Wednesday, November 6, 2019

మనుస్మృతి (భాగం-3) - నాగవరపు రవీంద్ర

మనుస్మృతి (భాగం-3) -  నాగవరపు రవీంద్ర

బ్రాహ్మణులు తమ జీవిత కాలంలో నాలుగవ భాగం పాటు గురుకుల వాసంలో గడిపి తరువాత గృహస్థాశ్రమ మవలంబించి గృహంలో వుండాలి. బ్రాహ్మణుడు ఆపద లేనప్పుడు ఇతర జీవులకు ద్రోహం చేయకూడదు.

సుఖాపేక్ష లేక జీవించడానికి అవసరమైన డబ్బును స్వకర్మల నవలంబిస్తూ, బాధలు పడక సంపాదించాలి.

వర్తకాన్ని సత్యానృత మంటారు. స్వయంగా ఏ పనీ చేయలేకపోయినా ఎలాగైనా జీవితాన్ని గడపవచ్చుగానీ, సేవక వృత్తి ఎట్టి పరిస్థితులలోనూ చేయగూడదు. సేవక వృత్తిలో యజమానితో తిట్లుతినాలి. నీచపు పనులు చేయాలి కాబట్టి బ్రాహ్మణునికి సేవక వృత్తి సర్వదా నిషిద్ధము.

బ్రాహ్మణుడు పాటపాడి, నాట్యమాడి డబ్బు సంపాదించగూడదు. యాగము చేయించగూడని వానితో యాగం చేయించి డబ్బు సంపాదించగూడదు. ధనం వున్నా లేకున్నా పతితులనుంచి డబ్బు తీసుకోకూడదు.

సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు గ్రహణ సమయంలో నీటిలో ప్రతిబింబం కనిపించేటప్పుడు, సూర్యుడు మధ్యాహ్న సమయంలో నడినెత్తి మీదికి వచ్చినప్పుడు సూర్యుణ్ని చూడగూడదు. దూడకట్టు తాడును దాటగూడదు. మేఘం వర్షించేటప్పుడు పరుగెత్తగూడదు. నీటిలో కనిపించే తనప్రతిబింబాన్నిచూడగూడదు.

కామార్తుడైనా బహిష్టు దినాలలో మూడు రోజులు స్త్రీతో కలవకూడదు. ఒకే ప్రక్కమీద పడుకోగూడదు.

ఎప్పుడూ భార్యతో గూడా ఒకే పాత్రలో భోజనం చేయగూడదు. భార్య భోజనం చేస్తున్నా, తుమ్ముతున్నా, ఆవులిస్తున్నా, హాయిగా కాళ్ళు చాపుకుని, కూర్చొనివున్నా ఆమెను భర్త చూడకూడదు.

బ్రాహ్మణుడు తన భార్య కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నా, తలంటుపోసు కుంటున్నా, పైట లేకుండా ఉన్నా, ప్రసవిస్తున్నప్పుడు ఆమెను చూడకూడదు.

దెసమొలతో నున్న స్త్రీని ఏ పురుషుడూ చూడకూడదు.

గృహస్థుడు ఒంటి బట్ట కట్టుకుని భోజనం చేయకూడదు. దెసమొలతో స్నానం చేయకూడదు. దారిలోను, బూడిద మీద, ఆవుల మందలలో మలమూత్ర చేయకూడదు.

నాగేటితో దున్నిన నేల, నీరు, పర్వతము, అగ్నిహోత్రానికై ఇటుకలు పరిచిన ప్రదేశము, పాడుబడిన గుడి, పుట్ట వీటిలో ఎప్పుడూ మలమూత్ర విసర్జన చేయకూడదు.

గాలిని, అగ్నిని, బ్రాహ్మణుని, సూర్యుని, నీతిని, గోవుని చూస్తూ వాటి కెదురుగా కూర్చుని ఎప్పుడూ మలమూత్ర విసర్జన చేయకూడదు.

