఇంగ్లీషు మీడియం ప్రారంభించుకోవడానికి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని వివరించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధంగా ఇంగ్లిష్‌ మీడియం పెట్టడం కోసం తెలుగు రాష్ట్రంలో మాతృభాష అయిన తెలుగు మీడియం రద్దు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు.

No comments:

Post a Comment