నేలను కొయ్యలు, మట్టిపెళ్లలు, గడ్డి, ఆకులు మొదలైన వాటితో మూసి, తల వంచుకుని, మౌనంలో, శరీరాన్ని కప్పుకుని, తలకు ముసుగువేసుకుని మల మూత్రాలను విసర్జించాలి.

ఆశుద్ధాలను, కళ్ళి, అవి అంటుకున్న బట్టలను నీళ్ళల్లో వేయకూడదు.

అగ్నిని దాటిపోకూడదు.

సంధ్యాకాలంలో భోజనం చెయ్యకూడదు. తాను ధరించిన పూవులదండను స్వయంగా తీయకూడదు. పాడుబడిన ఇంటిలో ఒంటరిగా ఉండకూడదు.

ధనంలోనూ, విద్యలోనూ, తనకన్నా మించినవాడు నిద్రపోతుంటే లేపకూడదు. బహిష్టు అయిన ఆమెతో మాట్లాడకూడదు.

నీళ్ళు తాగుతున్న ఆవును గాని, పాలు తాగుతున్న దూడను గాని లాగ కూడదు. పాలుతీసేతప్పుడు మాత్రం లాగవచ్చు. ఇతరుల దూడలు పాలు తాగుతుంటే వాళ్ళకు చెప్పకూడదు.

చెడ్డవాళ్ళు ఎక్కువగా గల గ్రామములో, వ్యాధులు ఎక్కువగా వుండే దేశంలో వుండకూడదు. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. కొండమీద చాల కాలం నివసించకూడదు. శూద్రుడు పరిపాలన చేసె రాజ్యంలో వుండగూడదు.

కుతికల బంటిగీ భోంచేయగూడదు. కడుపును సగం ఘన ఆహారపదార్థాలతో, పావు వంతు ద్రవ పదార్థాలతో పూరించి, పావు వంతు ఖాళీగా వదలాలి. పగలు బాగా భోంచేసినవాడు, రాత్రిపూట భోజనంచేయకూడదు.

ఐహిక ప్రయోజనమో, ఆమిష్మిక ప్రయోజనమో లేని పనిని చేయగూడదు.

దోసిలితో నీళ్ళను తాగకూడదు. తొడపై పెట్టుకుని దోసెలు మొదలైన వంటకాలను తినకూడదు. ప్రయోజనం లేని విషయాన్నీ తెలుసుకోవడానికి ఉత్సాహాపడకూడదు.

శాస్త్ర విరుద్ధంగా నాట్యం చేయగూడదు. పాటలు పాదగూడదు. సంగీత వాద్యాలను మ్రోగించకూడదు. స్నేహంతో భుజం మీద తట్టగూడదు. కావాలని అరుపులు, కేకలు వేయకూడదు.

ఎప్పుడు గూడా కంచుపాత్రలలో పాద ప్రక్షాళన చేయకూడదు. పగిలిన కుండలలో, పగిలిన పాత్రలలో, మనసుకు ఇంపుగా లేని పాత్రలలో భోజనం చేయగూడదు.

ఒకరు వేసుకున్న బట్టలను, చెప్పులను వేరొకళ్ళు వేసుగోగూడదు. అలాగే యజ్ఞోపవీతము, ఆభరణాలు, పూలదండలు మొదలైనవి ఇతరులు ఉపయోగించినవి మనం ధరించకూడదు.

తుంటరిని, కొమ్ములు తిరిగినవి, గ్రుడ్డివి, గిట్టలు లేనివి, తొకలేనివి మొదలయిన ఎద్దులు కట్టిన బళ్ళలో ప్రయాణం చేయకూడదు.

మచ్చిక పడిన, త్వరగా నడిచే, మంచి లక్షణాలు గలిగిన, మంచి రూపు వన్నె కలిగిన ఎద్దులు కట్టిన బండిలో ప్రయాణం చేయాలి. మునికోలతో ఎక్కువగా పోడవకుండా పోవాలి.

లే ఎండలో వుండగూడదు. పగిలిన పీటకొయ్యను వాడగూడదు. గోళ్ళను, వెంట్రుకలను తెంపగూడదు. గోళ్ళను పళ్ళతో కొరికి తీయకూడదు.

ప్రయోజనం లేకుండా, గోళ్ళతో గడ్డిని త్రుంచకూడదు. ఫలితం లేని పని చేయగూడదు. భవిష్యత్తులో కష్టాలు వచ్చే పనులు చేయకూడదు.

మనసులోనూ, ప్రవర్తనలోనూ ఆచారము లేనివాడు, ఉన్నవీ, లేనివీ చాడీలు చెప్పేవాడు, గడ్డిని త్రుంచువాడు త్వరగా నశిస్తారు.

లౌకిక విషయాల్లోగాని, శాస్త్ర సంబంధమైన విషయాలలో గాని, మొండిగా మాట్లాడకూడదు ఆవుల మీద కూర్చుని స్వారీ చేయకూడదు. కాని వాటిని బండికి కట్టవచ్చును.

చుట్టూ ప్రాకారంగల గ్రామంలోకిగాని, చుట్టూ గోడలు గల ఇంట్లోకి గాని తలుపులు మూసివున్నప్పుడు గోడలు దూకి లోపలి ప్రవేశింపకూడదు. రాత్రి వేళల్లో చెట్టు మొదట్లో పడుకోకూడదు. చెట్టుకు దూరంగా పడుకోవాలి.

సరదాకైనా పాచికలు మొదలైన వాటితో ఆడగూడదు. చెప్పులను చేతిలోఒకచోట పట్టుకుని నుంచి మరోచోటికి పోగూడదు. మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. ఆసనం మీద కంచం పెట్టుకుని భోంచేయకూడదు.

సూర్యుడు అస్తమించిన తరువాత నువ్వులతో చేసిన పదార్థాలను తినకూడదు. దెసమొలతో నిద్రపోకూడదు. ఎంగిలి చేతులు కదగకుండా వేరే ప్రదేశానికి పోకూడదు.

కాళ్ళు కడుక్కుని భోజనం చెయ్యాలి. తడికాళ్ళతో పడుకోగూడదు. తడి పాదాలతో భోజనం చేసేవాడు దీర్ఘాయుస్సు పొందుతాడు.

చెట్లుచేమలతో నిండి పగలే చీకటిగా అనిపించే అడవులలోకి పోకూడదు. తన మూత్ర, పురీషములను చూడగూడదు. ఈదుకుంటూ నదిని దాటకూడదు.

ఎక్కువకాలం బ్రతక దలచుకున్నవాడు వెంట్రుకలు, బూడిద, ఎముకలు, చిల్లపెంకులు, దూది, పుర్రెలు వీటిని తొక్కకూడదు. భ్రష్టులతోను, చండాలురతో బానిసాలతో, మూర్ఖులతో, ధనగర్వంతో విర్రవీగేవారితో, చాకలి మొదలైన వాళ్ళతో, నీచ జాతుల వాళ్ళతో ఒకచోట కలిసి ఉండకూడదు.

లోక వ్యవహారాల్లో పనికివచ్చే అర్థశాస్త్రాన్ని శూద్రులకు బోధింపకూడదు. ఎవడు శూద్రుడికి ధర్మోపదేశం చేస్తాడో, ఎవడు వ్రతాలను ఉపదేశిస్తాడో అతడు భయంకర నరకాన్ని అనుభవిస్తాడు.

రెండు చేతులతో తలగోకు కొనరాదు. భోజనము చేసిన పిదప తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.

కోపంతోనైనా జుట్టుపట్టుకుని, తలను వంచి తలపై కొట్టగూడదు. ఆరోగ్యం బావుండి, స్నానం చేసేటప్పుడు తప్పకుండా తలస్నానం చెయ్యాలి.

జంతు హింసతో జీవించే వాడి దగ్గరనుంచి, నువ్వులు మొదలైనవాటి నుంచి నూనె తీసేవాడి నుంచి, మద్యము విక్రయించే వాడి దగ్గర నుంచి, వ్యభిచారమే జీవనాధారం గల వాళ్ళనుంచి దానం తీసుకోకూడదు.

పది వధ్యస్థానముల వంటిది గానుగాడేచోటు. పది గానుగాడే స్థానాలతో సమానం మధ్యస్థానము. పది కల్లంగళ్ళతో సాటి బోగం పాళెం. పది బోగము పల్లెల వంటివాడు క్షతియుడు.

పదివేల జంతువుల హింసించు కటికవాడితో సమానం రాజు. కాబట్టి అలాంటి రాజు వద్ద నుంచి ఏమీ తీసుకోకూడదు.

లోభియు శాస్త్రమర్యాద తప్పిన రాజువద్ద నుంచి ఎవడు ప్రతిగ్రహము తీసుకుంటాడో వాడు ఇరవై ఒక్క రకాల నరకాలను వరసగా పొందుతాడు.

తెల్లవారు జాము బ్రాహ్మముహూర్తము. అట్టి ముహూర్తములో లేని ధర్మము, ధనం వీటిని గురించి ఆలోచించాలి. ఆ ధర్మార్థ చింతలవల్ల కలిగే దేహబాధాలను గూర్చి వేద తత్త్వ అర్థాలను గురించి ఆలోచించాలి.

ప్రభాత కాలన మంచంమీద నుంచి లేచి, కాల కృత్యాలు తీర్చుకుని ప్రాతః సంధ్యావందనం ఆచరించి, జపం చేస్తూ నిలుచోవాలి. అలాగే సాయంకాలం సంధ్యా వందనం ఆచరించి, గాయత్రి జపం చెయ్యాలి.

ఋషులు చాలాకాలం సంధ్యావందనాద్యనుష్టానము చేయడంతో దీర్ఘాయుస్సు పొంది, చిరకాలం జీవించి, బుద్ధిని, బ్రతికివున్నప్పడు యశస్సును, చనిపోయి కీర్తిని పొందారు. కాబట్టి ఆయుస్సు మొదలైనవి కోరేవారు చిరకాలం సంద్యో పాసనం చెయ్యాలి.

స్వర వర్ణబేధాలు తెలియకుండా వేదమును అధ్యయనం చేయడం తగదు. శూద్రుల సమక్షంలో వేదమును అధ్యయనం చేయగూడదు. వేకువజామున లేచి వేదాధ్యయనం చేసి అలసటతో మల్లి పడుకుని నిద్రపోకూడదు.

అమావాస్యరోజున వేదం పఠిస్తే గురువు చనిపోతాడు. చతుర్దశి యందు వేదము పఠిస్తే శిష్యుడు చనిపోతాడు. అష్టమి, పూర్ణిమ రోజుల్లో వేదము పఠించిన వ్యక్తి నశిస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో వేదాధ్యయనం చేయగూడదు.

మంచంమీద పడుకుని, ఎత్తుపీఠం మీద కాళ్ళు చాచుకుని, మాంసం భుజించి వేదపఠనం చేయగూడదు. సూర్యచంద్ర గ్రహణ సమయంలో మూడురోజులు అధ్యయనం చేయగూడదు.

నీటిమధ్యలో వున్నపుడు, అర్థరాత్రి సమయంలో, కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో, ఎంగిలితో ఉన్నపుడు, రాత్రియందు నాలుగు ముహూర్తముల కాలం వేదాధ్యయనం పనికిరాదు.

రాజుకు పుత్రుడు జన్మించినపుడు మూడు రోజులు వేదాధ్యయనం చేయగూడదు.

శవం గ్రామంలో వున్నప్పుడు, జనం గుంపులుగా చేరి రోదిస్తున్నప్పుడు వేదాధ్యయనం పనికిరాదు.

దుమ్ము రేగుతున్నప్పుడు, దిక్కులు మండుతున్నప్పుడు, నక్కలు కూస్తున్నప్పుడు, కుక్కలు, గాడిదలు, ఒంటెలు రోదనం చేసేటప్పుడు, జనాల మధ్యలో ఉన్నప్పడు వేదాలను పఠించకూడదు.

శ్మశాన సమీపంలో, గ్రామ సమీపంలో, పశువుల కొట్టంలో, స్త్రీతో సంభోగించినప్పుడు, ధరించిన వస్త్రాన్ని అలాగే ధరించి వేదాధ్యయనం చేయకూడదు.

గుర్రంమీద ఎక్కి కూర్చుని, చెట్టు ఎక్కి, ఏనుగుమీద కూర్చుని, నావ ఎక్కి, గాడిదమీద కూర్చుని, ఒంటెను ఎక్కి, చవిటి నేలపై కూర్చుని, బండి మొదలైన వాటిమీద పోతూ వేదాధ్యయనం చేయకూడదు. సూతకము కలిగినప్పుడు వేదముల అధ్యయనం నిషిద్ధం. ఋగ్వేదము దేవతలు, యజుర్వేదము మానవులు, సామవేదము పితరులు దేవతలుగా గలది. కాబట్టి సామవేద ధ్వని యశుచి – అయినది.

పశువులు, కప్పలు, పిల్లి, కుక్క, పాము, ముంగిస, ఎలుక గురుశిష్యులకు నడుమవస్తేనో ఆ రోజంతా అధ్యయనం చేయకూడదు.

అమావాస్య, అష్టమి, పౌర్ణమి, చతుర్దశి ఈ రోజుల్లోనూ, భార్య బహిష్టు అయినప్పుడు మూడు రోజులు బ్రాహ్మణుడు భార్యతో కలవకూడదు.

భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. ఎక్కువ బట్టలు ధరించి స్నానం చేయకూడదు. మొసళ్ళు మొదలైనవి ఉన్నదీ, లేనిదీ తెలుసుకోకుండా జలాశయాల్లో స్నానం చేయకూడదు.

శిలారూపంలో ఉన్న దేవతలయొక్క, తండ్రి, గురువు, రాజు ఆచార్యుడి నీడలను, చండాలుని నీడను బుద్ధి పూర్వకంగా తొక్కకూడదు, దాటకూడదు.

స్నానం చేసిన నీళ్ళను, మలమూత్రాలను, రక్తం, కఫం, వాంతి చేసుకున్న వస్తువు, నమిలి ఉమ్మివేసిన తములము మొదలైన వానిని బుద్ధి పూర్వకంగా తొక్కకూడదు.

శత్రువుని, శత్రువుకి సాయం చేసినవాడిని, అధర్మశీలున్ని, దొంగని, పరభార్యని కొలవగూడదు.

ఇతరుల భార్యని కాంక్షించడం పురుషునికి ఆయుక్షీణం కలిగిస్తుంది. అలా ఆయుక్షీణతను కలిగించేది ప్రపంచంలో మరొకటి లేదు.

ధన, ధాన్య, పశు, క్షేత్రాదులు ఎక్కువగా కావాలని కోరేవాడు క్షత్రియుణ్ణి, పాముని, బ్రాహ్మణుణ్ణి ఎప్పుడూ అవమానింపగూడదు.

వ్యాపారాదులలో నష్టపోయి సంపద అంతా పోయినా తనను తాను నిందించు కోరాదు. బ్రతికి వున్నంతవరకు డబ్బు సంపాదించాలను కోవాలి. డబ్బు సంపాదించడం కష్టమని భావించగూడదు.

విన్నది విన్నట్లు, చూసింది చూసినట్టు చెప్పడం సత్యం. అలాంటి సత్యాన్ని చెప్పాలి. ఎదుటివాని మనసుకు తగినట్టుగా చెప్పడం ప్రియం. అలాంటి ప్రియమైన మాటలను చెప్పాలి. సత్యమయినా అప్రియమైన మాటలను చెప్పగూడదు. ప్రియమయినా అసత్యాలను చెప్పగూడదు. ఇది అనాది ధర్మము.

ఒకళ్ళతో అనవసరంగా వాదులాటను, పగను పెట్టుకోగూడదు.

మరీ వేకువ జామున, పగలు రెండు జాములప్పుడు, కుల శీలాలు తెలియని కొత్తవాళ్ళతోను, పాపులతోను కలిసి ప్రయాణము చేయగూడదు.

Share this:

No comments:

Post a Comment